Swiss Open badminton
-
సెమీస్‌లో కిడాంబి శ్రీకాంత్.. పీవీ సింధుకు చుక్కెదురు
Swiss Open Super 300 badminton tournament- బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో అతను 21–10, 21–14తో చియా హా లీ (చైనీస్ తైపీ)ని వరుస గేముల్లో కంగుతినిపించాడు. తద్వారా పదహారు నెలల కాలం తర్వాత తొలిసారి ఓ టోర్నీ సెమీస్‌లో అడుగుపెట్టాడు. ఇక శనివారం జరుగనున్న సెమీ ఫైనల్లో చైనీస్ తైపీ, వరల్డ్ నంబర్ 22 లిన్ చున్ యీని కిడాంబి శ్రీకాంత్ ఎదుర్కోనున్నాడు. అంతకు ముందు పురుషుల ప్రిక్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ శ్రీకాంత్ 21–16, 21–15తో మలేసియన్ టాప్ సీడ్ ప్లేయర్ లీ జీ జియాను వరుస గేముల్లో కంగు తినిపించిన విషయం తెలిసిందే. పీవీ సింధుకు చుక్కెదురు మరోవైపు.. రెండు ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు, లక్ష్యసేన్‌లకు ప్రి క్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది. ఏడో సీడ్ లక్ష్యసేన్ 17–21, 15–21తో చియా హా లీ (చైనీస్ తైపీ) జోరుకు నిలువలేకపోయాడు. మహిళల ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్ సింధు 21–16, 19–21, 16–21తో జూనియర్ ప్రపంచ చాంపియన్, 17 ఏళ్ల టొమొకా మియజకి (జపాన్) చేతిలో పరాజయం చవిచూడగా, మహిళల డబుల్స్‌లో 8వ సీడ్ గాయత్రి–ట్రెసా జాలీ జంట 14–21, 15–21తో సెటియాన–ఎంజెలా యూ (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో కంగుతింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి–సుమిత్ రెడ్డి జంట 11–21, 14–21తో రాబిన్ టాబెలింగ్–సెలెనా పేక్ (నెదర్లాండ్స్) జోడీ చేతిలో ఓడింది. -
సాత్విక్- చిరాగ్ సరికొత్త చరిత్ర.. తొలి భారతీయ జోడీగా రికార్డు
Satwiksairaj Rankireddy- Chirag Shetty- బాసెల్: కీలకదశలో పట్టుదల కోల్పోకుండా ఆడిన భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 68 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో పురుషుల డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ జోడీగా సాత్విక్–చిరాగ్ గుర్తింపు పొందింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో రెండో సీడ్ సాత్విక్–చిరాగ్ జంట 54 నిమిషాల్లో 21–19, 24–22తో రెన్ జియాంగ్ యు–టాన్ కియాంగ్ (చైనా) జోడీపై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టిలకు ఈ ఏడాది ఇదే తొలి టైటిల్ కాగా, ఓవరాల్‌గా ఐదో టైటిల్. ఐదో టైటిల్! ఇక విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 16,590 డాలర్ల (రూ. 13 లక్షల 66 వేలు) ప్రైజ్‌మనీ, 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. కాగా సాత్విక్–చిరాగ్ కెరీర్లో గెలిచిన వరల్డ్ టూర్ డబుల్స్ టైటిల్స్. స్విస్ ఓపెన్ కంటే ముందు ఈ జంట హైదరాబాద్ ఓపెన్ (2018), థాయ్‌లాండ్ ఓపెన్ (2019), ఫ్రెంచ్ ఓపెన్ (2022), ఇండియా ఓపెన్ (2022) టోర్నీల్లో విజేతగా నిలిచారు. ఏడోసారి స్విస్ ఓపెన్‌లో భారత్ ప్లేయర్లకు టైటిల్ దక్కడం ఇది ఏడోసారి. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ (2011, 2012), పీవీ సింధు (2022)... పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (2015), హెచ్ఎస్ ప్రణయ్ (2016), సమీర్ వర్మ (2018)... పురుషుల డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ (2023) విజేతగా నిలిచారు. ఇవి కూడా చదవండి: బోపన్న జోడీకి షాక్ ఫ్లోరిడా: గతవారం ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ... మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో మాత్రం నిరాశపరిచింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 5–7, 6–4, 4–10తో ‘సూపర్ టైబ్రేక్’లో కెవిన్ క్రావిట్జ్ (జర్మనీ)–ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ 11 ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. కీలకమైన సూపర్ టైబ్రేక్‌లో మాత్రం బోపన్న, ఎబ్డెన్ తడబడి ఓటమి చవిచూశారు. తొలి రౌండ్లో ఓడిన బోపన్న–ఎబ్డెన్ జోడీకి 18,020 డాలర్ల (రూ. 14 లక్షల 83 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. హంపి, హారిక తొలి గేమ్ ‘డ్రా’ న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి టోర్నీని భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక ‘డ్రా’తో ప్రారంభించారు. ఆదివారం జరిగిన తొలి రౌండ్ గేమ్‌లో వీరిద్దరు ముఖాముఖిగా తలపడ్డారు. తెల్లపావులతో ఆడిన హంపి 31 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. భారత్‌కే చెందిన అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) వైశాలికి తొలి గేమ్‌లో ‘వాకోవర్’ లభించింది. ఆమెతో తొలి రౌండ్లో తలపడాల్సిన జర్మనీ గ్రాండ్‌మాస్టర్ ఎలిజబెత్ పాట్జ్ టోర్నీ నుంచి వైదొలిగింది. దాంతో తొలి గేమ్‌లో వైశాలిని విజేతగా ప్రకటించారు. టోర్నీ నిర్వాహకుల నిర్వహణ వైఫల్యాల కారణంగానే తాను టోర్నీ నుంచి తప్పుకుంటున్నానని ఎలిజబెత్ తెలిపింది. నిర్వాహకుల తీరుపై ఆగ్రహంతో కజకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్ జాన్సయ అబ్దుమలిక్ కూడా ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. చదవండి: Nikhat Zareen: అంచనాలు లేవు.. ఫర్వాలేదన్నవారే తప్ప అద్భుతం అనలేదు! కానీ ఇప్పుడు.. BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్.. రాహుల్‌కు షాక్.. భరత్‌కు చోటు -
దారుణ ఆటతీరు.. కొనసాగుతున్న వైఫల్యం
మహిళల బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రౌండ్‌కే పరిమితమైంది. శుక్రవారం రెండో రౌండ్లో భాగంగా ఇండోనేషియాకు చెందిన అన్‌సీడెడ్ పుత్రీ కుసుమ వర్దానితో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ పీవీ సింధు.. 15-21, 21-12, 18-21 తేడాతో ఓడిపోయింది. మూడు గేములుగా సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను సింధు ఓటమి పాలైనప్పటికి.. రెండో గేమ్‌ను 21-12తో గెలుచుకుంది. అనంతరం కీలకమైన మూడో సెట్లో సింధు పుత్రి కుసుమ గేమ్‌కు తలవంచి ఓటమిపాలయ్యింది. ఈ ఏడాది ఒక్క టోర్నీలోనూ సింధు కనీసం క్వార్టర్స్‌కు చేరుకోలేకోపోయింది. ఇటీవలే జరిగిన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లోనూ దారుణ ప్రదర్శన కనబరిచిన సింధు తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టింది. అయితే పరుషుల డబుల్స్‌లో మాత్రం భారత్‌కు అనుకూల ఫలితం వచ్చింది. సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. రెండో రౌండ్లో తైవానిస్కు చెందిన ఫాంగ్-చిహ్ లీ జోడిని 12-21, 21-17, 28-26తో ఓడించారు. చదవండి: రొనాల్డో ప్రపంచ రికార్డు.. మెస్సీ చూస్తూ ఊరుకుంటాడా? -
Swiss Open 2022: ‘స్విస్’ క్వీన్ సింధు
బాసెల్: మరోసారి ఆద్యంతం నిలకడగా రాణించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు ఈ ఏడాది తన ఖాతాలో రెండో అంతర్జాతీయ టైటిల్‌ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ చాంపియన్‌గా అవతరించింది. గత ఏడాది కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచిన 26 ఏళ్ల సింధు ఈసారి మాత్రం పట్టుదలతో ఆడి తొలిసారి స్విస్ ఓపెన్ విజేతగా నిలిచింది. ప్రపంచ 11వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)తో జరిగిన ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21–16, 21–8తో గెలిచింది. అంతర్జాతీయ టోర్నీలలో బుసానన్‌పై సింధుకిది 16వ విజయం కావడం విశేషం. 49 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో సింధుకు తొలి గేమ్‌లో గట్టిపోటీనే ఎదురైంది. అయితే స్కోరు 16–15 వద్ద సింధు వరుసగా రెండు పాయింట్లు గెలిచి 18–15తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఒక పాయింట్‌ను బుసానన్కు కోల్పోయిన సింధు ఆ వెంటనే వరుసగా మూడు పాయింట్లు నెగ్గి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో సింధు ఆరంభం నుంచే చెలరేగిపోగా బుసానన్ డీలా పడిపోయింది. స్కోరు 12–4 వద్ద సింధు వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి 20–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత బుసానన్కు వరుసగా నాలుగు పాయింట్లు సమర్పించుకున్నాక సింధు ఒక పాయింట్ సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. విజేతగా నిలిచిన సింధుకు 13,500 డాలర్ల (రూ. 10 లక్షల 29 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది సింధుకిది రెండో టైటిల్. గత జనవరిలో ఆమె సయ్యద్ మోదీ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచింది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్, 2016 చాంపియన్ హెచ్ఎస్ ప్రణయ్ రన్నరప్‌గా నిలిచాడు. కేరళకు చెందిన ప్రణయ్ ఫైనల్లో 12–21, 18–21తో 2018 ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. ప్రధాని మోదీ, సీఎం జగన్ అభినందన సాక్షి, అమరావతి: స్విస్ ఓపెన్ విజేత సింధును ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ‘స్విస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన తెలుగు షట్లర్, దేశం గర్వించదగ్గ క్రీడాకారిణి సింధుకు శుభాకాంక్షలు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలి. సింధు ప్రతి ప్రయత్నానికి దేవుడి ఆశీర్వాదం కూడా ఉండాలని కోరుకుంటున్నాను’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘సింధు విజయాలు దేశ యువతకు ప్రేరణ ఇస్తాయి. భవిష్యత్‌లో ఆమె మరిన్ని టోర్నీలలో రాణించాలి’ అని మోదీ ట్వీట్ చేశారు. All hail the champion! 👑 2️⃣nd super 300 title for @Pvsindhu1 this year 🔥#SwissOpen2022#IndiaontheRise#Badminton pic.twitter.com/EpCqmr0JeS — BAI Media (@BAI_Media) March 27, 2022 చదవండి: Swiss Open: ఫైనల్లో సింధు -
Swiss Open: ఫైనల్లో సింధు
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు వరుసగా రెండో ఏడాది ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 79 నిమిషాల్లో 21–18, 15–21, 21–19తో సుపనిద కటెథోంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడుతుంది. గత ఏడాది ఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడి సింధు రన్నరప్‌గా నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ (భారత్) ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి సెమీఫైనల్లో ప్రణయ్ 21–19, 19–21, 21–18తో ఐదో ర్యాంకర్ జిన్‌టింగ్ (ఇండోనేసియా)పై గెలిచాడు. రెండో సెమీఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ (భారత్) 21–18, 7–21, 13–21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. -
క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్
బాసెల్: భారత అగ్రశ్రేణి షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు స్విస్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పారుపల్లి కశ్యప్, హెచ్.ఎస్. ప్రణయ్‌లు కూడా క్వార్టర్స్ చేరగా... వెటరన్ స్టార్ సైన నెహ్వాల్‌కు ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సింధు 21–19, 21–14తో నెస్లిహన్ యిగిట్ (టర్కీ)పై గెలుపొందగా, సైనా నెహ్వాల్ 21–17, 13–21, 13–21తో మలేసియా షట్లర్ కిసొన సెల్వదురై చేతిలో పరాజయం చవిచూసింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ శ్రీకాంత్ 13–21, 25–23, 21–11తో ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టో పొపొవ్‌పై చెమటోడ్చి నెగ్గాడు. మరో మ్యాచ్‌లో సీనియర్ షట్లర్ కశ్యప్‌కు అదృష్టం కలిసొచ్చి వాకోవర్‌తో ముందంజ వేశాడు. ప్రపంచ నంబర్‌వన్, డెన్మార్క్ స్టార్ విక్టర్ అక్సెల్సన్తో తలపడాల్సిన పోరులో ప్రత్యర్థి బరిలోకి దిగలేదు. దీంతో ఎట్టకేలకు చాన్నాళ్ల తర్వాత కశ్యప్ ఒక టోర్నీలో క్వార్టర్స్ చేరాడు. హెచ్.ఎస్.ప్రణయ్ 19–21, 21–13, 21–9తో కలే కోల్జొనెన్‌పై నెగ్గాడు. పురుషుల డబుల్స్‌లో మూడో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జంట 19–21, 20–22తో ప్రముద్య కుసుమవర్దన–యెరెమియా రంబితన్ (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడింది. -
శ్రీకాంత్ శుభారంభం
బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ 21–16, 21–17తో క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)పై, ప్రణయ్ 25–23, 21–16తో సాయిప్రణీత్ (భారత్)పై, కశ్యప్ 21–17, 21–9తో ఎనోగట్ రాయ్ (ఫ్రాన్స్)పై గెలిచారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 17–21, 21–11, 21–18తో షోహిబుల్–మౌలానా (ఇండోనేసియా) జంటను ఓడించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నెహ్వాల్ (భారత్) 21–8, 21–13తో యెలీ హోయాక్స్ (ఫ్రాన్స్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. -
ఫైనల్లో సింధూ ఓటమి
బాసెల్: స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నీ ఫైనల్లో భారత ఏస్ షట్లర్ పీవీ సింధూ ఓటమిపాలైంది. ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో 12-21, 5-21తో ఓటమిపాలైంది. తొలి సెట్లో సింధూకు శుభారంభం లభించినప్పటికీ.. దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమై, ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాలన్న ఆశలను అడియాశలు చేసుకుంది. తొలుత కరోలినా కాస్త నెమ్మదిగా కదిలినప్పటికీ.. ఆతరువాత గేర్ మార్చి సింధుపై పూర్తి ఆధిక్యాన్ని సాధించి, రెండో గేమ్‌లో సింధూను కనీసం రెండంకెల స్కోర్ కూడా సాధించనీయకుండా చేసింది. కేవలం 37 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో మారిన్ వరుస పాయింట్లు సాధిస్తూ సింధూకు ఊపిరి సడలనివ్వకుండా చేసి, టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఈ ఓటమితో మారిన్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 6–9తో వెనుకబడిపోయింది. వీరిద్దరూ తలపడిన గత మూడు మ్యాచ్‌ల్లో మారిన్దే పైచేయి కావడం విశేషం. -
తొలి టైటిల్ లక్ష్యంగా సింధు, సైనా
బాసెల్: కొత్త సీజన్లో తొలి టైటిల్ సాధించాలనే లక్ష్యంగా భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ స్విస్ ఓపెన్‌లో బరిలోకి దిగుతున్నారు. నేడు మొదలయ్యే ఈ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో సింధుకు సులువైన ‘డ్రా’ ఎదురుకాగా... సైనాకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. రెండో సీడ్‌గా పోటీపడుతున్న ప్రస్తుత ప్రపంచ చాంపియన్ సింధు తొలి రౌండ్లో టర్కీ క్రీడాకారిణి, ప్రపంచ 29వ ర్యాంకర్ నెస్లిహాన్ యిజిట్తో ఆడునుంది. ముఖాముఖి రికార్డులో సింధు 1–0తో ఆధిక్యంలో ఉంది. పదేళ్ల క్రితం నెస్లిహాన్తో మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ జూనియర్ చాలెంజ్ టోర్నీలో ఆడిన ఏకైక మ్యాచ్‌లో సింధు వరుస గేముల్లో గెలిచింది. మరోవైపు ప్రపంచ 19వ ర్యాంకర్ సైనా తొలి రౌండ్లో థాయ్‌లాండ్ అమ్మాయి, ప్రపంచ 31వ ర్యాంకర్ ఫిటాయాపోర్న్ చైవాన్‌తో తలపడుతుంది. 