the mens singles
-
సాయిప్రణీత్ ముందంజ
మకావు: మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ సాయిప్రణీత్ 11-5తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి వూన్ కాక్ హాంగ్ (మలేసియా) గాయంతో వైదొలిగాడు. బుధవారం జరిగే రెండో రౌండ్లో రొనాల్డ్ సుసిలో (సింగపూర్)తో సాయిప్రణీత్ ఆడతాడు. భారత్‌కే చెందిన సౌరభ్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్ కూడా శుభారంభం చేయగా... అజయ్ జయరామ్, అరవింద్ భట్ ఓడిపోయారు. తొలి రౌండ్లో సౌరభ్ వర్మ 21-14, 21-15తో యాంగ్ చి చెయి (చైనీస్ తైపీ)పై... ప్రణయ్ 21-12, 21-18తో చున్ షి కుయ్ (చైనీస్ తైపీ)పై గెలిచారు. జయరామ్ 15-21, 11-21తో కజుమాసా సకాయ్ (జపాన్) చేతిలో; అరవింద్ 15-21, 5-21తో షి యుకి (చైనా) చేతిలో ఓడిపోయారు. -
శ్రీకాంత్ మరో సంచలనం
కౌలూన్ (హాంకాంగ్): చైనా ఓపెన్ నెగ్గిన ఉత్సాహంలో ఉన్న భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలోనూ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఈ హైదరాబాద్ ప్లేయర్ ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించాడు. 66 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో శ్రీకాంత్ 18-21, 22-20, 21-16తో నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ ఒకదశలో 6-10తో వెనుకబడ్డా... పట్టుదలతో పోరాడి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 12-10తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కశ్యప్ 21-16, 17-21, 14-21తో సెన్సోమ్బూన్సుక్ (థాయ్‌లాండ్) చేతిలో; గురుసాయిదత్ 15-21, 21-15, 20-22తో ప్రపంచ 16వ ర్యాంకర్ షో ససాకి (జపాన్) చేతిలో; క్వాలిఫయర్ అజయ్ జయరామ్ 13-21, 7-21తో టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ సైనా నెహ్వాల్ 21-17, 21-11తో జామీ సుబంధి (అమెరికా)పై, ఏడో సీడ్ పి.వి.సింధు 21-15, 16-21, 21-19తో బుసానన్ ఒంగ్‌బుమ్‌రుంగ్‌పాన్ (థాయ్‌లాండ్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి 15-21, 17-21తో మహ్మద్ అహ్సాన్-సెతియవాన్ (ఇండోనేసియా) చేతిలో; మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప 21-16, 14-21, 21-23తో యిన్ లూ లిమ్-లీ మెంగ్ యెనిన్ (మలేసియా) చేతిలో ఓడిపోయారు. -
కశ్యప్ సంచలనం
ప్రపంచ నాలుగో ర్యాంకర్‌పై గెలుపు సైనా, శ్రీకాంత్ శుభారంభం తొలి రౌండ్లోనే ఓడిన సింధు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ పారిస్: గతవారం డెన్మార్క్ ఓపెన్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ను బోల్తా కొట్టించిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్... ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సంచలన విజయంతో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 28వ ర్యాంకర్ కశ్యప్ 21-11, 21-18తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కెనిచి టాగో (జపాన్)ను ఇంటిదారి పట్టించాడు. కేవలం 34 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన కశ్యప్‌కు రెండో గేమ్‌లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. ఒకదశలో కశ్యప్ 12-15తో వెనుకబడినా... వెంటనే తేరుకొని స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత స్కోరు 18-18 వద్ద కశ్యప్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. కెనిచి టాగోపై కశ్యప్‌కిది రెండో విజయం. గతంలో కశ్యప్ ఈ జపాన్ ప్లేయర్ చేతిలో మూడుసార్లు ఓడిపోయాడు. గురువారం జరిగే రెండో రౌండ్లో ప్రపంచ 14వ ర్యాంకర్ హువీ తియాన్ (చైనా)తో కశ్యప్ తలపడతాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ 21-10, 21-14తో క్వాలిఫయర్ దిమిత్రో జవద్స్కయ్ (ఉక్రెయిన్)పై గెలిచాడు. అయితే భారత్‌కే చెందిన సౌరభ్ వర్మ 10-21, 11-21తో రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్) చేతిలో; ప్రణయ్ 11-21, 21-15, 20-22తో కెంటో మొమాటా (జపాన్) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సైనా నెహ్వాల్ 21-16, 21-9తో సషీనా వారన్ (ఫ్రాన్స్)పై గెలుపొందగా... ఎనిమిదో సీడ్ పి.వి.సింధు 21-12, 18-21, 16-21తో పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్సుక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. సషీనాతో జరిగిన మ్యాచ్‌లో సైనా రెండో గేమ్‌లో వరుసగా 11 పాయింట్లు సాధించడం విశేషం. గురువారం జరిగే రెండో రౌండ్లో కిర్స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్)తో సైనా ఆడుతుంది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని పొన్నప్ప (భారత్)-వ్లాదిమిర్ ఇవనోవ్ (రష్యా) ద్వయం 21-16, 21-19తో కీగో సొనోదా-షిజుకా మత్సో (జపాన్) జంటపై గెలిచింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జంట 18-21, 21-16, 21-14తో ముస్కెన్స్-పీక్ సెలెనా (నెదర్లాండ్స్) ద్వయంపై నెగ్గింది. -
అందరికీ క్లిష్టమే!
డెన్మార్క్ ఓపెన్ ‘డ్రా' విడుదల ఒడెన్స్ (డెన్మార్క్): మూడు నెలల విరామం తర్వాత జరుగనున్న తొలి సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ డెన్మార్క్ ఓపెన్‌లో భారత క్రీడాకారులకు క్లిష్టమైన ‘డ్రా' పడింది. ఈనెల 14 నుంచి 19 వరకు జరిగే ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో గురుసాయిదత్ చెక్ రిపబ్లిక్ ప్లేయర్ పీటర్ కౌకల్తో ఆడతాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గెలిస్తే తర్వాతి రౌండ్లో జుయ్ సాంగ్ (చైనా)తో గురుసాయిదత్ ఆడే అవకాశముంది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గితే అతను మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించి తొలి రౌండ్లో బున్సాక్ పొన్సానా (థాయ్‌లాండ్)తో పోటీపడతాడు. ఇక పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో నేరుగా చోటు సంపాదించిన కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా)తో తలపడతాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన పారుపల్లి కశ్యప్ తొలి రౌండ్లో రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)ను ఎదుర్కొంటాడు. ఒకవేళ ఈ అడ్డంకి అధిగమిస్తే ఈ హైదరాబాద్ ఆటగాడికి రెండో రౌండ్లో ఆరో సీడ్ జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా) ప్రత్యర్థిగా ఉండే అవకాశముంది. మహిళల సింగిల్స్ విభాగంలో పి.వి.సింధు తొలి రౌండ్లో పుయ్ యిన్ యిప్ (హాంకాంగ్)తో పోటీపడుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే సింధుకు రెండో రౌండ్లో ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) ఎదురయ్యే అవకాశముంది. మరోవైపు ఏడో సీడ్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో కరీన్ ష్కానెస్ (జర్మనీ)తో ఆడుతుంది. రెండో రౌండ్లో సైనాకు హాన్ లీ (చైనా) లేదా మినత్సు మితాని (జపాన్)లలో ఒకరు ఎదురవుతారు. ఈ అడ్డంకిని అధిగమిస్తే సైనాకు క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా) లేదా ఎరికో హిరోస్ (జపాన్) ఎదురయ్యే అవకాశముంది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ముస్కెన్స్-సెలెనా పీక్ (నెదర్లాండ్స్) జోడీతో ఆడనున్న గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయానికి రెండో రౌండ్లో టాప్ సీడ్ బావో యిజిన్-తాంగ్ జిన్హువా (చైనా) జంట ప్రత్యర్థిగా ఉండే అవకాశముంది.