చిరాగ్ సేన్ ఓటమి
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నీ
బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ అన్‌మోల్ ఖర్బ్, గతేడాది రన్నరప్ తన్వీ శర్మ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మాజీ చాంపియన్లు మిథున్ మంజునాథ్, సౌరభ్ వర్మలు అలవోక విజయాలతో మూడో రౌండ్‌కు చేరారు. కానీ పురుషుల డిఫెండింగ్ చాంపియన్ చిరాగ్ సేన్‌కు మూడో రౌండ్లోనే చుక్కెదురైంది.
శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో అన్‌మోల్ 21–14, 21–14తో కృషిక మహాజన్‌పై గెలుపొందగా, తన్వీ శర్మ 21–12, 21–8తో స్వాతి సోలంకిపై సునాయాస విజయం సాధించింది. రుజుల రాము 21–19, 19–21, 21–17తో పదో సీడ్ సూర్యచరిష్మ తమిరిపై, జియా రావత్ 25–27, 21–14, 21–10తో తొమ్మిదో సీడ్ శ్రుతి ముందాడపై గెలుపొందారు.
పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో చిరాగ్ సెన్‌ను తమిళనాడు షట్లర్ రిత్విక్ కంగుతినిపించాడు. తొలి గేమ్‌ను సులువుగా గెలుచుకున్న చిరాగ్‌కు తర్వాతి గేముల్లో రితి్వక్ నుంచి ఊహించని పోటీ ఎదురవడంతో చేతులెత్తేశాడు. చివరకు రిత్విక్ 12–21, 21–19, 21–15తో చిరాగ్ సేన్‌పై విజయం సాధించాడు.
ప్రిక్వార్టర్ ఫైనల్లో రిత్విక్... ఎమ్. రఘుతో తలపడనున్నాడు. మిథున్ మంజునాథ్ 21–9, 21–18తో మూడో సీడ్ భరత్ రాఘవ్‌ను, సౌరభ్ వర్మ 21–17, 21–17తో అభినవ్ గార్గ్‌ను ఓడించారు. రోహన్ గుర్బాని 21–15, 21–1తో 11వ సీడ్ లోకేశ్ రెడ్డిపై, రఘు 21–19, 21–16తో కార్తీక్ జిందాల్‌పై గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment