మహిళల ‘మరో చరిత్ర’
తొలి సారి ఉబెర్ కప్ సెమీస్‌లో ప్రవేశం
ఇండోనేసియాపై 3-0తో ఘన విజయం
ఒలింపిక్స్ పతకం...వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మెడల్...పెద్ద సంఖ్యలో సూపర్ సిరీస్ సంచలనాలు...అనేకంగా గ్రాండ్ ప్రి టైటిల్స్...వ్యక్తిగతంగా భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణుల ఖాతాలో ఇలా చిరస్మరణీయ విజయాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు జట్టుగా, కలిసి కట్టుగా కూడా మన షట్లర్లు సత్తా చాటారు. ఫలితంగా వరల్డ్ టీమ్ చాంపియన్‌షిప్ ఈవెంట్ ఉబెర్ కప్‌లో భారత జట్టు సెమీఫైనల్‌కి చేరింది. కనీసం కాంస్యాన్ని ఖాయం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించింది.
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ మహిళల టీమ్ చాంపియన్‌షిప్ ఉబెర్ కప్‌లో భారత జట్టు తొలి సారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ఇక్కడి సిరిఫోర్ట్ కాంప్లెక్స్‌లో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ ఇండోనేసియాను 3-0 తేడాతో చిత్తు చేసింది. తొలి రెండు సింగిల్స్‌లలో సైనా నెహ్వాల్, పీవీ సింధు విజయం సాధించి జట్టును ముందంజలో నిలపగా...ఆ తర్వాత డబుల్స్‌లో జ్వాల-అశ్విని జోడి విజయాన్ని పరిపూర్ణం చేసింది. దీంతో భారత్‌కు కనీసం కాంస్యం ఖాయమైంది. 2010 ఉబెర్‌కప్‌లో భారత్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. ఇప్పటివరకూ అదే అత్యుత్తమం. సెమీస్‌లో జపాన్‌తో భారత్ శుక్రవారం తలపడుతుంది.
సైనా అలవోకగా...
తొలి సింగిల్స్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21-17, 21-10 స్కోరుతో లిండావెని ఫనేత్రిని చిత్తు చేసింది. 45 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్ ఆరంభంలో తడబడ్డ సైనా 5-11తో వెనుకబడింది. అయితే ఆ తర్వాత కోలుకొని దూకుడు ప్రదర్శించింది. ఒక దశలో వరుసగా 7 పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఫనేత్రి కొద్దిగా పోరాడినా గేమ్ సైనా వశమైంది. రెండో గేమ్‌లో మాత్రం భారత స్టార్ జోరు కొనసాగింది. మొదటినుంచే చెలరేగిన ఆమె 11-4తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత ఇండోనేసియన్ కోలుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.
హోరాహోరీ పోరులో గట్టెక్కిన సింధు
రెండో సింగిల్స్‌లో మాత్రం సింధు తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. 84 నిమిషాల సేపు సాగిన ఈ పోరులో సింధు 21-16, 10-21, 25-23 తేడాతో బెలాట్రిక్స్ మనుపుట్టిని ఓడించింది. తొలి గేమ్‌లో సింధు తన స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చింది. ఒక దశలో 12-8, 17-12తో ఆధిక్యంలోకి వెళ్లింది. విరామం అనంతరం ప్రత్యర్థి కోలుకునే ప్రయత్నం చేసినా అవకాశం ఇవ్వకుండా గేమ్‌ను ముగించింది.
అయితే ఆ తర్వాత ఒక్కసారిగా విరుచుకు పడిన బెలాట్రిక్స్ సునాయాసంగా రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది. మూడో గేమ్ మాత్రం హోరాహోరీగా సాగింది. ఇద్దరూ పోటీ పడి పాయింట్లు సాధించడంతో గేమ్ సుదీర్ఘంగా సాగింది. 15-15, 17-17, 20-20...ఇలా సాగిన గేమ్ చివరకు 23-23 వద్ద నిలిచింది. ఈ దశలో సింధు వరుసగా రెండు పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను గెలుచుకుంది.
డబుల్స్‌లో వరుస గేమ్‌లలో...
అనంతరం జరిగిన మూడో మ్యాచ్‌లో విజయం సాధించి జ్వాల-అశ్విని జంట భారత్‌కు సెమీస్ స్థానం ఖరారు చేశారు. ఈ మ్యాచ్‌లో జ్వాల-అశ్విని 21-18, 21-18 స్కోరుతో గ్రేసియా పోలి-నిత్య మహేశ్వరిలపై విజయం సాధించారు. భారత డబుల్స్ ద్వయం చక్కటి సమన్వయంతో ఆడి 38 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది.