సెమీస్‌లో శ్రీకాంత్, జయరామ్ | Jayaram, Srikanth shine in Swiss Open | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో శ్రీకాంత్, జయరామ్

Published Sat, Mar 14 2015 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM

సెమీస్‌లో శ్రీకాంత్, జయరామ్

సెమీస్‌లో శ్రీకాంత్, జయరామ్

స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్
 బాసెల్ (స్విట్జర్లాండ్): స్థాయికి తగ్గట్టు ఆడుతూ కిడాంబి శ్రీకాంత్... సంచలన ఆటతీరుతో అజయ్ జయరామ్.. స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ శ్రీకాంత్ 21-11, 21-12తో ఎనిమిదో సీడ్ టకూమా ఉయెదా (జపాన్)పై గెలుపొందగా... జయరామ్ 17-21, 23-21, 21-15తో కజుమాసా సకాయ్ (జపాన్)ను ఓడించాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో ఈ ఇద్దరు భారతీయ ఆటగాళ్లు అమీతుమీ తేల్చుకుంటారు.

ముఖాముఖి పోరులో వీరిద్దరు గతంలో కేవలం ఒకసారి మాత్రమే తలపడ్డారు. 2012లో సయ్యద్ మోడి ఓపెన్‌లో జయరామ్‌తో ఆడిన ఏకైక మ్యాచ్‌లో శ్రీకాంత్ వరుస గేముల్లో గెలిచాడు. మరోవైపు భారత్‌కే చెందిన భమిడిపాటి సాయిప్రణీత్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ఏడో సీడ్ సు జెన్ హావో (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో సాయిప్రణీత్ 18-21, 12-21తో ఓడిపోయాడు.
 
 టకూమా ఉయెదాతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ప్లేయర్ శ్రీకాంత్‌కు ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. కేవలం 31 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లోని ఆరంభ దశలో మినహా మరోసారి ఇద్దరి స్కోర్లు సమం కాలేదు. సకాయ్‌తో జరిగిన మ్యాచ్‌లో జయరామ్ రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని గెలిచాడు. తొలి గేమ్‌ను కోల్పోయిన జయరామ్ రెండో గేమ్‌లో 19-20తో, 20-21తో ఓటమి అంచుల్లో నిలిచాడు. అయితే పట్టుదలతో పోరాడిన జయరామ్ రెండో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లోని కీలకదశలో పాయింట్లు సాధించి జయరామ్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement