అందరికీ క్లిష్టమే! | Difficult for everyone! | Sakshi
Sakshi News home page

అందరికీ క్లిష్టమే!

Published Thu, Oct 9 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM

అందరికీ క్లిష్టమే!

అందరికీ క్లిష్టమే!

డెన్మార్క్ ఓపెన్ ‘డ్రా' విడుదల

 ఒడెన్స్ (డెన్మార్క్): మూడు నెలల విరామం తర్వాత జరుగనున్న తొలి సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ డెన్మార్క్ ఓపెన్‌లో భారత క్రీడాకారులకు క్లిష్టమైన ‘డ్రా' పడింది. ఈనెల 14 నుంచి 19 వరకు జరిగే ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో గురుసాయిదత్ చెక్ రిపబ్లిక్ ప్లేయర్ పీటర్ కౌకల్‌తో ఆడతాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గెలిస్తే తర్వాతి రౌండ్‌లో జుయ్ సాంగ్ (చైనా)తో గురుసాయిదత్ ఆడే అవకాశముంది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గితే అతను మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించి తొలి రౌండ్‌లో బున్సాక్ పొన్సానా (థాయ్‌లాండ్)తో పోటీపడతాడు. ఇక పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో నేరుగా చోటు సంపాదించిన కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా)తో తలపడతాడు.

కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన పారుపల్లి కశ్యప్ తొలి రౌండ్‌లో రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)ను ఎదుర్కొంటాడు. ఒకవేళ ఈ అడ్డంకి అధిగమిస్తే ఈ హైదరాబాద్ ఆటగాడికి రెండో రౌండ్‌లో ఆరో సీడ్ జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా) ప్రత్యర్థిగా ఉండే అవకాశముంది.

 మహిళల సింగిల్స్ విభాగంలో పి.వి.సింధు తొలి రౌండ్‌లో పుయ్ యిన్ యిప్ (హాంకాంగ్)తో పోటీపడుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే సింధుకు రెండో రౌండ్‌లో ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) ఎదురయ్యే అవకాశముంది. మరోవైపు ఏడో సీడ్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్‌లో కరీన్ ష్కానెస్ (జర్మనీ)తో ఆడుతుంది.

రెండో రౌండ్‌లో సైనాకు హాన్ లీ (చైనా) లేదా మినత్సు మితాని (జపాన్)లలో ఒకరు ఎదురవుతారు. ఈ అడ్డంకిని అధిగమిస్తే సైనాకు క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా) లేదా ఎరికో హిరోస్ (జపాన్) ఎదురయ్యే అవకాశముంది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో ముస్కెన్స్-సెలెనా పీక్ (నెదర్లాండ్స్) జోడీతో ఆడనున్న గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయానికి రెండో రౌండ్‌లో టాప్ సీడ్ బావో యిజిన్-తాంగ్ జిన్‌హువా (చైనా) జంట ప్రత్యర్థిగా ఉండే అవకాశముంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement