తొమ్మిది రోజుల క్రితం డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో తొలి రౌండ్‌లోనే తనను ఓడించిన చెన్ యుఫెపై తెలుగు తేజం పీవీ సింధు ప్రతీకారం తీర్చుకుంది. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో సింధు వరుస గేముల్లో చెన్ యుఫెపై గెలిచింది. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో సింధు తొలిసారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.
పారిస్: గతవారం డెన్మార్క్ ఓపెన్‌లో తడబడిన పీవీ సింధు తన తప్పిదాలను సరిచేసుకొని ఫ్రెంచ్ ఓపెన్‌లో దూసుకెళుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ సింధు 21–14, 21–14తో ప్రపంచ పదో ర్యాంకర్ చెన్ యుఫెను ఓడించింది. ఈ గెలుపుతో ముఖాముఖి రికార్డులో సింధు 3–2తో ఆధిక్యంలోకి వచ్చింది. 41 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు ఏదశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూనే, అడపాదడపా స్మాష్‌లతో అలరించిన సింధు దూకుడుకు చెన్ యుఫె వద్ద సమాధానం కరువైంది. ఒత్తిడికిలోనైన ఈ చైనా స్టార్ క్రమం తప్పకుండా అనవసర తప్పిదాలు చేసి ఏదశలోనూ పుంజుకున్నట్లు కనిపించలేదు. 19 నిమిషాల్లో తొలి గేమ్‌ను దక్కించుకున్న సింధు రెండో గేమ్‌లోనూ నిలకడగా ఆడింది.
ఆరంభంలో 0–3తో వెనుకబడిన సింధు ఆ తర్వాత తేరుకుంది. గతవారం డెన్మార్క్ ఓపెన్‌లో చెన్ యుఫె చేతిలో ఎదురైన ఓటమిని దృష్టిలో పెట్టుకున్న ఈ హైదరాబాద్ క్రీడాకారిణి ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరును 5–5తో సమం చేసింది. అనంతరం 11–7తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు ఈ ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకొని 22 నిమిషాల్లో రెండో గేమ్‌ను దక్కించుకొని విజయాన్ని అందుకుంది. సుంగ్ జీ హున్ (కొరియా)–అకానె యామగుచి (జపాన్)ల మధ్య మ్యాచ్ విజేతతో శనివారం జరిగే సెమీఫైనల్లో సింధు ఆడుతుంది.
ప్రణయ్ జోరు: పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ (భారత్) సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21–16, 21–16తో జియోన్ హైక్ జిన్ (కొరియా)పై గెలిచాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్
21–11, 21–12తో హాన్స్ క్రిస్టియన్ విటింగస్ (డెన్మార్క్)ను ఓడించాడు.
Comments
Please login to add a commentAdd a comment