ఫైనల్ ‘షాట్’
ముంబై: ఒకరిదేమో నిలకడ.. మరొకరిదేమో సంచలనం. అంతర్జాతీయ యవనికపై భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్... పి.వి.సింధుల నేపథ్యం ఇది. అలాంటి వీరిద్దరు ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) తొలి ట్రోఫీ కోసం మరోసారి ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. శనివారం ఇక్కడి ఎన్‌ఎస్‌సీఏ స్టేడియంలో జరిగే ఫైనల్లో హైదరాబాద్ హాట్‌షాట్స్, అవధ్ వారియర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఓవరాల్‌గా ఈ పోటీలో హాట్‌షాట్స్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నా... సింధు బృందం నుంచి గట్టి పోటీ తప్పకపోవచ్చు. ఇప్పటి వరకు వ్యక్తిగతంగా ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన సైనా... మరో విజయంపై దృష్టిపెట్టింది.
అలాగే కీలకమైన సమయంలో సహచరులను ప్రోత్సహిస్తూ జట్టును ముందుండి నడిపిస్తోంది. ఆగస్టు 15న సింధుతో జరిగిన మ్యాచ్‌లో ఈ ప్రపంచ నాలుగో ర్యాంకర్ సులువుగా గెలిచినా... ఈసారి మాత్రం ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన తప్పకపోవచ్చు. ఎందుకంటే ప్రపంచస్థాయి క్రీడాకారిణిలను ఓడించిన సింధు కూడా సూపర్ ఫామ్‌లో ఉంది. గతంలోలాగే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ గెలుపుపైనే హైదరాబాద్ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
రెండో సింగిల్స్‌లో తనోంగ్‌సుక్ సత్తా చాటేందుకు సిద ్ధంగా ఉన్నాడు. డబుల్స్‌లో షెమ్ గో, వాహ్ లిమ్; మిక్స్‌డ్‌లో తరుణ్ కోనా-ప్రద్న్యా గాద్రె ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. మరోవైపు సింధు కూడా ప్రతీకారం కోసం ఎదురుచూస్తోంది. సైనాను ఓడిస్తే మిగతా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాబట్టి గెలుపే లక్ష్యంగా ఆమె బరిలోకి దిగుతోంది. అయితే సింధు నిరాశపర్చినా... మిగతా మ్యాచ్‌ల్లో గెలిచే ఆటగాళ్లు ఉండటం అవధ్‌కు లాభిస్తోంది. శ్రీకాంత్ సంచనలం సృష్టిస్తే.. గురుసాయిదత్ రెండో సింగిల్స్‌లో ఓడినా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే డబుల్స్, మిక్స్‌డ్‌లో మార్సిస్ కిడో విశేషంగా రాణిస్తున్నాడు. ఇతనికి మథియాస్ బోయే, పియా బెర్నాడెత్‌ల నుంచి మంచి సహకారం అందుతోంది. ఏదేమైనా ఇరుజట్లలో అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉండటంతో పోటీ రసవత్తరంగా జరగడం ఖాయం.
ఫైనల్‌కు చేరారిలా
హాట్‌షాట్స్
3-2తో అవధ్‌పై గెలుపు
2-3తో ఢిల్లీ చేతిలో ఓటమి
4-1తో పుణేపై గెలుపు
3-2తో ముంబైపై గెలుపు
2-3తో బంగాబీట్స్ చేతిలో ఓటమి
3-0తో పుణేపై గెలుపు (సెమీస్)
అవధ్ వారియర్స్
2-3తో హాట్‌షాట్స్ చేతిలో ఓటమి
1-4తో బంగా బీట్స్ చేతిలో ఓటమి
4-1తో ఢిల్లీపై గెలుపు
3-2తో ముంబైపై గెలుపు
3-2తో పుణేపై గెలుపు
3-2తో ముంబైపై గెలుపు (సెమీస్)