బ్యాడ్మింటన్‌లో ఏపీకి చోటు లేదు!
జాతీయ క్రీడల ఆర్గనైజర్ల నిర్వాకం
సాక్షి, హైదరాబాద్: దేశంలో బ్యాడ్మింటన్ అంటేనే గుర్తొచ్చే పేరు హైదరాబాద్. సైనా, సింధు, శ్రీకాంత్‌లాంటి భారత స్టార్ క్రీడాకారులంతా ఇక్కడి వారే. కానీ కేరళలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14వరకు జరిగే జాతీయ క్రీడల్లో మాత్రం వీళ్లు ఆడటానికి అవకాశం లేకుండా పోయింది. క్రీడలను నిర్వహిస్తున్న కేరళ రాష్ట్రం వైఖరి కారణంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక కూడా బ్యాడ్మింటన్ జట్లను పంపలేకపోతున్నాయి. జాతీయ క్రీడల టీమ్ ఈవెంట్‌లో ఎనిమిది జట్లు బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. గత క్రీడల విజేత, ప్రస్తుత క్రీడల ఆతిథ్య జట్టుతో పాటు ఆరు జోన్స్ నుంచి విజేతలు టోర్నీలో పాల్గొనాలి.
సౌత్‌జోన్ విజేత కేరళ కాగా... గత క్రీడల చాంపియన్, ఆతిథ్య రాష్ట్రం కూడా అదే కావడంతో... మరో రెండు జట్లు పాల్గొనేందుకు అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం గత క్రీడల రన్నరప్, సౌత్‌జోన్ రన్నరప్ గేమ్స్‌లో పాల్గోవచ్చు. దీని ప్రకారం గత క్రీడల రన్నరప్ ఆంధ్రప్రదేశ్, సౌత్‌జోన్ రన్నరప్ కర్ణాటకలతో ఎనిమిది జట్లను ప్రకటించారు. అయితే కేరళ దీనికి అభ్యంతరం తెలిపింది. మారిన నిబంధనల ప్రకారం రెండు స్లాట్‌లు ఖాళీ ఉంటే అన్ని జోన్ల రన్నరప్‌లతో డ్రా తీసి రెండు జట్లను ఎంపిక చేయాలని వాదించింది. దీంతో ఏపీ, కర్ణాటకలలో జ్వాల, అశ్విన్ సహా పలువురు స్టార్ క్రీడాకారులు టీమ్ ఈవెంట్స్‌లో గేమ్స్‌కు దూరం కావాల్సి వస్తోంది.
కేరళ క్రీడాకారుల కోసమే...
ఈసారి జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన తమ రాష్ట్ర క్రీడాకారుల కోసం కేరళ భారీగా నజరానాలు ప్రకటించింది. పతకాలు గెలిస్తే 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు ఇస్తారు. బ్యాడ్మింటన్‌లో ఏపీ క్రీడాకారులు వస్తే తమ వాళ్లకు పతకాలు రావని కేరళ సంఘం భావించింది. దీంతో నిబంధనలను మార్చాలని ఒత్తిడి తెచ్చి సఫలీకృతమైంది. ‘నిబంధనల ప్రకారం కర్ణాటక, ఏపీలతో నేను ఎనిమిది జట్ల పేర్లు పంపాను. పాత సంప్రదాయాన్నే పాటించాలని వాదించాను.
కానీ కేరళ మాటే చెల్లింది. మనవాళ్లు ఆడితే వాళ్లకు పతకాలు రావని తెలుసు. అందుకే విశ్వప్రయత్నాలు చేసి ఏపీని అడ్డుకున్నారు’ అని బాయ్ కార్యదర్శి పున్నయ్యచౌదరి చెప్పారు. మరోవైపు కర్ణాటక సంఘం అధ్యక్షుడు విమల్ కుమార్ కూడా కేరళ తీరుపై మండిపడ్డారు. నిబంధనలు ఎప్పుడు మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ కేరళ సంఘం కార్యదర్శి మురళీధరన్ మాత్రం తాము నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని చెబుతున్నారు. మొత్తానికి స్టార్స్ లేకుండానే జాతీయ క్రీడల బ్యాడ్మింటన్ జరగబోతోంది.