పారిస్: అదే ప్రత్యర్థి... అదే ఫలితం... వరుసగా రెండో సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లోనూ భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జోరుకు జపాన్ ప్లేయర్ అకానె యామగుచి అడ్డుకట్ట వేసింది. ఫలితంగా ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సైనా పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సైనా 9–21, 21–23తో యామగుచి చేతిలో ఓడిపోయింది. గతవారం డెన్మార్క్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో యామగుచి చేతిలో సైనా పరాజయం చవిచూసింది. సైనా నిష్క్రమించినా... మరోవైపు పీవీ సింధు మరో అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సయాక తకహాషి (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సింధు 21–14, 21–13తో గెలిచింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో చెన్ యుఫె (చైనా)తో సింధు తలపడుతుంది. గతవారం డెన్మార్క్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే చెన్ యుఫె చేతిలో సింధు ఓడిపోయింది.
క్వార్టర్స్‌లో శ్రీకాంత్
పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ 21–19, 21–17తో వోంగ్ వింగ్ కీ విన్సెంట్ (హాంకాంగ్)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. గతవారం డెన్మార్క్ ఓపెన్ టైటిల్ నెగ్గిన శ్రీకాంత్ గురువారం విడుదల చేసిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. మరో మ్యాచ్‌లో సాయిప్రణీత్ 13–21, 17–21తో కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో ఓడిపోయాడు.
సాత్విక్ జంట సంచలనం
పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 22–20, 12–21, 21–19తో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న మ్యాడ్స్ పీటర్సన్–మ్యాడ్స్ కోల్డింగ్ (డెన్మార్క్) జంటపై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లో 16–21, 14–21తో మిసాకి మత్సుతోమో–అయాకా తకహాషి (జపాన్) చేతిలో ఓటమి పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment