the Hong Kong Open Super Series tournament
-
సెమీస్‌లో శ్రీకాంత్
సైనాకు నిరాశ హాంకాంగ్ ఓపెన్ కౌలూన్: మరో అద్భుత విజయంతో శ్రీకాంత్ ముందంజ వేయగా... అనూహ్య ఓటమితో సైనా నెహ్వాల్ నిష్ర్కమించింది. హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భాగంగా శుక్రవారం భారత అగ్రశ్రేణి ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ కుర్రాడు కిడాంబి శ్రీకాంత్ 21-14, 21-15తో ప్రపంచ 21వ ర్యాంకర్ వీ నాన్ (హాంకాంగ్)ను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... మహిళల క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ సైనా నెహ్వాల్ 15-21, 19-21తో ఆరో సీడ్ తాయ్ జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. తొలి గేమ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయిన సైనా, రెండో గేమ్‌లో గట్టిపోటీనిచ్చింది. అయితే 19-19 స్కోరు వద్ద వరుసగా రెండు పాయింట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. గతంలో వీ నాన్‌తో ఆడిన ఏకైక మ్యాచ్‌లో మూడు గేముల్లో నెగ్గిన శ్రీకాంత్ ఈసారి రెండు గేముల్లో విజయాన్ని దక్కించుకున్నాడు. తొలి గేమ్‌లో స్కోరు 10-10 వద్ద ఉన్నపుడు శ్రీకాంత్ వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 14-10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్‌లోనూ దూకుడు కనబరిచిన ఈ తెలుగు తేజం 8-3తో ఆధిక్యాన్ని సంపాదించాడు. ఆ తర్వాత వీ నాన్ తేరుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్, టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా)తో శ్రీకాంత్ తలపడతాడు. లాంగ్‌తో శ్రీకాంత్ ఆడనుండటం ఇది రెండోసారి.. ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆడిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 12-21, 10-21తో ఓడిపోయాడు. -
శ్రీకాంత్ మరో సంచలనం
కౌలూన్ (హాంకాంగ్): చైనా ఓపెన్ నెగ్గిన ఉత్సాహంలో ఉన్న భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలోనూ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఈ హైదరాబాద్ ప్లేయర్ ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించాడు. 66 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో శ్రీకాంత్ 18-21, 22-20, 21-16తో నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ ఒకదశలో 6-10తో వెనుకబడ్డా... పట్టుదలతో పోరాడి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 12-10తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కశ్యప్ 21-16, 17-21, 14-21తో సెన్సోమ్బూన్సుక్ (థాయ్‌లాండ్) చేతిలో; గురుసాయిదత్ 15-21, 21-15, 20-22తో ప్రపంచ 16వ ర్యాంకర్ షో ససాకి (జపాన్) చేతిలో; క్వాలిఫయర్ అజయ్ జయరామ్ 13-21, 7-21తో టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ సైనా నెహ్వాల్ 21-17, 21-11తో జామీ సుబంధి (అమెరికా)పై, ఏడో సీడ్ పి.వి.సింధు 21-15, 16-21, 21-19తో బుసానన్ ఒంగ్‌బుమ్‌రుంగ్‌పాన్ (థాయ్‌లాండ్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి 15-21, 17-21తో మహ్మద్ అహ్సాన్-సెతియవాన్ (ఇండోనేసియా) చేతిలో; మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప 21-16, 14-21, 21-23తో యిన్ లూ లిమ్-లీ మెంగ్ యెనిన్ (మలేసియా) చేతిలో ఓడిపోయారు. -
మెయిన్ ‘డ్రా'కు జయరామ్
హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ కౌలూన్ (హాంకాంగ్): హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత యువతార అజయ్ జయరామ్ మెయిన్ ‘డ్రా'కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల్లో జయరామ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచాడు. తొలి రౌండ్లో 21-12, 22-20తో లతీఫ్ (మలేసియా)పై, రెండో రౌండ్లో 23-21, 21-7తో చున్ (చైనీస్ తైపీ)పై గెలిచాడు. బుధవారం జరిగే మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ లాంగ్ (చైనా)తో అజయ్ జయరామ్; చెన్ చౌ (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్; సెన్సోమ్బూన్సుక్ (థాయ్‌లాండ్)తో కశ్యప్; షో ససాకి (జపాన్)తో గురుసాయిదత్ తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఒంగ్‌బుమ్‌రుంగ్‌పన్ (థాయ్‌లాండ్)తో పీవీ సింధు; జామీ సుబంధి (అమెరికా)తో సైనా నెహ్వాల్ ఆడతారు. సైనా, శ్రీకాంత్‌లకు ప్రణబ్ అభినందనలు చైనా ఓపెన్‌లో టైటిల్స్ సాధించిన సైనా నెహ్వాల్, శ్రీకాంత్‌లను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు. వారిద్దరికీ వ్యక్తిగత సందేశాలు పంపించారు. అలాగే కేంద్ర క్రీడాశాఖ మంత్రి సోనోవాల్ కూడా ఇద్దరినీ ప్రశంసించారు.