సింధు నిష్ర్కమణ
కశ్యప్ సంచలన విజయం
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్
న్యూఢిల్లీ: సింధుపై ఈ సారి షిజియాన్ వాంగ్‌దే పైచేయి అయింది. గతంలో ఈ ఏపీ అమ్మాయి చేతిలో మూడు సార్లు ఓడిన ఈ చైనా షట్లర్ ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో సత్తా చాటింది. రెండో సీడ్ వాంగ్ జోరుకు సింధు తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం ఇక్కడి సిరిఫోర్ట్ స్పోర్ట్స్ కాంపెక్స్‌లో 70 నిమిషాలపాటు జరిగిన మారథాన్ మ్యాచ్‌లో సింధు 15-21, 21-12, 10-21 స్కోరుతో రెండో సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయింది.
తొలి గేమ్‌ను కోల్పోయిన అనంతరం సింధు కోలుకుని రెండో గేమ్‌లో చెలరేగింది. అయితే చివరి గేమ్‌లో సింధు ఒక దశలో 3-0తో ఆధిక్యంలో నిలిచినప్పటికీ.. షిజియాన్ తన నైపుణ్యంతో 16-4తో పైచేయి సాధించింది. చివరికి షిజియాన్ వాంగ్ 21-10తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా నెగ్గింది. ఇక స్టార్ షట్లర్, ఎనిమిదో సీడ్ సైనా నెహ్వాల్ 21-7, 21-9తో సిమోన్ (ఆస్ట్రియా)పై అలవోకగా నెగ్గి రెండోరౌండ్‌లోకి ప్రవేశించింది.
కశ్యప్ అదుర్స్
తెలుగుతేజం కశ్యప్ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో కశ్యప్ 21-12, 17-21, 21-12తో ప్రపంచ ఏడో ర్యాంకర్, ఆరో సీడ్ జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా)పై విజయం సాధించాడు. కశ్యప్ గతంలో రెండు సార్లు (2012లో చైనా, 2013లో హాంకాంగ్ టోర్నీ) వాంగ్ చేతిలో ఓడిపోయాడు. అయితే మూడో ప్రయత్నంలో సఫలమయ్యాడు. మరో మ్యాచ్‌లో మలేసియా గ్రాండ్ ప్రి గోల్డ్ ఫైనలిస్ట్ సౌరభ్ వర్మ 21-16, 17-21, 21-14తో వ్లాదిమిర్ ఇవనోవ్ (రష్యా)పై నెగ్గాడు. ఇక తెలుగుతేజం గురుసాయిదత్ 17-21, 21-16, 21-17తో తిన్ చెన్ చౌ (చైనీస్ తైపీ)పై గెలిచాడు.
ఇతర భారత ఆటగాళ్లు ప్రణయ్, కె. శ్రీకాంత్, సాయి ప్రణీత్, అనూప్ శ్రీధర్, శ్రేయాంష్ జైస్వాల్, ఆనంద్ పవార్, అజయ్ కుమార్ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు. మహిళల సింగిల్స్‌లో సయాలీ గోఖలె, తృప్తి ముర్గండే రెండో రౌండ్‌కి చేరగా... సయాలీ రాణే, తాన్వీలాడ్, శృతి, తులసి నిష్ర్కమించారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడి 21-19, 17-21, 21-14తో చాయానిత్-ముంకితామొర్న్ (థాయ్‌లాండ్)పై గెలిచి ప్రి క్వార్టర్ ఫైన్లలోకి ప్రవేశించింది.
ఐబీఎల్‌లో ఆడతారా ?
ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) రెండో ఎడిషన్‌కు స్టార్ ఆటగాళ్లు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత షట్లర్లు సైనా నెహ్వాల్, పి.వి.సింధుతో పాటు ప్రపంచ స్టార్లు ఐబీఎల్‌కు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. ఐబీఎల్-2 సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 14 వరకు జరగనుంది. అయితే ఈ టోర్నీ ముగిసే లోపే (అక్టోబర్ 14 నుంచి) డెన్మార్క్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ ప్రారంభమవుతుంది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యుఎఫ్) నిబంధనల ప్రకారం టాప్-10 ప్లేయర్లు సూపర్ సిరీస్ టోర్నీల్లో కచ్చితంగా పాల్గొనాలి. గాయపడిన వారికి మినహాయింపు ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఐబీఎల్-2 చివరి దశలో మ్యాచ్‌లకు స్టార్ ఆటగాళ్లు దూరమయ్యే అవకాశం ఉంది. అయితే ఐబీఎల్ నిర్వాహకులు మాత్రం డెన్మార్క్ సూపర్ సిరీస్ వల్ల ఐబీఎల్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు. స్టార్ ప్లేయర్లు ఐబీఎల్‌లో పాల్గొంటారని... అవసరమైతే షెడ్యూల్‌లో మార్పులు, చేర్పులు చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.