French Open Super Series tournament
-
లెక్క సరిచేసింది
తొమ్మిది రోజుల క్రితం డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే తనను ఓడించిన చెన్ యుఫెపై తెలుగు తేజం పీవీ సింధు ప్రతీకారం తీర్చుకుంది. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో సింధు వరుస గేముల్లో చెన్ యుఫెపై గెలిచింది. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో సింధు తొలిసారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. పారిస్: గతవారం డెన్మార్క్ ఓపెన్‌లో తడబడిన పీవీ సింధు తన తప్పిదాలను సరిచేసుకొని ఫ్రెంచ్ ఓపెన్‌లో దూసుకెళుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ సింధు 21–14, 21–14తో ప్రపంచ పదో ర్యాంకర్ చెన్ యుఫెను ఓడించింది. ఈ గెలుపుతో ముఖాముఖి రికార్డులో సింధు 3–2తో ఆధిక్యంలోకి వచ్చింది. 41 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు ఏదశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూనే, అడపాదడపా స్మాష్‌లతో అలరించిన సింధు దూకుడుకు చెన్ యుఫె వద్ద సమాధానం కరువైంది. ఒత్తిడికిలోనైన ఈ చైనా స్టార్ క్రమం తప్పకుండా అనవసర తప్పిదాలు చేసి ఏదశలోనూ పుంజుకున్నట్లు కనిపించలేదు. 19 నిమిషాల్లో తొలి గేమ్‌ను దక్కించుకున్న సింధు రెండో గేమ్‌లోనూ నిలకడగా ఆడింది. ఆరంభంలో 0–3తో వెనుకబడిన సింధు ఆ తర్వాత తేరుకుంది. గతవారం డెన్మార్క్ ఓపెన్‌లో చెన్ యుఫె చేతిలో ఎదురైన ఓటమిని దృష్టిలో పెట్టుకున్న ఈ హైదరాబాద్ క్రీడాకారిణి ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరును 5–5తో సమం చేసింది. అనంతరం 11–7తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు ఈ ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకొని 22 నిమిషాల్లో రెండో గేమ్‌ను దక్కించుకొని విజయాన్ని అందుకుంది. సుంగ్ జీ హున్ (కొరియా)–అకానె యామగుచి (జపాన్)ల మధ్య మ్యాచ్ విజేతతో శనివారం జరిగే సెమీఫైనల్లో సింధు ఆడుతుంది. ప్రణయ్ జోరు: పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ (భారత్) సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21–16, 21–16తో జియోన్ హైక్ జిన్ (కొరియా)పై గెలిచాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21–11, 21–12తో హాన్స్ క్రిస్టియన్ విటింగస్ (డెన్మార్క్)ను ఓడించాడు. -
ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌కు సింధు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో పీవీ సింధు సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టింది. పారిస్ లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాకు చెందిన చెన్ యు ఫె ను కంగుతినిపించింది. 21-14, 21-14 రెండు వరుస సెట్లలో పైచేయి సాధించి విజయ దుంధుబి మోగించింది. గతవారం డెన్మార్క్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే చెన్ యు ఫె చేతిలో సింధు ఓడిపోయింది. డెన్మార్క్ ఓపెన్‌లోని ప్రతికారాన్ని సింధు ఫ్రెంచి ఓపెన్ సూపర్‌సిరీస్‌లో తీర్చుకుంది. -
సైనా ఇంటికి... సింధు ముందుకు
పారిస్: అదే ప్రత్యర్థి... అదే ఫలితం... వరుసగా రెండో సూపర్ సిరీస్ టోర్నమెంట్లోనూ భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జోరుకు జపాన్ ప్లేయర్ అకానె యామగుచి అడ్డుకట్ట వేసింది. ఫలితంగా ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సైనా పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సైనా 9–21, 21–23తో యామగుచి చేతిలో ఓడిపోయింది. గతవారం డెన్మార్క్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో యామగుచి చేతిలో సైనా పరాజయం చవిచూసింది. సైనా నిష్క్రమించినా... మరోవైపు పీవీ సింధు మరో అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సయాక తకహాషి (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సింధు 21–14, 21–13తో గెలిచింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో చెన్ యుఫె (చైనా)తో సింధు తలపడుతుంది. గతవారం డెన్మార్క్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే చెన్ యుఫె చేతిలో సింధు ఓడిపోయింది. క్వార్టర్స్‌లో శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ 21–19, 21–17తో వోంగ్ వింగ్ కీ విన్సెంట్ (హాంకాంగ్)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. గతవారం డెన్మార్క్ ఓపెన్ టైటిల్ నెగ్గిన శ్రీకాంత్ గురువారం విడుదల చేసిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. మరో మ్యాచ్‌లో సాయిప్రణీత్ 13–21, 17–21తో కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో ఓడిపోయాడు. సాత్విక్ జంట సంచలనం పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 22–20, 12–21, 21–19తో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న మ్యాడ్స్ పీటర్సన్–మ్యాడ్స్ కోల్డింగ్ (డెన్మార్క్) జంటపై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లో 16–21, 14–21తో మిసాకి మత్సుతోమో–అయాకా తకహాషి (జపాన్) చేతిలో ఓటమి పాలైంది. -
ప్రణయ్ సంచలనం
లిన్ డాన్‌పై అద్భుత విజయం సైనా, కశ్యప్ శుభారంభం ఐదో సీడ్ శ్రీకాంత్‌కు షాక్ {ఫెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పారిస్: భారత బ్యాడ్మింటన్ యువతార హెచ్ఎస్ ప్రణయ్ తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. ఐదుసార్లు విశ్వ విజేతగా, రెండుసార్లు ఒలింపిక్స్ చాంపియన్‌గా, నాలుగుసార్లు ఆసియా క్రీడల చాంపియన్‌గా నిలిచిన ‘చైనా దిగ్గజం’ లిన్ డాన్‌ను... ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో ఈ కేరళ ఆటగాడు మట్టి కరిపించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 16వ ర్యాంకర్ ప్రణయ్ 14-21, 21-11, 21-17తో లిన్ డాన్‌ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ తొలి గేమ్‌ను కోల్పోయినా, రెండో గేమ్‌లో అద్వితీయ ఆటతీరును ప్రదర్శించి పుంజుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో ప్రణయ్ వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి 7-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత లిన్ డాన్ తేరుకున్నా కీలకదశలో ప్రణయ్ పైచేయి సాధించి చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకున్నాడు. ►ఈ గెలుపుతో లిన్ డాన్‌ను ఓడించిన మూడో భారతీయ ప్లేయర్‌గా ప్రణయ్ గుర్తింపు పొందాడు. 2002లో పుల్లెల గోపీచంద్ రెండుసార్లు లిన్ డాన్‌పై గెలుపొందగా... గతేడాది చైనా ఓపెన్‌లో శ్రీకాంత్ ఒకసారి గెలిచాడు. ►ఈ ఏడాది ఓ సూపర్ సిరీస్ టోర్నీలో లిన్ డాన్ తొలి రౌండ్లోనే ఓడిపోవడం ఇది మూడోసారి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్), ఇండోనేసియా ఓపెన్‌లో టామీ సుగియార్తో (ఇండోనేసియా) చేతిలోనూ లిన్ డాన్ తొలి రౌండ్లో ఓడిపోయాడు. ►ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో పారుపల్లి కశ్యప్ 21-11, 22-20తో క్వాలిఫయర్ థామస్ రూక్సెల్ (ఫ్రాన్స్)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకోగా... ప్రపంచ ఐదో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్‌కు తొలి రౌండ్లోనే నిరాశ ఎదురైంది. ప్రపంచ పదో ర్యాంకర్ తియాన్ హువీ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 15-21, 21-13, 11-21తో ఓడిపోయాడు. ఈ ఏడాది తియాన్ హువీతో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ శ్రీకాంత్ ఓటమి చెందడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభంలో ఇండియా ఓపెన్, స్విస్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన శ్రీకాంత్ ఆ తర్వాత ఆడిన పది టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయాడు. ►మరోవైపు మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సైనా నెహ్వాల్ 21-18, 21-13తో కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ మిచెల్లి లీ (కెనడా)పై గెలుపొందింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో పీవీ సింధు 10-21, 11-21తో షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం 21-15, 21-12తో కిటిట్హరాకుల్-రవింద ప్రజోంగ్‌జై (థాయ్‌లాండ్) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. -
సైనా, కశ్యప్ ఓటమి
ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ పారిస్: చైనా అడ్డంకిని అధిగమించడంలో భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ విఫలమయ్యారు. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయారు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో కశ్యప్ 15-21, 21-13, 13-21తో ఐదో సీడ్ జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా) చేతిలో; ఐదో సీడ్ సైనా 19-21, 21-19, 15-21తో రెండో సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా 15-10తో ఆధిక్యంలో ఉన్నా... అనూహ్యంగా తడబడి షిజియాన్‌కు వరుసగా 11 పాయింట్లు కోల్పోయి చేజేతులా ఓడటం గమనార్హం. అంతకుముందు గురువారం జరిగిన రెండో రౌండ్లో కశ్యప్ 21-19, 21-18తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హువీ తియాన్ (చైనా)ను ఓడించడం విశేషం. మరోవైపు శ్రీకాంత్ పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. ఆరో సీడ్ క్రిస్టియన్ విటిన్‌గస్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 20-22, 14-21తో ఓడిపోయాడు. గురువారం జరిగిన రెండో రౌండ్లో ఐదో సీడ్ సైనా 21-19, 21-16తో కిర్స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్)ను ఓడించింది. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 6-21, 8-21తో ఏడో సీడ్ జియోలి వాంగ్-యాంగ్ యు (చైనా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. ఏడు స్థానాలు ఎగబాకి... ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో శ్రీకాంత్, కశ్యప్ ఏడేసి స్థానాల చొప్పున పురోగతి సాధించారు. తాజా ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్ 23 నుంచి 16వ స్థానానికి... కశ్యప్ 28 నుంచి 21వ స్థానానికి చేరుకున్నారు. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని ఆరో ర్యాంక్‌కు చేరుకోగా... సింధు 10వ స్థానంలోనే ఉంది. -
కశ్యప్ సంచలనం
ప్రపంచ నాలుగో ర్యాంకర్‌పై గెలుపు సైనా, శ్రీకాంత్ శుభారంభం తొలి రౌండ్లోనే ఓడిన సింధు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ పారిస్: గతవారం డెన్మార్క్ ఓపెన్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ను బోల్తా కొట్టించిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్... ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సంచలన విజయంతో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 28వ ర్యాంకర్ కశ్యప్ 21-11, 21-18తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కెనిచి టాగో (జపాన్)ను ఇంటిదారి పట్టించాడు. కేవలం 34 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన కశ్యప్‌కు రెండో గేమ్‌లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. ఒకదశలో కశ్యప్ 12-15తో వెనుకబడినా... వెంటనే తేరుకొని స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత స్కోరు 18-18 వద్ద కశ్యప్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. కెనిచి టాగోపై కశ్యప్‌కిది రెండో విజయం. గతంలో కశ్యప్ ఈ జపాన్ ప్లేయర్ చేతిలో మూడుసార్లు ఓడిపోయాడు. గురువారం జరిగే రెండో రౌండ్లో ప్రపంచ 14వ ర్యాంకర్ హువీ తియాన్ (చైనా)తో కశ్యప్ తలపడతాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ 21-10, 21-14తో క్వాలిఫయర్ దిమిత్రో జవద్స్కయ్ (ఉక్రెయిన్)పై గెలిచాడు. అయితే భారత్‌కే చెందిన సౌరభ్ వర్మ 10-21, 11-21తో రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్) చేతిలో; ప్రణయ్ 11-21, 21-15, 20-22తో కెంటో మొమాటా (జపాన్) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సైనా నెహ్వాల్ 21-16, 21-9తో సషీనా వారన్ (ఫ్రాన్స్)పై గెలుపొందగా... ఎనిమిదో సీడ్ పి.వి.సింధు 21-12, 18-21, 16-21తో పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్సుక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. సషీనాతో జరిగిన మ్యాచ్‌లో సైనా రెండో గేమ్‌లో వరుసగా 11 పాయింట్లు సాధించడం విశేషం. గురువారం జరిగే రెండో రౌండ్లో కిర్స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్)తో సైనా ఆడుతుంది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని పొన్నప్ప (భారత్)-వ్లాదిమిర్ ఇవనోవ్ (రష్యా) ద్వయం 21-16, 21-19తో కీగో సొనోదా-షిజుకా మత్సో (జపాన్) జంటపై గెలిచింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జంట 18-21, 21-16, 21-14తో ముస్కెన్స్-పీక్ సెలెనా (నెదర్లాండ్స్) ద్వయంపై నెగ్గింది.