సైనా, కశ్యప్ ఓటమి
ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్
పారిస్: చైనా అడ్డంకిని అధిగమించడంలో భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ విఫలమయ్యారు. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయారు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో కశ్యప్ 15-21, 21-13, 13-21తో ఐదో సీడ్ జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా) చేతిలో; ఐదో సీడ్ సైనా 19-21, 21-19, 15-21తో రెండో సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా 15-10తో ఆధిక్యంలో ఉన్నా... అనూహ్యంగా తడబడి షిజియాన్‌కు వరుసగా 11 పాయింట్లు కోల్పోయి చేజేతులా ఓడటం గమనార్హం. అంతకుముందు గురువారం జరిగిన రెండో రౌండ్‌లో కశ్యప్ 21-19, 21-18తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హువీ తియాన్ (చైనా)ను ఓడించడం విశేషం. మరోవైపు శ్రీకాంత్ పోరాటం రెండో రౌండ్‌లోనే ముగిసింది. ఆరో సీడ్ క్రిస్టియన్ విటిన్‌గస్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 20-22, 14-21తో ఓడిపోయాడు. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో ఐదో సీడ్ సైనా 21-19, 21-16తో కిర్‌స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్)ను ఓడించింది. మహిళల డబుల్స్ రెండో రౌండ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 6-21, 8-21తో ఏడో సీడ్ జియోలి వాంగ్-యాంగ్ యు (చైనా) జోడీ చేతిలో పరాజయం పాలైంది.
ఏడు స్థానాలు ఎగబాకి...
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో శ్రీకాంత్, కశ్యప్ ఏడేసి స్థానాల చొప్పున పురోగతి సాధించారు. తాజా ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్ 23 నుంచి 16వ స్థానానికి... కశ్యప్ 28 నుంచి 21వ స్థానానికి చేరుకున్నారు. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని ఆరో ర్యాంక్‌కు చేరుకోగా... సింధు 10వ స్థానంలోనే ఉంది.