
కొన్నేళ్ల క్రితం భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరైనా అంతర్జాతీయస్థాయిలో ఒక్క టైటిల్ గెలిస్తే ఎంతో మురిసిపోయేవాళ్లం. కానీ ఇప్పుడు... ప్రత్యర్థి ఎంతటి వారైనా ‘సూపర్’గా ఆడుతూ మనోళ్లు టైటిల్స్‌ను గెలవడం అలవాటుగా మార్చుకున్నారు. ముఖ్యంగా తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ తన అద్వితీయ ఆటతీరుతో మరోసారి మెప్పించాడు.
తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 2007లో ఫ్రెంచ్ ఓపెన్‌కు సూపర్ సిరీస్ హోదా లభించాక ఈ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో బ్యాడ్మింటన్ దిగ్గజాలు లిన్ డాన్ (చైనా), లీ చోంగ్ వీ (మలేసియా), చెన్ లాంగ్ (చైనా) తర్వాత ఒకే ఏడాది కనీసం నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన నాలుగో ప్లేయర్‌గా ఘనత వహించాడు. అందరిచేతా మన శ్రీకాంత్... ‘ది గ్రేట్’ అనిపించుకున్నాడు.
పారిస్: వేదిక మారింది. టోర్నీ మారింది. ప్రత్యర్థీ మారాడు. కానీ ఫలితం మాత్రం మారలేదు. భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ మరోసారి ‘సూపర్’గా ఆడాడు. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ శ్రీకాంత్ 21–14, 21–13తో ప్రపంచ 40వ ర్యాంకర్, క్వాలిఫయర్ కెంటా నిషిమోటో (జపాన్)పై అలవోకగా గెలిచాడు. కేవలం 35 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌కు తొలి గేమ్ ఆరంభంలో మినహా మరెక్కడా పోటీ ఎదురుకాలేదు.
ప్రతీ రౌండ్‌లో తనకంటే మెరుగైన ఆటగాళ్లు లీ చోంగ్ వీ (8వ ర్యాంక్–మలేసియా), సాయిప్రణీత్ (15వ ర్యాంక్–భారత్), ఆంథోనీ జిన్‌టింగ్ (16వ ర్యాంక్–ఇండోనేసియా), ఆంటోన్‌సెన్ (17వ ర్యాంక్–డెన్మార్క్)లను బోల్తా కొట్టించిన నిషిమోటో ఫైనల్లో మాత్రం శ్రీకాంత్ దూకుడుకు తలవంచక తప్పలేదు. తొలి గేమ్‌లో ఒకదశలో శ్రీకాంత్ 5–9తో వెనుకబడినా... నిషిమోటో ఆటతీరుపై అవగాహన వచ్చాక ఈ హైదరాబాద్ ప్లేయర్ రెచ్చిపోయాడు.
వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 11–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. అనంతరం ఒకసారి వరుసగా నాలుగు పాయింట్లు, మరోసారి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండో గేమ్‌లో శ్రీకాంత్ మరింత విజృంభించాడు. ఆరంభంలోనే 10–2తో ఆధిక్యాన్ని సంపాదించిన శ్రీకాంత్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన శ్రీకాంత్ సింగపూర్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా శ్రీకాంత్ కెరీర్‌లో ఇది ఆరో సూపర్ సిరీస్ టైటిల్.
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌కు...
ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన శ్రీకాంత్‌కు 24,375 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 15 లక్షల 85 వేలు)తోపాటు 9,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ విజయంతో శ్రీకాంత్ వచ్చే గురువారం విడుదల చేసే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో తొలిసారి అత్యుత్తమంగా రెండో ర్యాంక్‌కు చేరుకోనున్నాడు. ఇంతకుముందు 2015 ఆగస్టులో శ్రీకాంత్ మూడో ర్యాంక్‌లో నిలిచాడు.
ప్రశంసల వెల్లువ...
ఈ ఏడాది నాలుగో సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన శ్రీకాంత్‌పై ప్రశంసల వర్షం కురిసింది. ‘అభినందనలు. విజయాలను అలవాటు చేసుకున్నావు. నిన్ను చూసి దేశం గర్వపడుతోంది’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్... ‘శ్రీకాంత్ మరో శుభవార్త వినిపించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో అద్భుత విజయం సాధించి దేశం గర్వించేలా చేశాడు’ అని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రాబాబు, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు, ఐటీ శాఖా మంత్రి కె.తారక రామారావు కూడా శ్రీకాంత్‌ను అభినందించారు. భవిష్యత్‌లో అతను మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
శ్రీకాంత్
గత రెండు వారాలు ఎంతో అద్భుతంగా గడిచాయి. కొన్ని క్లిష్టమైన మ్యాచ్‌ల్లో పైచేయి సాధించాను. ఈ ఏడాది మిగిలిన టోర్నీల్లోనూ ఇదే జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాను.
Comments
Please login to add a commentAdd a comment