సైనా, కశ్యప్‌లకు చుక్కెదురు | Saina Nehwal out, but PV Sindhu advances to 2nd round of Singapore Open | Sakshi
Sakshi News home page

సైనా, కశ్యప్‌లకు చుక్కెదురు

Published Thu, Apr 10 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM

సైనా, కశ్యప్‌లకు చుక్కెదురు

సైనా, కశ్యప్‌లకు చుక్కెదురు

సింగపూర్: భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లకు సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్ విభాగంలో కశ్యప్ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన పి.వి.సింధు తొలి రౌండ్ అడ్డంకిని దాటేందుకు శ్రమించగా... కిడాంబి శ్రీకాంత్, భమిడిపాటి సాయిప్రణీత్ మాత్రం అలవోక విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు.
 
 బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా 21-16, 15-21, 11-21తో ప్రపంచ 15వ ర్యాంకర్ ఎరికో హిరోస్ (జపాన్) చేతిలో ఓడిపోయింది. 62 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌ను నెగ్గినా... అదే జోరును తర్వాత కనబరచడంలో విఫలమైంది.
 
 
 రెండో గేమ్‌లోనైతే సైనా ఒకదశలో తన ప్రత్యర్థికి వరుసగా 8 పాయింట్లు కోల్పోవడం గమనార్హం. మూడో గేమ్‌లోనూ సైనా కోలుకోలేకపోయింది. తొలుత 0-5తో వెనుకబడిన ఈ హైదరాబాద్ అమ్మాయి ఆ తర్వాత తేరుకొని 9-13తో తేడాను నాలుగు పాయింట్లకు తగ్గించింది. ఈ దశలో సైనా తప్పిదాలు చేసి వరుసగా 6 పాయింట్లు సమర్పించుకొని ఓటమిని ఖాయం చేసుకుంది. 2011 తర్వాత సైనా ఓ సూపర్ సిరీస్ టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఓడిపోవడం ఇదే ప్రథమం.
 
 మహిళల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ పి.వి.సింధు 21-9, 19-21, 22-20తో ప్రపంచ 67వ ర్యాంకర్ మిలిసెంట్ విరాంతో (ఇండోనేసియా)పై శ్రమించి గెలిచింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో 123వ ర్యాంకర్ షిజుకా ఉచెద (జపాన్)తో సింధు ఆడుతుంది. ఇతర మ్యాచ్‌ల్లో కేరళ అమ్మాయి పి.సి.తులసీ 21-13, 21-16తో అనా రాన్‌కిన్ (న్యూజిలాండ్)ను ఓడించగా... అరుంధతి పంతవానె 21-16, 11-21, 15-21తో షిజుకా ఉచెద (జపాన్) చేతిలో; తన్వీ లాడ్ 6-21, 11-21తో టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా) చేతిలో ఓడిపోయారు.
 
 పురుషుల సింగిల్స్‌లో 76 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ 21-16, 15-21, 20-22తో ప్రపంచ 35వ ర్యాంకర్ లీ డాంగ్ క్యున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయాడు. మూడో గేమ్‌లో కశ్యప్ 19-17తో ముందంజలో ఉన్నా ఫలితం లేకపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ 21-13, 21-15తో అబ్దుల్ లతీఫ్ (మలేసియా)పై... శ్రీకాంత్ 23-21, 21-15తో టకుమా ఉయెదా (జపాన్)పై, ప్రణయ్ 21-17, 14-21, 21-11తో సితికామ్ (థాయ్‌లాండ్)పై గెలిచారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప 15-21, 16-21తో లూ యింగ్-లూ యు (చైనా) చేతిలో... మిక్స్‌డ్ డబుల్స్‌లో కోనా తరుణ్-అశ్విని పొనప్ప 15-21, 10-21తో క్రిసినాంతా-వానెస్సా (సింగపూర్) చేతిలో ఓడిపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement