బాసెల్‌లో భారత షట్లర్లు, కోచ్‌లు
బాసెల్: కొత్త సీజన్‌లో తొలి టైటిల్ సాధించాలనే లక్ష్యంగా భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ స్విస్ ఓపెన్‌లో బరిలోకి దిగుతున్నారు. నేడు మొదలయ్యే ఈ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో సింధుకు సులువైన ‘డ్రా’ ఎదురుకాగా... సైనాకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. రెండో సీడ్‌గా పోటీపడుతున్న ప్రస్తుత ప్రపంచ చాంపియన్ సింధు తొలి రౌండ్‌లో టర్కీ క్రీడాకారిణి, ప్రపంచ 29వ ర్యాంకర్ నెస్లిహాన్ యిజిట్‌తో ఆడునుంది. ముఖాముఖి రికార్డులో సింధు 1–0తో ఆధిక్యంలో ఉంది. పదేళ్ల క్రితం నెస్లిహాన్‌తో మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ జూనియర్ చాలెంజ్ టోర్నీలో ఆడిన ఏకైక మ్యాచ్‌లో సింధు వరుస గేముల్లో గెలిచింది. మరోవైపు ప్రపంచ 19వ ర్యాంకర్ సైనా తొలి రౌండ్‌లో థాయ్‌లాండ్ అమ్మాయి, ప్రపంచ 31వ ర్యాంకర్ ఫిటాయాపోర్న్ చైవాన్‌తో తలపడుతుంది.
2019 థాయ్‌లాండ్ ఓపెన్‌లో చైవాన్‌తో ఆడిన సైనా వరుస గేముల్లో నెగ్గింది. సైనా తొలి రౌండ్ దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో తలపడే అవకాశముంది. ఒకే పార్శ్వంలో సింధు, సైనా ఉండటంతో క్వార్టర్ ఫైనల్‌ను దాటితే ఈ ఇద్దరు భారత స్టార్స్ సెమీఫైనల్లో ముఖాముఖిగా తలపడతారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ఎనిమిది మంది పోటీపడనున్నారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ, ప్రణయ్, సౌరభ్ వర్మ, అజయ్ జయరామ్, పారుపల్లి కశ్యప్, లక్ష్య సేన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి-అశ్విని పొన్నప్ప... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... ధ్రువ్ కపిల –అర్జున్... మిక్స్‌డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప –సాత్విక్ సాయిరాజ్... సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీలు బరిలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment