సాత్విక్–చిరాగ్ జోడీకి టైటిల్ (PC: BAI)
Satwiksairaj Rankireddy- Chirag Shetty- బాసెల్: కీలకదశలో పట్టుదల కోల్పోకుండా ఆడిన భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 68 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో పురుషుల డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ జోడీగా సాత్విక్–చిరాగ్ గుర్తింపు పొందింది.
ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో రెండో సీడ్ సాత్విక్–చిరాగ్ జంట 54 నిమిషాల్లో 21–19, 24–22తో రెన్ జియాంగ్ యు–టాన్ కియాంగ్ (చైనా) జోడీపై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టిలకు ఈ ఏడాది ఇదే తొలి టైటిల్ కాగా, ఓవరాల్‌గా ఐదో టైటిల్.
ఐదో టైటిల్!
ఇక విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 16,590 డాలర్ల (రూ. 13 లక్షల 66 వేలు) ప్రైజ్‌మనీ, 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. కాగా సాత్విక్–చిరాగ్ కెరీర్‌లో గెలిచిన వరల్డ్ టూర్ డబుల్స్ టైటిల్స్. స్విస్ ఓపెన్ కంటే ముందు ఈ జంట హైదరాబాద్ ఓపెన్ (2018), థాయ్‌లాండ్ ఓపెన్ (2019), ఫ్రెంచ్ ఓపెన్ (2022), ఇండియా ఓపెన్ (2022) టోర్నీల్లో విజేతగా నిలిచారు.
ఏడోసారి
స్విస్ ఓపెన్‌లో భారత్ ప్లేయర్లకు టైటిల్ దక్కడం ఇది ఏడోసారి. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ (2011, 2012), పీవీ సింధు (2022)... పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (2015), హెచ్‌ఎస్ ప్రణయ్ (2016), సమీర్ వర్మ (2018)... పురుషుల డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ (2023) విజేతగా నిలిచారు.
ఇవి కూడా చదవండి:
బోపన్న జోడీకి షాక్
ఫ్లోరిడా: గతవారం ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ... మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో మాత్రం నిరాశపరిచింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 5–7, 6–4, 4–10తో ‘సూపర్ టైబ్రేక్’లో కెవిన్ క్రావిట్జ్ (జర్మనీ)–ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది.
84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ 11 ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. కీలకమైన సూపర్ టైబ్రేక్‌లో మాత్రం బోపన్న, ఎబ్డెన్ తడబడి ఓటమి చవిచూశారు. తొలి రౌండ్‌లో ఓడిన బోపన్న–ఎబ్డెన్ జోడీకి 18,020 డాలర్ల (రూ. 14 లక్షల 83 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.
హంపి, హారిక తొలి గేమ్ ‘డ్రా’
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి టోర్నీని భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక ‘డ్రా’తో ప్రారంభించారు. ఆదివారం జరిగిన తొలి రౌండ్ గేమ్‌లో వీరిద్దరు ముఖాముఖిగా తలపడ్డారు. తెల్లపావులతో ఆడిన హంపి 31 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. భారత్‌కే చెందిన అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) వైశాలికి తొలి గేమ్‌లో ‘వాకోవర్’ లభించింది.
ఆమెతో తొలి రౌండ్‌లో తలపడాల్సిన జర్మనీ గ్రాండ్‌మాస్టర్ ఎలిజబెత్ పాట్జ్ టోర్నీ నుంచి వైదొలిగింది. దాంతో తొలి గేమ్‌లో వైశాలిని విజేతగా ప్రకటించారు. టోర్నీ నిర్వాహకుల నిర్వహణ వైఫల్యాల కారణంగానే తాను టోర్నీ నుంచి తప్పుకుంటున్నానని ఎలిజబెత్ తెలిపింది. నిర్వాహకుల తీరుపై ఆగ్రహంతో కజకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్ జాన్సయ అబ్దుమలిక్ కూడా ఈ టోర్నీ నుంచి వైదొలిగింది.
చదవండి: Nikhat Zareen: అంచనాలు లేవు.. ఫర్వాలేదన్నవారే తప్ప అద్భుతం అనలేదు! కానీ ఇప్పుడు..
BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్.. రాహుల్‌కు షాక్.. భరత్‌కు చోటు
Comments
Please login to add a commentAdd a comment