ప్రణయ్ సంచలనం | Pranay sensation | Sakshi
Sakshi News home page

ప్రణయ్ సంచలనం

Published Thu, Oct 22 2015 12:28 AM | Last Updated on Sun, Sep 3 2017 11:18 AM

ప్రణయ్ సంచలనం

ప్రణయ్ సంచలనం

లిన్ డాన్‌పై అద్భుత విజయం
సైనా, కశ్యప్ శుభారంభం
ఐదో సీడ్ శ్రీకాంత్‌కు షాక్
{ఫెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ

 
పారిస్: భారత బ్యాడ్మింటన్ యువతార హెచ్‌ఎస్ ప్రణయ్ తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. ఐదుసార్లు విశ్వ విజేతగా, రెండుసార్లు ఒలింపిక్స్ చాంపియన్‌గా, నాలుగుసార్లు ఆసియా క్రీడల చాంపియన్‌గా నిలిచిన ‘చైనా దిగ్గజం’ లిన్ డాన్‌ను...  ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో ఈ కేరళ ఆటగాడు మట్టి కరిపించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 16వ ర్యాంకర్ ప్రణయ్ 14-21, 21-11, 21-17తో లిన్ డాన్‌ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ తొలి గేమ్‌ను కోల్పోయినా, రెండో గేమ్‌లో అద్వితీయ ఆటతీరును ప్రదర్శించి పుంజుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో ప్రణయ్ వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి 7-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత లిన్ డాన్ తేరుకున్నా కీలకదశలో ప్రణయ్ పైచేయి సాధించి చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకున్నాడు.

►ఈ గెలుపుతో లిన్ డాన్‌ను ఓడించిన మూడో భారతీయ ప్లేయర్‌గా ప్రణయ్ గుర్తింపు పొందాడు. 2002లో పుల్లెల గోపీచంద్ రెండుసార్లు లిన్ డాన్‌పై గెలుపొందగా... గతేడాది చైనా ఓపెన్‌లో శ్రీకాంత్ ఒకసారి గెలిచాడు.

►ఈ ఏడాది ఓ సూపర్ సిరీస్ టోర్నీలో లిన్ డాన్ తొలి రౌండ్‌లోనే ఓడిపోవడం ఇది మూడోసారి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్), ఇండోనేసియా ఓపెన్‌లో టామీ సుగియార్తో (ఇండోనేసియా) చేతిలోనూ లిన్ డాన్ తొలి రౌండ్‌లో ఓడిపోయాడు.

►ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో పారుపల్లి కశ్యప్ 21-11, 22-20తో క్వాలిఫయర్ థామస్ రూక్సెల్ (ఫ్రాన్స్)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకోగా... ప్రపంచ ఐదో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్‌కు తొలి రౌండ్‌లోనే నిరాశ ఎదురైంది. ప్రపంచ పదో ర్యాంకర్ తియాన్ హువీ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 15-21, 21-13, 11-21తో ఓడిపోయాడు. ఈ ఏడాది తియాన్ హువీతో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ శ్రీకాంత్ ఓటమి చెందడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభంలో ఇండియా ఓపెన్, స్విస్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన శ్రీకాంత్ ఆ తర్వాత ఆడిన పది టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయాడు.

►మరోవైపు మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో టాప్ సీడ్ సైనా నెహ్వాల్ 21-18, 21-13తో కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ మిచెల్లి లీ (కెనడా)పై గెలుపొందింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో పీవీ సింధు 10-21, 11-21తో షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం 21-15, 21-12తో కిటిట్‌హరాకుల్-రవింద ప్రజోంగ్‌జై (థాయ్‌లాండ్) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement