కౌలాలాంపూర్: కొత్త ఏడాదిని టైటిల్‌తో ప్రారంభించాలనుకున్న భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టికి నిరాశ ఎదురైంది. మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సాత్విక్–చిరాగ్ జంట సెమీ ఫైనల్లో పరాజయం పాలైంది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 10–21, 15–21తో కిమ్ వన్ హో–సియో సెయంగ్ జే (దక్షిణ కొరియా) జోడీ చేతిలో ఓడింది.
40 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయారు. గత ఏడాది ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరిన భారత షట్లర్లు ఈ సారి సెమీస్‌తోనే ఇంటిదారి పట్టారు. ‘గత మూడు మ్యాచ్‌లతో పోల్చుకుంటే ఈ మ్యాచ్‌ను మెరుగ్గా ఆరంభించలేకపోయాం.
ఈ ఫలితం నుంచి పాఠాలు నేర్చుకుంటాం’ అని సాత్విక్ అన్నాడు. తొలి గేమ్‌లో 6–11తో వెనుకబడిన సాత్విక్ జంట ఆ తర్వాత కోలుకోలేకపోయింది. రెండో గేమ్ ఆరంభంలో మంచి ఆటతీరు కనబర్చిన భారత జోడీ 11–8తో ఆధిక్యం చాటినా... చివరి వరకు అదే తీవ్రత కొనసాగించడంలో విఫలమై పరాజయం పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment