
న్యూఢిల్లీ: గతేడాది పీవీ సింధు (భారత్), నొజోమి ఒకుహారా (జపాన్) మధ్య జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్ బ్యాడ్మింటన్ చరిత్రలో గొప్ప మ్యాచ్‌గా నిలిచిపోయింది. 110 నిమిషాలపాటు జరిగిన ఆ సమరంలో ఒకుహారా గెలిచినప్పటికీ సింధు అద్వితీయ పోరాటంతో ఆకట్టుకుంది. అయితే ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ ఇద్దరూ ఒకే పార్శ్వంలో ఉన్నారు. అంతా సాఫీగా సాగితే మూడో సీడ్ సింధు, ఎనిమిదో సీడ్ ఒకుహారా ఈసారి క్వార్టర్ ఫైనల్లోనే తలపడతారు. ఈనెల 30 నుంచి ఆగస్టు 5 వరకు చైనాలోని నాన్‌జింగ్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు సంబంధించిన ‘డ్రా’ వివరాలను మంగళవారం విడుదల చేశారు. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన సింధు... రెండో రౌండ్‌లో ఫిత్రియాని (ఇండోనేసియా) లేదా లిండా జెట్‌చిరి (బల్గేరియా)లతో ఆడుతుంది.
ఈ మ్యాచ్‌లో నెగ్గితే సింధుకు ప్రిక్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా) ఎదురయ్యే చాన్స్ ఉంది. మరోవైపు గతేడాది కాంస్యం నెగ్గిన భారత్‌కే చెందిన సైనా నెహ్వాల్‌కు కూడా తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది. రెండో రౌండ్‌లో ఆమె సబ్రీనా జాక్వెట్ (స్విట్జర్లాండ్) లేదా అలియి దెమిర్‌బాగ్ (టర్కీ)తో ఆడుతుంది. పదో సీడ్ సైనాకు ప్రిక్వార్టర్ ఫైనల్లో 2013 ప్రపంచ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) తారస పడే అవకాశముంది. ఈ అడ్డంకిని దాటితే సైనాకు క్వార్టర్ ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) ఎదురుపడే చాన్స్ ఉంది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ, హెచ్‌ఎస్ ప్రణయ్ బరిలోకి దిగనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment