పారిస్: కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల ప్రదర్శనను మినహాయిస్తే అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సర్క్యూట్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. సైనా, సింధు నిలకడగా రాణిస్తున్నప్పటికీ తుది పోరులో బోల్తా పడటం... లేదంటే తై జు యింగ్ (చైనీస్ తైపీ), బీవెన్ జాంగ్ (అమెరికా), అడ్డంకిని దాటలేకపోతున్నారు. మరోవైపు గతేడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్‌తో దుమ్మురేపిన శ్రీకాంత్ ఈ సీజన్‌లో తొమ్మిది టోర్నీల్లో ఆడినా ఒక్కదాంట్లోనూ ఫైనల్‌కు చేరలేకపోయాడు. ముఖ్యంగా శ్రీకాంత్‌కు ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ ఏడాది నాలుగు టోర్నీల్లో కెంటో మొమోటాతో ఆడిన శ్రీకాంత్ ఒక్కసారీ అతడిని ఓడించలేకపోయాడు. మరోవైపు ఈ ఏడాది తై జు యింగ్ చేతిలో సైనా ఐదుసార్లు... బీవెన్ జాంగ్ చేతిలో సింధు రెండుసార్లు ఓడిపోయారు. ఈ నేపథ్యంలో మంగళవారం మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్‌లోనూ సైనా, సింధు, శ్రీకాంత్‌లకు వరుసగా తై జు యింగ్, బీవెన్ జాంగ్, కెంటో మొమోటా ఎదురుకానున్నారు.
మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లోనే బీవెన్ జాంగ్‌తో సింధు తలపడనుంది. గతవారం డెన్మార్క్ ఓపెన్ తొలి రౌండ్‌లో, ఈ ఏడాది ఇండియా ఓపెన్ ఫైనల్లో బీవెన్ జాంగ్ చేతిలో సింధు పరాజయాన్ని ఎదుర్కోంది. సైనా తొలి రౌండ్‌లో సెనా కవకామి (జపాన్)తో ఆడనుంది. తొలి రౌండ్‌ను దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో నొజోమి ఒకుహారా (జపాన్) లేదా బీట్‌రిజ్ కొరాలెస్ (స్పెయిన్)లలో ఒకరితో సైనా తలపడుతుంది. ఈ మ్యాచ్‌లోనూ సైనా గెలిస్తే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, ఈ ఏడాది ఎనిమిది టైటిల్స్ నెగ్గి అద్వితీయమైన ఫామ్‌లో ఉన్న తై జు యింగ్ ఎదురయ్యే చాన్స్ ఉంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో శ్రీకాంత్ ఆడనున్నాడు. ఆసియా క్రీడల్లో రెండో రౌండ్‌లోనే వోంగ్ వింగ్ చేతిలో శ్రీకాంత్ ఓడిపోయాడు. ఒకవేళ శ్రీకాంత్ తొలి రౌండ్‌ను దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో లీ డాంగ్ కెయున్ (కొరియా)... క్వార్టర్ ఫైనల్లో కెంటో మొమోటా ప్రత్యర్థులుగా ఉండే అవకాశం ఉంది. శ్రీకాంత్‌తోపాటు సమీర్ వర్మ, సాయిప్రణీత్ కూడా ఈ టోర్నీ బరిలో ఉన్నారు. తొలి రౌండ్‌లో బ్రెజిల్ ఆటగాడు వైగోర్ కొల్హోతో సాయిప్రణీత్... ఆసియా క్రీడల చాంపియన్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో సమీర్ వర్మ ఆడనున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; మను అత్రి–సుమీత్ రెడ్డి; అర్జున్–శ్లోక్ రామచంద్రన్ జోడీలు... మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్– అశ్విని; రోహన్ కపూర్–కుహూ గార్గ్; మహిళల డబుల్స్‌లో మేఘన–పూర్వీషా రామ్ జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
సైనా, శ్రీకాంత్ క్వార్టర్స్ దాటేనా?
Published Tue, Oct 23 2018 12:34 AM | Last Updated on Tue, Oct 23 2018 12:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment