ముగింపు అదిరేనా! | world super series finals starts to day | Sakshi
Sakshi News home page

ముగింపు అదిరేనా!

Published Wed, Dec 17 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

ముగింపు అదిరేనా!

ముగింపు అదిరేనా!

నేటి మధ్యాహ్నం గం. 2.30 నుంచి
 స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
 
 నేటి నుంచి వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్    
 బరిలో సైనా, శ్రీకాంత్   
 ఇద్దరికీ అనుకూలమైన ‘డ్రా’

 

 ఈ ఏడాదిలో ఇప్పటివరకు భారత బ్యాడ్మింటన్‌కు ఎన్నో గొప్ప విజయాలు లభించాయి. సైనా నెహ్వాల్, శ్రీకాంత్, సింధు, పారుపల్లి కశ్యప్, ప్రణయ్ తదితరులు అంతర్జాతీయ వేదికలపై తమ రాకెట్‌తో రఫ్పాడించారు. నిలకడైన ఆటతీరుకు ప్రతిఫలంగా సైనా, శ్రీకాంత్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’కు అర్హత సాధిం చారు. బుధవారం మొదలయ్యే ఈ మెగా ఈవెంట్‌లోనూ ఈ ఇద్దరూ మెరిసి సీజన్ ముగింపును కూడా చిరస్మరణీయం చేస్తారో లేదో వేచి చూడాలి.
 
 దుబాయ్: ఈ ఏడాదిలో చివరి పరీక్షకు భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ సిద్ధమయ్యారు. బుధవారం మొదలయ్యే ప్రతిష్టాత్మక ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’లో ఈ ఇద్దరు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రోజున మహిళల సింగిల్స్‌లో షిజియాన్ వాంగ్ (చైనా)తో సైనా; పురుషుల సింగిల్స్‌లో కెంటో మొమోటాతో శ్రీకాంత్ తలపడతారు.
 
 ‘డ్రా’ను పరిశీలిస్తే... స్థాయికి తగ్గట్టు ఆడితే సైనా, శ్రీకాంత్ కనీసం సెమీఫైనల్‌కు చేరుకునే అవకాశాలున్నాయి. ఈనెల 21 వరకు జరిగే ఈ టోర్నీ లో మొత్తం ఎనిమిది మందిని నలుగురు చొప్పున రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో సైనా నెహ్వాల్, షిజియాన్ వాంగ్ (చైనా), జీ హ్యున్ సుంగ్ (కొరియా), యోన్ జూ బే (కొరియా) ఉన్నారు. గ్రూప్ ‘బి’లో యిహాన్ వాంగ్ (చైనా), ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్), తై జూ యింగ్ (చైనీస్ తైపీ), అకానె యామగుచి (జపాన్)లకు చోటు కల్పించారు. లీగ్ పోటీల తర్వాత నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి.
 పురుషుల సింగిల్స్ గ్రూప్‌‘బి’లో శ్రీకాంత్‌తో కలిపి టామీ సుగియార్తో (ఇండోనేసియా), కెంటో మొమోటా (జపాన్), జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్) ఉన్నారు. గ్రూప్ ‘ఎ’లో చెన్ లాంగ్ (చైనా), సన్ వాన్ హో (కొరియా), కెనిచి టాగో (జపాన్), క్రిస్టియాన్ విటిన్‌గస్ (డెన్మార్క్)లకు చోటు కల్పించారు. రెండు గ్రూప్‌ల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు.  పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 80 వేల డాలర్ల (రూ. 50 లక్షల 56 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ అందజేస్తారు.
 
 ఈ ఏడాది జరిగిన మొత్తం 12 సూపర్ సిరీస్ టోర్నమెంట్‌ల ద్వారా ఐదు విభాగాల్లో (మహిళల సింగిల్స్, డబుల్స్, పురుషుల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్) అత్యధికంగా పాయింట్లు సంపాదించిన టాప్-8 మందికి ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’లో ఆడే అవకాశం లభిస్తుంది.
 
 ‘‘ఈ టోర్నీ కోసం పకడ్బందీగా సిద్ధమయ్యాను. ఎనిమిది మంది అగ్రశ్రేణి క్రీడాకారిణులు ఉన్నారు. ముందంజ వేయాలంటే అందరికంటే బాగా ఆడాల్సి ఉంటుంది. చైనా నుంచి యిహాన్ వాంగ్ కంటే షిజియాన్ వాంగ్‌తో ఆడేందుకే ప్రాధాన్యత ఇస్తాను. ఎప్పటిలాగే నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు కృషి చేస్తాను.’’            
 -సైనా నెహ్వాల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement