సరైన సమయంలో దక్కిన విజయమిది! | PV Sindhu won Asian 'medal | Sakshi
Sakshi News home page

సరైన సమయంలో దక్కిన విజయమిది!

Published Wed, Apr 30 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM

సరైన సమయంలో దక్కిన విజయమిది!

సరైన సమయంలో దక్కిన విజయమిది!

‘ఆసియా’ పతకంతో ఆత్మ విశ్వాసం పెరిగింది
 ఉబెర్ కప్‌లో రాణిస్తా
 ‘సాక్షి’తో పీవీ సింధు
 
 సాక్షి, హైదరాబాద్: గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించడం ద్వారా కెరీర్‌లో ఒక్కసారిగా దూసుకుపోయిన తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు అంతర్జాతీయ వేదికపై మరో సారి సత్తా చాటింది.
 
 ఇటీవలే కొరియాలో ముగిసిన ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో కూడా ఆమె కాంస్యం గెలుచుకుంది. ఏబీసీలో మహిళల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన రెండో భారత క్రీడాకారిణి సింధు కావడం విశేషం. త్వరలో జరిగే ఉబెర్ కప్‌కు సిద్ధమవుతున్న సింధు... తాజా ప్రదర్శనపై ‘సాక్షి’తో ముచ్చటించింది. విశేషాలు ఆమె మాటల్లోనే...
 
 ‘ఆసియా’ కాంస్యం: ఆసియా చాంపియన్‌షిప్‌లో తొలి పతకం సాధించడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఫైనల్‌కు చేరకపోవడం స్వయంకృతం. షిజియాన్ వాంగ్ మంచి ప్లేయరే అయినా తొలి గేమ్ నెగ్గడంతో ఉత్సాహంగా రెండో గేమ్‌లో కూడా బాగా ఆడాను. అయితే ఒక్క పాయింట్ నాకు విజయాన్ని దూరం చేసింది. 20-19 వద్ద సుదీర్ఘ ర్యాలీ ఆడిన సమయంలో కాస్త ఒత్తిడికి గురయ్యా. ఇక మూడో గేమ్‌లో పూర్తిగా పట్టు తప్పాను. అయితే నిరాశ చెందను. ఇది నాకు మంచి అనుభవం. నాలో ఆత్మ విశ్వాసం పెరిగింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు దిద్దుకొని మరిన్ని విజయాలు సాధిస్తా.
 
 వరల్డ్ చాంపియన్‌షిప్ తర్వాత మేజర్ గెలుపు: గత ఏడాది  వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన తర్వాత అనేక టోర్నీలు ఆడాను. మకావు ఓపెన్ గెలిచినా సూపర్ సిరీస్‌లు, ఇతర ప్రధాన టోర్నీలలో విఫలమయ్యాను. ఆ రకంగా చూస్తే కొంత విరామం తర్వాత మరో పెద్ద టోర్నీలో పతకం నెగ్గాను. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచి దాదాపు ఎనిమిది నెలలు అయింది. అంతర్జాతీయ వేదికపై నన్ను నేను నిరూపించుకోవాలంటే మరో కీలక విజయం అవసరం. అలాంటి సమయంలో ఈ గెలుపు లభించడం అదృష్టం. పైగా ఈ రెండు టోర్నీలలోనూ పతకం నెగ్గిన ఏకైక క్రీడాకారిణిని కావడం కూడా ఆనందంగా అనిపిస్తోంది.
 
 చైనా క్రీడాకారిణులతో పోటీ పడటం: ఆసియా చాంపియన్‌షిప్ అంటే సహజంగానే చైనా క్రీడాకారిణులూ ఉంటారు. అంటే దాదాపు ప్రపంచ చాంపియన్‌షిప్ స్థాయి పోరాటమే!  ఎందుకంటే ఒక రౌండ్ కాకపోతే మరో రౌండ్‌లోనైనా వారితో పోటీ ఉంటుంది. దానికి సిద్ధమయ్యే వెళ్లాను.
 
 కానీ టోర్నీలో సెమీస్‌లో వాంగ్‌తో మినహా మొదటి మూడు మ్యాచుల్లో నేను చైనావాళ్లను ఎదుర్కోలేదు. అయితే ఆ మ్యాచ్‌లో నా ప్రదర్శన చూస్తే వారేమీ అజేయులు కాదని చెప్పవచ్చు. వంద శాతం శ్రమిస్తే ఎవరినైనా ఓడించవచ్చని నాకు నమ్మకం కలిగింది.
 రాబోయే టోర్నీలు: వచ్చే నెల 18నుంచి ఢిల్లీలోనే ఉబెర్ కప్ ఫైనల్స్ జరగనున్నాయి.
 
 ఈ టీమ్ ఈవెంట్‌లో క్రితం సారి ఆడినప్పుడు మేం విఫలమయ్యాం. అయితే సొంతగడ్డపై జరుగుతుండటం వల్ల మంచి ప్రదర్శన ఆశిస్తున్నాం. ఈ ఏడాది మన గ్రూప్‌లో థాయిలాండ్, కెనడా, హాంకాంగ్ ఉన్నాయి. లీగ్ దశను దాటితే క్వార్టర్స్, ఆపై కనీసం సెమీస్‌కు వెళ్లవచ్చు. నేను కూడా బాగా ఆడి జట్టును గెలిపించాలని పట్టుదలగా ఉన్నాను. ప్రస్తుతం ఈ టోర్నీపైనే దృష్టి పెట్టాం. ఆ తర్వాత కోచ్ గోపీచంద్ సూచనల ప్రకారం సూపర్ సిరీస్ టోర్నీ కోసం ప్రణాళిక రూపొందించుకుంటాను. ఇక ర్యాంకింగ్స్ గురించి ఆందోళన లేదు. నిలకడగా టాప్-10లో కొనసాగితే చాలు.
 
 కొత్తగా ఎండార్స్‌మెంట్‌లాంటివి: నా కెరీర్ ఆరంభంలోనే ఉంది. వరల్డ్ చాంపియన్‌షిప్, ఆసియా చాంపియన్‌షిప్‌లాంటి రెండు పెద్ద మెడల్స్ గెలిచాను. కాబట్టి ఇప్పుడే కాకపోయినా తర్వాతైనా అవకాశాలు దక్కవచ్చు. ప్రస్తుతం ఎలాంటి ఒప్పందాలు లేకపోయినా... మున్ముందు ఎండార్స్‌మెంట్స్ వస్తాయనే ఆశిస్తున్నాను.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement