french open super series tournment
-
కిడాంబి శ్రీకాంత్‌కు ఘన స్వాగతం
సాక్షి, హైదరాబాద్: వరుసగా రెండు సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించి హైదరాబాద్ చేరుకున్నస్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌కు ఘనస్వాగతం లభించింది. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న శ్రీకాంత్‌కు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ వరుసగా రెండు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలుచుకోవబం సంతోషంగా ఉందన్నారు. తన విజయాల వెనుక కోచ్ పుల్లెల గోపిచంద్ కృషి ఎంతో ఉందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని టోర్నీలు గెలవడానికి ప్రయత్నిస్తానన్నారు. ఈ ఏడాది ఇండోనేషియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. -
శ్రీకాంత్... ది గ్రేట్
కొన్నేళ్ల క్రితం భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరైనా అంతర్జాతీయస్థాయిలో ఒక్క టైటిల్ గెలిస్తే ఎంతో మురిసిపోయేవాళ్లం. కానీ ఇప్పుడు... ప్రత్యర్థి ఎంతటి వారైనా ‘సూపర్’గా ఆడుతూ మనోళ్లు టైటిల్స్‌ను గెలవడం అలవాటుగా మార్చుకున్నారు. ముఖ్యంగా తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ తన అద్వితీయ ఆటతీరుతో మరోసారి మెప్పించాడు. తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 2007లో ఫ్రెంచ్ ఓపెన్‌కు సూపర్ సిరీస్ హోదా లభించాక ఈ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో బ్యాడ్మింటన్ దిగ్గజాలు లిన్ డాన్ (చైనా), లీ చోంగ్ వీ (మలేసియా), చెన్ లాంగ్ (చైనా) తర్వాత ఒకే ఏడాది కనీసం నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన నాలుగో ప్లేయర్‌గా ఘనత వహించాడు. అందరిచేతా మన శ్రీకాంత్... ‘ది గ్రేట్’ అనిపించుకున్నాడు. పారిస్: వేదిక మారింది. టోర్నీ మారింది. ప్రత్యర్థీ మారాడు. కానీ ఫలితం మాత్రం మారలేదు. భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ మరోసారి ‘సూపర్’గా ఆడాడు. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ శ్రీకాంత్ 21–14, 21–13తో ప్రపంచ 40వ ర్యాంకర్, క్వాలిఫయర్ కెంటా నిషిమోటో (జపాన్)పై అలవోకగా గెలిచాడు. కేవలం 35 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌కు తొలి గేమ్ ఆరంభంలో మినహా మరెక్కడా పోటీ ఎదురుకాలేదు. ప్రతీ రౌండ్లో తనకంటే మెరుగైన ఆటగాళ్లు లీ చోంగ్ వీ (8వ ర్యాంక్–మలేసియా), సాయిప్రణీత్ (15వ ర్యాంక్–భారత్), ఆంథోనీ జిన్‌టింగ్ (16వ ర్యాంక్–ఇండోనేసియా), ఆంటోన్సెన్ (17వ ర్యాంక్–డెన్మార్క్)లను బోల్తా కొట్టించిన నిషిమోటో ఫైనల్లో మాత్రం శ్రీకాంత్ దూకుడుకు తలవంచక తప్పలేదు. తొలి గేమ్‌లో ఒకదశలో శ్రీకాంత్ 5–9తో వెనుకబడినా... నిషిమోటో ఆటతీరుపై అవగాహన వచ్చాక ఈ హైదరాబాద్ ప్లేయర్ రెచ్చిపోయాడు. వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 11–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. అనంతరం ఒకసారి వరుసగా నాలుగు పాయింట్లు, మరోసారి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండో గేమ్‌లో శ్రీకాంత్ మరింత విజృంభించాడు. ఆరంభంలోనే 10–2తో ఆధిక్యాన్ని సంపాదించిన శ్రీకాంత్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన శ్రీకాంత్ సింగపూర్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా శ్రీకాంత్ కెరీర్లో ఇది ఆరో సూపర్ సిరీస్ టైటిల్. కెరీర్ బెస్ట్ ర్యాంక్‌కు... ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన శ్రీకాంత్‌కు 24,375 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 15 లక్షల 85 వేలు)తోపాటు 9,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ విజయంతో శ్రీకాంత్ వచ్చే గురువారం విడుదల చేసే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో తొలిసారి అత్యుత్తమంగా రెండో ర్యాంక్‌కు చేరుకోనున్నాడు. ఇంతకుముందు 2015 ఆగస్టులో శ్రీకాంత్ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. ప్రశంసల వెల్లువ... ఈ ఏడాది నాలుగో సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన శ్రీకాంత్‌పై ప్రశంసల వర్షం కురిసింది. ‘అభినందనలు. విజయాలను అలవాటు చేసుకున్నావు. నిన్ను చూసి దేశం గర్వపడుతోంది’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్... ‘శ్రీకాంత్ మరో శుభవార్త వినిపించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో అద్భుత విజయం సాధించి దేశం గర్వించేలా చేశాడు’ అని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రాబాబు, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు, ఐటీ శాఖా మంత్రి కె.తారక రామారావు కూడా శ్రీకాంత్‌ను అభినందించారు. భవిష్యత్‌లో అతను మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. శ్రీకాంత్ గత రెండు వారాలు ఎంతో అద్భుతంగా గడిచాయి. కొన్ని క్లిష్టమైన మ్యాచ్‌ల్లో పైచేయి సాధించాను. ఈ ఏడాది మిగిలిన టోర్నీల్లోనూ ఇదే జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాను. -
ఫ్రెంచ్ ఓపెన్ విజేత తెలుగు తేజం..
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల బ్యాడ్మింటన్ ఫైనల్లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ మరోసారి తన సత్తా చాటాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో 40వ ర్యాంకర్ కెంటా నిషిమోటో(జపాన్)పై వరుస సెట్లలో విజయం సాధించి కెరీర్లో ఐదో సూపర్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై కిదాంబి పైచేయి సాధిస్తూ వచ్చాడు. 21-14, 21-13 తేడాతో రెండు సెట్లు గెలుచుకొని విజయకేతనం ఎగురవేశాడు. ఈ గెలుపుతో సీజన్లో వరుసగా నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలుచుకున్నతొలి భారత ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. గత ఆదివారం డెన్మార్క్ ఓపెన్ టైటిల్ నెగ్గిన శ్రీకాంత్ తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కూడా కైవసం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన మరో అగ్రశ్రేణి ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్‌ను సెమీస్‌లో ఓడించి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. -
సూపర్ సింధు
పారిస్: వారం రోజుల క్రితం డెన్మార్క్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓడిన భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ పి.వి.సింధు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో మాత్రం శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సంచలనం సృష్టించింది. ప్రపంచ ఆరో ర్యాంకర్, డెన్మార్క్ ఓపెన్ రన్నరప్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో జరిగిన మ్యాచ్‌లో సింధు 21-8, 21-12తో విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కేవలం 29 నిమిషాల్లో తన ప్రత్యర్థిని చిత్తు చేసిన సింధు స్మాష్‌ల ద్వారా 14 పాయింట్లు, నెట్‌వద్ద 10 పాయింట్లు గెలిచింది. తొలి గేమ్‌లోనైతే ప్రపంచ పదో ర్యాంకర్ సింధు ఒకదశలో వరుసగా తొమ్మిది పాయింట్లు సంపాదించింది. ఓవరాల్‌గా సుంగ్ జీ హున్‌పై సింధుకిది మూడో విజయం కావడం విశేషం. గత ఏడాది ఇండియా ఓపెన్‌లో, ఈ ఏడాది స్విస్ ఓపెన్‌లోనూ సింధు చేతిలో సుంగ్ జీ హున్ ఓడిపోయింది. మరోవైపు నాలుగో సీడ్ సైనా నెహ్వాల్ అతికష్టమ్మీద తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించింది. ప్రపంచ 15వ ర్యాంకర్ నిచావోన్ జిందాపోన్ (థాయ్‌లాండ్)తో జరిగిన మ్యాచ్‌లో నిరుటి రన్నరప్ సైనా 16-21, 21-16, 21-13తో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా స్మాష్‌ల ద్వారా తొమ్మిది పాయింట్లు, నెట్‌వద్ద 16 పాయింట్లు సంపాదించింది. మరో మ్యాచ్‌లో భారత్‌కే చెందిన అరుంధతి పంతవానె 17-21, 21-16, 14-21తో పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్సుక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో యోన్ జూ బే (దక్షిణ కొరియా)తో సైనా నెహ్వాల్; క్రిస్టినా (చెక్ రిపబ్లిక్) లేదా కిర్స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్)తో సింధు తలపడతారు. ఆనంద్ పవార్ ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు కిడాంబి శ్రీకాంత్... మహారాష్ట్ర ప్లేయర్ ఆనంద్ పవార్ ముందంజ వేశారు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 30వ ర్యాంకర్ శ్రీకాంత్ 21-14, 17-21, 21-10తో ప్రపంచ 12వ ర్యాంకర్ వింగ్ కీ వోంగ్ (హాంకాంగ్)పై సంచలన విజయం సాధించగా... ఆనంద్ పవార్ 21-9, 24-22తో థామస్ రూక్సెల్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. మంగళవారం రాత్రి ఆలస్యంగా జరిగిన మరో మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గురుసాయిదత్ 9-21, 14-21తో చెన్ యుకున్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్ బూన్సక్ పొన్సానా (థాయ్‌లాండ్)తో శ్రీకాంత్; సెన్సోమ్బూన్సుక్ (థాయ్‌లాండ్)తో ఆనంద్ పవార్; టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా)తో అజయ్ జయరామ్ పోటీపడతారు. పోరాడి ఓడిన జ్వాల జోడి మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జోడికి తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. జ్వాల-అశ్విని జంట 18-21, 21-13, 17-21తో గెబ్బీ రిస్తియాని-తియారా రొసాలియా (ఇండోనేసియా) ద్వయం చేతిలో పోరాడి ఓడింది.