క్వాలిఫయింగ్‌లోనే శ్రీకాంత్ అవుట్
జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–16, 21–15తో చెన్ జి రే–లిన్ యు చియె (చైనీస్ తైపీ) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
30 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జోడీకి ప్రతిఘటన ఎదురైనా కీలకదశల్లో పాయింట్లు నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకుంది. తొలి గేమ్‌లో స్కోరు 17–16 వద్ద సాత్విక్–చిరాగ్ వరుసగా నాలుగు పాయింట్లు సాధించింది. రెండో గేమ్‌లోనూ భారత ద్వయం దూకుడు కొనసాగించి ఆరంభంలోనే 12–5తో ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు.
సాత్విక్–చిరాగ్ జంట ఆడిన గత మూడు టోర్నీలలో (చైనా మాస్టర్స్, మలేసియా ఓపెన్–1000, ఇండియా ఓపెన్–750) సెమీఫైనల్‌కు చేరింది. మహిళల డబుల్స్‌లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప (భారత్) జంట కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. తొలి రౌండ్‌లో తనీషా–అశ్విని ద్వయం 21–6, 21–14తో ఒర్నిచా జోంగ్‌సతాపోర్న్‌పార్న్–సుకిత్త సువాచాయ్ (థాయ్‌లాండ్) జంటపై గెలిచింది.
సింగిల్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, హైదరాబాద్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్‌కు చుక్కెదురైంది. భారత్‌కే చెందిన ఆయుశ్ శెట్టితో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 7–21, 15–21తో ఓడిపోవడం గమనార్హం.
మహిళల క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో తాన్యా హేమంత్ 16–21, 21–17, 21–15తో టుంగ్ సియో టాంగ్ (చైనీస్ తైపీ)పై నెగ్గి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందింది. మరో మ్యాచ్‌లో ఇషారాణి బారువా 18–21, 20–22తో చియారా మార్వెలా హండాయో (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయి మెయిన్ ‘డ్రా’కు చేరుకోవడంలో విఫలమైంది.
Comments
Please login to add a commentAdd a comment