మాలవీయకు ‘భారతరత్న’
- ఆయన కుటుంబానికి అందజేసిన రాష్ట్రపతి
- ఎల్‌కే అద్వానీ, ప్రకాశ్‌సింగ్ బాదల్‌లకు ‘పద్మ విభూషణ్’
- షట్లర్ సింధుకు ‘పద్మశ్రీ’
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు, బెనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు మదన్ మోహన్ మాలవీయకు మరణానంతరం ప్రకటించిన ‘భారత రత్న’ అవార్డును ఆయన కుటుంబ సభ్యులు సోమవారం అందుకున్నారు. రాష్ట్రపతిభవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాలవీయ మనవరాళ్లు, మనవళ్లు హేమ్ శర్మ, సరస్వతిశర్మ, ప్రేమ్‌ధర్, గిరిధర్‌లకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అత్యున్నత అవార్డును ప్రదానం చేశారు. దీనితోపాటు ‘పద్మ’ పురస్కారాలనూ ఆయన ప్రదానం చేశారు.
బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, పంజాబ్ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్, జగద్గురు స్వామి రాంభద్రాచార్యలకు పద్మ విభూషణ్ అవార్డును, ప్రఖ్యాత న్యాయవాది హరీశ్ సాల్వే, జర్నలిస్టులు స్వపన్ దాస్‌గుప్తా, రజత్ శర్మ, నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌కు సహకరించిన జపనీయుడు సైచిరో మిసుమి, రెజ్లర్ సత్పాల్‌లకు పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేశారు. ఇక బాలీవుడ్ ప్రముఖులు సంజయ్ లీలా భన్సాలీ, ప్రసూన్ జోషితో పాటు తెలుగు వారైన షట్లర్ పి.వి.సింధు, డాక్టర్ మంజుల అనగాని, కన్యాకుమారి అవసరాల, జయకుమారి చిక్కాల, రఘురామ పిల్లారిశెట్టిలతో పాటు మరికొందరికి పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం మాజీ ప్రధానులు అందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కానీ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సహా కాంగ్రెస్ నేతలెవరూ హాజరుకాకపోవడం గమనార్హం. కాగా ఎన్డీయే సర్కారు మొత్తంగా 109 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా.. 43 మందికి సోమవారం ప్రదానం చేశారు.
మరో ఆరుగురికి ఆహ్వానం పంపినా.. వారు హాజరుకాలేదు. భారత మహిళ క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్ (క్రీడలు) తెలంగాణ, కోట శ్రీనివాసరావు (కళలు) ఆంధ్రప్రదేశ్, నోరి దత్తాత్రేయుడు (వైద్యం) యూఎస్‌ఏసహా మిగతా 60 మందికి ఏప్రిల్ 8వ తేదీన నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేయనున్నారు.
‘పద్మ’ గ్రహీతలకు జగన్ అభినందనలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సోమవారం ఢిల్లీలో ‘పద్మ’ పురస్కారాలను అందుకున్న తెలుగు వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన తెలుగువారిని ఈ అవార్డులను ఎంపిక చేయడం ఎంతో సంతోషదాయకమని ఆయన చెప్పారు. వారందరికీ భవిష్యత్‌లో అంతా మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు.