సూపర్ సింధు
పారిస్: వారం రోజుల క్రితం డెన్మార్క్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిన భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ పి.వి.సింధు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో మాత్రం శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సంచలనం సృష్టించింది. ప్రపంచ ఆరో ర్యాంకర్, డెన్మార్క్ ఓపెన్ రన్నరప్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో జరిగిన మ్యాచ్‌లో సింధు 21-8, 21-12తో విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
కేవలం 29 నిమిషాల్లో తన ప్రత్యర్థిని చిత్తు చేసిన సింధు స్మాష్‌ల ద్వారా 14 పాయింట్లు, నెట్‌వద్ద 10 పాయింట్లు గెలిచింది. తొలి గేమ్‌లోనైతే ప్రపంచ పదో ర్యాంకర్ సింధు ఒకదశలో వరుసగా తొమ్మిది పాయింట్లు సంపాదించింది. ఓవరాల్‌గా సుంగ్ జీ హున్‌పై సింధుకిది మూడో విజయం కావడం విశేషం. గత ఏడాది ఇండియా ఓపెన్‌లో, ఈ ఏడాది స్విస్ ఓపెన్‌లోనూ సింధు చేతిలో సుంగ్ జీ హున్ ఓడిపోయింది. మరోవైపు నాలుగో సీడ్ సైనా నెహ్వాల్ అతికష్టమ్మీద తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించింది.
ప్రపంచ 15వ ర్యాంకర్ నిచావోన్ జిందాపోన్ (థాయ్‌లాండ్)తో జరిగిన మ్యాచ్‌లో నిరుటి రన్నరప్ సైనా 16-21, 21-16, 21-13తో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా స్మాష్‌ల ద్వారా తొమ్మిది పాయింట్లు, నెట్‌వద్ద 16 పాయింట్లు సంపాదించింది. మరో మ్యాచ్‌లో భారత్‌కే చెందిన అరుంధతి పంతవానె 17-21, 21-16, 14-21తో పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్‌సుక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో యోన్ జూ బే (దక్షిణ కొరియా)తో సైనా నెహ్వాల్; క్రిస్టినా (చెక్ రిపబ్లిక్) లేదా కిర్‌స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్)తో సింధు తలపడతారు.
ఆనంద్ పవార్ ముందంజ
పురుషుల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు కిడాంబి శ్రీకాంత్... మహారాష్ట్ర ప్లేయర్ ఆనంద్ పవార్ ముందంజ వేశారు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో ప్రపంచ 30వ ర్యాంకర్ శ్రీకాంత్ 21-14, 17-21, 21-10తో ప్రపంచ 12వ ర్యాంకర్ వింగ్ కీ వోంగ్ (హాంకాంగ్)పై సంచలన విజయం సాధించగా... ఆనంద్ పవార్ 21-9, 24-22తో థామస్ రూక్సెల్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. మంగళవారం రాత్రి ఆలస్యంగా జరిగిన మరో మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గురుసాయిదత్ 9-21, 14-21తో చెన్ యుకున్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్ బూన్‌సక్ పొన్సానా (థాయ్‌లాండ్)తో శ్రీకాంత్; సెన్‌సోమ్‌బూన్‌సుక్ (థాయ్‌లాండ్)తో ఆనంద్ పవార్; టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా)తో అజయ్ జయరామ్ పోటీపడతారు.
పోరాడి ఓడిన జ్వాల జోడి
మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జోడికి తొలి రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది. జ్వాల-అశ్విని జంట 18-21, 21-13, 17-21తో గెబ్బీ రిస్తియాని-తియారా రొసాలియా (ఇండోనేసియా) ద్వయం చేతిలో పోరాడి ఓడింది.