ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తా
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు
సాక్షి, హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే లక్ష్యంతో వచ్చే ఏడాది మరింత కష్టపడతానని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వ్యాఖ్యానించింది. ఇదే జోరును వచ్చే ఏడాది కూడా కొనసాగిస్తానని ఆమె చెప్పింది. మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ గెలిచిన తర్వాత స్వస్థలం చేరుకున్న సింధు, మంగళవారం గోపీచంద్ అకాడమీలో మీడియాతో మాట్లాడింది.
‘మకావులో విజయం సాధించడం సంతోషంగా ఉంది. ఈ ఏడాది బాగా ఆడాను. 2015 ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ సంవత్సరం. కాబట్టి ఆ లక్ష్యంతో సన్నద్ధమవుతున్నా’ అని చెప్పింది. ప్రస్తుతం చైనాతో పాటు జపాన్, కొరియా క్రీడాకారిణులనుంచి కూడా గట్టి పోటీ ఉంటోందన్న సింధు, భవిష్యత్తులో సాధ్యమైనంత తొందరగా సూపర్ సిరీస్ టైటిల్ గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేసింది.
ఆట శైలిలో తనకు, సైనాకు తేడా ఉందని సింధు చెప్పింది. సయ్యద్ మోడి టోర్నీతో సింధు కొత్త సీజన్‌ను ప్రారంభించనుంది. ఈ సందర్భంగా భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ...ఇటీవల భారత ఆటగాళ్లు మంచి విజయాలు సాధించినా ఉదాసీనత పనికి రాదని అన్నారు. మనతో పాటు ఇతర దేశాల యువ ఆటగాళ్లు విజయాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారని, ఈ స్థితిలో విశ్రాంతి తీసుకుంటే పరాజయాలు ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు.