గాయత్రి–ట్రెసా జోడీ అవుట్
మాళవిక, ప్రణయ్‌లకు నిరాశ
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ తమ జోరు కొనసాగిస్తోంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో గత ఏడాది రన్నరప్ సాత్విక్–చిరాగ్ ద్వయం 21–15, 21–15తో నూర్ మొహమ్మద్ అజ్రియాన్–టాన్ వీ కియోంగ్ (మలేసియా) జోడీపై గెలిచింది.
43 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లో భారత జంట స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో యె సిన్ ఓంగ్–ఈ యి టియో (మలేసియా)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. ‘కొత్త సీజన్‌లో శుభారంభం లభించింది. కొత్త కోచ్‌తో మళ్లీ కలిసి పని చేస్తున్నాం. అంతా సవ్యంగా సాగుతోంది’ అని విజయానంతరం సాత్విక్–చిరాగ్ వ్యాఖ్యానించారు. మహిళల డబుల్స్‌లో భారత కథ ముగిసింది.
ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 21–15, 19–21, 19–21తో జియా యీ ఫాన్–జాంగ్ షు జియాన్ (చైనా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో (భారత్) జంట 13–21, 20–22తో చెంగ్ జింగ్–జాంగ్ చి (చైనా) ద్వయం చేతిలో... సతీశ్ కరుణాకరన్–ఆద్యా వరియత్ (భారత్) జంట 10–21, 17–21తో సూన్ హువార్ గో–షెవోన్ జెమీలాయ్ (మలేసియా) జోడీ చేతిలో పరాజయం చవిచూశాయి.
సింగిల్స్ విభాగంలోనూ భారత పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 8–21, 21–15, 21–23తో లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యాడు. 82 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ నిర్ణాయక మూడో గేమ్‌లో ఒక మ్యాచ్ పాయింట్ వదులుకోవడం గమనార్హం. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మాళవిక బన్సోద్ (భారత్) 18–21, 11–21తో హాన్ యువె (చైనా) చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment