శ్రీకాంత్ మరో సంచలనం
కౌలూన్ (హాంకాంగ్): చైనా ఓపెన్ నెగ్గిన ఉత్సాహంలో ఉన్న భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలోనూ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఈ హైదరాబాద్ ప్లేయర్ ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించాడు. 66 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో శ్రీకాంత్ 18-21, 22-20, 21-16తో నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ ఒకదశలో 6-10తో వెనుకబడ్డా... పట్టుదలతో పోరాడి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 12-10తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కశ్యప్ 21-16, 17-21, 14-21తో సెన్సోమ్‌బూన్‌సుక్ (థాయ్‌లాండ్) చేతిలో; గురుసాయిదత్ 15-21, 21-15, 20-22తో ప్రపంచ 16వ ర్యాంకర్ షో ససాకి (జపాన్) చేతిలో; క్వాలిఫయర్ అజయ్ జయరామ్ 13-21, 7-21తో టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు.
మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మూడో సీడ్ సైనా నెహ్వాల్ 21-17, 21-11తో జామీ సుబంధి (అమెరికా)పై, ఏడో సీడ్ పి.వి.సింధు 21-15, 16-21, 21-19తో బుసానన్ ఒంగ్‌బుమ్‌రుంగ్‌పాన్ (థాయ్‌లాండ్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి 15-21, 17-21తో మహ్మద్ అహ్‌సాన్-సెతియవాన్ (ఇండోనేసియా) చేతిలో; మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప 21-16, 14-21, 21-23తో యిన్ లూ లిమ్-లీ మెంగ్ యెనిన్ (మలేసియా) చేతిలో ఓడిపోయారు.