మూడు లక్ష్యాలతో ముందుకు...
న్యూఢిల్లీ: గతేడాదిని విజయవంతంగా ముగించిన ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఈ ఏడాది కూడా అదే రీతిన ఆరంభించింది. ఇప్పటికే సయ్యద్ మోడి అంతర్జాతీయ టోర్నీలో రన్నరప్‌గా నిలువగా... ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నీలో విజేతగా నిలిచి మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇదే జోరును రానున్న టోర్నీల్లోనూ కొన సాగిస్తానని విశ్వా సం వ్యక్తం చేసింది.
ప్రస్తుతానికైతే వచ్చే నెల 4 నుంచి 9 వరకు జరిగే ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌పై దృష్టి సారించానని ప్రపంచ పదో ర్యాంకర్ సింధు తెలిపింది. అలాగే ఈ ఏడాదే జరిగే కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో పతకాలు నెగ్గడంతోపాటు...సీజన్ ముగింపు దశకు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-6కు చేరడమే తన లక్ష్యమని పేర్కొంది. తన కొత్త స్పాన్సర్ లీ నింగ్ సంస్థ ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సింధు పలు అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే...
ఈ ఏడాది షెడ్యూల్ కాస్త కఠినంగానే ఉంది. వెంటవెంటనే టోర్నీలున్నాయి. ఈనెల అయితే మొత్తం విశ్రాంతి దొరికింది. కాబట్టి నా స్ట్రోక్స్, డిఫెన్స్‌పై దృష్టి సారించాను.
వచ్చే నెలలో జరిగే ఆల్ ఇంగ్లండ్ టోర్నీకి నా సన్నాహాలు బాగానే సాగుతున్నాయి. ఆ తర్వాత స్విస్ ఓపెన్ ఉంటుంది. వెంటనే సూపర్ సిరీస్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు జరుగనున్నాయి.
నేను ఏయే టోర్నీలు ఆడాలనే విషయం కోచ్ గోపీచంద్ నిర్ణయిస్తాడు. అయితే కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి ఆడబోతున్నందుకు చాలా ఆసక్తిగా ఉంది. ఈసారి భారత ఆటగాళ్లు ఎక్కువ పతకాలు గెలుస్తారనుకుంటున్నాను.
ఈ ఏడాది చివరి వరకు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడు లేక ఆరో స్థానంలో ఉండాలని నా ఆలోచన. అయితే నా స్ట్రోక్స్ విషయంలో ఇంకా రాణించాల్సి ఉంది.
మేలో న్యూఢిల్లీలో జరిగే ఉబెర్ కప్ టీమ్ చాంపియన్‌షిప్‌లో మేం విశేషంగా రాణించాలని భావిస్తున్నాం. క్రితం సారి నేను బాగానే ఆడాను.
సైనాపై ఐబీఎల్‌లోకన్నా సయ్యద్ మోడి టోర్నీలోనే మెరుగ్గా ఆడాను. అటాకింగ్ గేమ్ ఆడాలనుకున్నా సాధ్యం కాలేదు. సైనా చాలా అనుభవజ్ఞురాలు.