2019 థాయ్‌లాండ్ ఓపెన్‌లో చైవాన్‌తో ఆడిన సైనా వరుస గేముల్లో నెగ్గింది. సైనా తొలి రౌండ్ దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో తలపడే అవకాశముంది. ఒకే పార్శ్వంలో సింధు, సైనా ఉండటంతో క్వార్టర్ ఫైనల్‌ను దాటితే ఈ ఇద్దరు భారత స్టార్స్ సెమీఫైనల్లో ముఖాముఖిగా తలపడతారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ఎనిమిది మంది పోటీపడనున్నారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ, ప్రణయ్, సౌరభ్ వర్మ, అజయ్ జయరామ్, పారుపల్లి కశ్యప్, లక్ష్య సేన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి-అశ్విని పొన్నప్ప... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... ధ్రువ్ కపిల –అర్జున్... మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప –సాత్విక్ సాయిరాజ్... సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీలు బరిలో ఉన్నాయి. -
క్వార్టర్స్‌లో అశ్విని–సిక్కిరెడ్డి జంట
బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు అమ్మాయి సిక్కిరెడ్డికి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అశ్విని పొన్నప్పతో కలిసి మహిళల డబుల్స్‌లో క్వార్టర్స్‌కు చేరుకున్న సిక్కిరెడ్డి.... మిక్స్డ్ డబుల్స్‌తో ప్రిక్వార్టర్స్‌లో ఓడిపోయింది. గురువారం మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి జంట 21–14, 21–17తో నదియా ఫాన్ కాసర్ (స్విట్జర్లాండ్)–ఐరిస్ టబేలింగ్ (నెదర్లాండ్స్) జోడీపై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా–సిక్కిరెడ్డి (భారత్) ద్వయం 16–21, 2–16, 15–21తో ఎంఆర్ అర్జున్ –కె. మనీషా (భారత్) జంట చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌లో శుభాంకర్ డే (భారత్) 12–21, 22–20, 21–17తో ఐదో సీడ్ జొనాథ¯Œ క్రిస్టీ (ఇండోనేసియా)పై సంచలన విజయాన్ని సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. -
సెమీస్‌లో శ్రీకాంత్, జయరామ్
స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ బాసెల్ (స్విట్జర్లాండ్): స్థాయికి తగ్గట్టు ఆడుతూ కిడాంబి శ్రీకాంత్... సంచలన ఆటతీరుతో అజయ్ జయరామ్.. స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ శ్రీకాంత్ 21-11, 21-12తో ఎనిమిదో సీడ్ టకూమా ఉయెదా (జపాన్)పై గెలుపొందగా... జయరామ్ 17-21, 23-21, 21-15తో కజుమాసా సకాయ్ (జపాన్)ను ఓడించాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో ఈ ఇద్దరు భారతీయ ఆటగాళ్లు అమీతుమీ తేల్చుకుంటారు. ముఖాముఖి పోరులో వీరిద్దరు గతంలో కేవలం ఒకసారి మాత్రమే తలపడ్డారు. 2012లో సయ్యద్ మోడి ఓపెన్‌లో జయరామ్‌తో ఆడిన ఏకైక మ్యాచ్‌లో శ్రీకాంత్ వరుస గేముల్లో గెలిచాడు. మరోవైపు భారత్‌కే చెందిన భమిడిపాటి సాయిప్రణీత్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ఏడో సీడ్ సు జెన్ హావో (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో సాయిప్రణీత్ 18-21, 12-21తో ఓడిపోయాడు. టకూమా ఉయెదాతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ప్లేయర్ శ్రీకాంత్‌కు ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. కేవలం 31 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లోని ఆరంభ దశలో మినహా మరోసారి ఇద్దరి స్కోర్లు సమం కాలేదు. సకాయ్తో జరిగిన మ్యాచ్‌లో జయరామ్ రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని గెలిచాడు. తొలి గేమ్‌ను కోల్పోయిన జయరామ్ రెండో గేమ్‌లో 19-20తో, 20-21తో ఓటమి అంచుల్లో నిలిచాడు. అయితే పట్టుదలతో పోరాడిన జయరామ్ రెండో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లోని కీలకదశలో పాయింట్లు సాధించి జయరామ్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు.