కౌలాలంపూర్: కొత్త ఏడాదిని టైటిల్‌తో ప్రారంభించాలనే లక్ష్యం దిశగా భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఒక అడుగు ముందుకు వేసింది. మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సాత్విక్–చిరాగ్ ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 26–24, 21–15తో యె సిన్ ఓంగ్–ఈ యి టియో (మలేసియా) జోడీపై గెలిచింది. 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ తొలి గేమ్‌లో నాలుగు గేమ్ పాయింట్లు కాపాడుకోవడం విశేషం. రెండో గేమ్‌లోనూ భారత జోడీకి గట్టిపోటీ లభించింది.
ఒకదశలో సాత్విక్–చిరాగ్ 8–11తో వెనుకబడ్డారు. కానీ భారత జంట ఇదే స్కోరు వద్ద వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 12–11తో ఆధిక్యంలోకి వచ్చిoది. ఆ తర్వాత స్కోరు 12–12తో సమమైంది. ఈ దశలో సాత్విక్–చిరాగ్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 15–12తో ముందంజ వేశారు.
అదే జోరులో గేమ్‌ను సొంతం చేసుకున్న సాత్విక్–చిరాగ్ వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. నేడు జరిగే సెమీఫైనల్లో కిమ్ వన్ హో–సియో సెయంగ్ జే (దక్షిణ కొరియా)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment