కశ్యప్ సంచలనం
ప్రపంచ నాలుగో ర్యాంకర్‌పై గెలుపు
సైనా, శ్రీకాంత్ శుభారంభం
తొలి రౌండ్‌లోనే ఓడిన సింధు
ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్
పారిస్: గతవారం డెన్మార్క్ ఓపెన్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ను బోల్తా కొట్టించిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్... ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సంచలన విజయంతో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 28వ ర్యాంకర్ కశ్యప్ 21-11, 21-18తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కెనిచి టాగో (జపాన్)ను ఇంటిదారి పట్టించాడు. కేవలం 34 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన కశ్యప్‌కు రెండో గేమ్‌లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. ఒకదశలో కశ్యప్ 12-15తో వెనుకబడినా... వెంటనే తేరుకొని స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత స్కోరు 18-18 వద్ద కశ్యప్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. కెనిచి టాగోపై కశ్యప్‌కిది రెండో విజయం. గతంలో కశ్యప్ ఈ జపాన్ ప్లేయర్ చేతిలో మూడుసార్లు ఓడిపోయాడు. గురువారం జరిగే రెండో రౌండ్‌లో ప్రపంచ 14వ ర్యాంకర్ హువీ తియాన్ (చైనా)తో కశ్యప్ తలపడతాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ 21-10, 21-14తో క్వాలిఫయర్ దిమిత్రో జవద్‌స్కయ్ (ఉక్రెయిన్)పై గెలిచాడు. అయితే భారత్‌కే చెందిన సౌరభ్ వర్మ 10-21, 11-21తో రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్) చేతిలో; ప్రణయ్ 11-21, 21-15, 20-22తో కెంటో మొమాటా (జపాన్) చేతిలో ఓడిపోయారు.
మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఐదో సీడ్ సైనా నెహ్వాల్ 21-16, 21-9తో సషీనా వారన్ (ఫ్రాన్స్)పై గెలుపొందగా... ఎనిమిదో సీడ్ పి.వి.సింధు 21-12, 18-21, 16-21తో పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్‌సుక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. సషీనాతో జరిగిన మ్యాచ్‌లో సైనా రెండో గేమ్‌లో వరుసగా 11 పాయింట్లు సాధించడం విశేషం. గురువారం జరిగే రెండో రౌండ్‌లో కిర్‌స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్)తో సైనా ఆడుతుంది.
మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో అశ్విని పొన్నప్ప (భారత్)-వ్లాదిమిర్ ఇవనోవ్ (రష్యా) ద్వయం 21-16, 21-19తో కీగో సొనోదా-షిజుకా మత్సో (జపాన్) జంటపై గెలిచింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జంట 18-21, 21-16, 21-14తో ముస్కెన్స్-పీక్ సెలెనా (నెదర్లాండ్స్) ద్వయంపై నెగ్గింది.