ధీమా పెరిగింది
గత ఏడాది లండన్ ఒలింపిక్స్‌లో ఎన్నడూలేని విధంగా ఆరు పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారులు ఈ సంవత్సరం కూడా తమ జోరు కొనసాగించారు. విశ్వ క్రీడా వేదికపై తమదైన ముద్ర వేశారు. ఆర్చరీ నుంచి రెజ్లింగ్ దాకా ప్రతి క్రీడాంశంలో మనోళ్లు మెరిశారు.
భారత క్రీడాకారులు ఈ విజయనామ సంవత్సరంలో విజయాలు మోసుకొచ్చారు. కొన్నేళ్ల క్రితం వరకు అంతర్జాతీయ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం కోసమే వెళ్లేవారు ఇపుడు పతకాలతో తిరిగి వస్తున్నారు.
వివాదాలు వెంటాడుతున్నా... అంచనాలను అందుకుంటూ... ఆశలను నేరవేరుస్తూ... క్రీడలను కూడా కెరీర్‌గా ఎంచుకోవచ్చనే ధీమాను పెంచుతూ... అద్వితీయ విజయాలతో క్రీడా ప్రపంచంలో మరింత ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది భారత క్రీడారంగంలో గుర్తుంచుకోదగిన క్షణాల సమాహారం... సాక్షి పాఠకుల కోసం.
లేటు వయసులో మేటి ఫలితాలు (టెన్నిస్)
ఉత్సాహం, పట్టుదల ఉంటే లేటు వయసులోనూ మేటి ఫలితాలు సాధించొచ్చని లియాండర్ పేస్ నిరూపించాడు. రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్)తో కలిసి ఈ కోల్‌కతా యోధుడు 40 ఏళ్ల ప్రాయంలో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో డబుల్స్ టైటిల్ నెగ్గాడు. ఈ క్రమంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన పెద్ద వయస్కుడిగా పేస్ చరిత్ర లిఖించాడు.
వేర్వేరు భాగస్వాములతో కలిసి రోహన్ బోపన్న రెండు డబుల్స్ టైటిల్స్‌ను... మహేశ్ భూపతి ఒక టైటిల్‌ను నెగ్గారు. డబుల్స్‌కే పరిమితమైన హైదరాబాద్ స్టార్ సానియా మీర్జాకు ‘గ్రాండ్‌స్లామ్’ విజయం దక్కకపోయినా స్థిరమైన ప్రదర్శనతో ఐదు టైటిల్స్ సాధించింది. బెథానీ మాటెక్ (అమెరికా)తో కలిసి బ్రిస్బేన్ ఓపెన్, దుబాయ్ ఓపెన్‌లో... జెంగ్ జీ (చైనా)తో కలిసి న్యూ హవెన్ ఓపెన్‌లో... కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి టోక్యో ఓపెన్, బీజింగ్ ఓపెన్లలో సానియా డబుల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది.
గురి అదిరింది (ఆర్చరీ)
లండన్ ఒలింపిక్స్‌లో వైఫల్యాన్ని మరిపిస్తూ ఈ ఏడాది భారత ఆర్చర్లు తీపి జ్ఞాపకాలు మిగిల్చారు. దీపిక కుమారి, బొంబేలా దేవి, రిమిల్ బురిలీలతో కూడిన భారత జట్టు పోలండ్, కొలంబియాలలో జరిగిన రెండు ప్రపంచకప్‌లలో స్వర్ణ పతకాలు గెలిచింది.
ఈ క్రమంలో భారత బృందం ఒలింపిక్ చాంపియన్ దక్షిణ కొరియాను, చైనా జట్లను బోల్తా కొట్టించింది. పురుషుల కాంపౌండ్ ఈవెంట్లో భారత జట్టు ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. ఇక మంగోలియాలో జరిగిన ఆసియా గ్రాండ్‌ప్రి టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వై.చరణ్ రెడ్డి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించాడు.
ఉడుంపట్టు (రెజ్లింగ్)
గతేడాది లండన్ ఒలింపిక్స్‌లో స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ విజయాల స్ఫూర్తితో... ఈసారి ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు.
సెప్టెంబరులో హంగేరిలో జరిగిన ఈ మెగా ఈవెంట్లో తొలిసారి భారత రెజ్లర్లు మూడు పతకాలు సాధించారు. ఫ్రీస్టయిల్లో అమిత్ కుమార్ (55 కేజీలు) రజతం నెగ్గగా... బజరంగ్ (60 కేజీలు) కాంస్యం సాధించాడు. గ్రీకో రోమన్ విభాగంలో సందీప్ తులసీ యాదవ్ (66 కేజీలు) కాంస్యం రూపంలో తొలిసారి భారత్‌కు పతకాన్ని అందించాడు. ఈ ‘త్రయం’ ప్రదర్శనతో తొలిసారి భారత్ వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది.
‘పంచ్’ పదును అదుర్స్ (బాక్సింగ్)
మనోళ్లపై అంతర్జాతీయ అమెచ్యూర్ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) సస్పెన్షన్ కొనసాగుతున్నా... ఈ ప్రభావం భారత బాక్సర్లపై పడలేదు.
జూలైలో జోర్డాన్‌లో జరిగిన ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్‌లో శివ థాపా (56 కేజీలు) స్వర్ణం నెగ్గగా... మన్దీప్ జాంగ్రా (69 కేజీ), దేవేంద్రో సింగ్ (49 కేజీ)లకు రజతాలు, మనోజ్ కుమార్ (64 కేజీలు) కాంస్యం లభించాయి. కజకిస్థాన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఐదుగురు భారత బాక్సర్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. సెర్బియా టోర్నీలో ఏపీ బాక్సర్ లలితా ప్రసాద్ (49 కేజీలు) పసిడి పతకం సాధించగా... సెప్టెంబరులో బల్గేరియాలో ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ (54 కేజీలు) రజతం గెల్చుకుంది.
‘రాకెట్’తో రఫ్ ఆడించారు (బ్యాడ్మింటన్)
బ్యాడ్మింటన్ ప్రపంచంలో తెలుగు తేజం పి.వి.సింధు కొత్త రాకెట్లా దూసుకొచ్చింది. మేలో మలేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గిన 18 ఏళ్ల సింధు అదే జోరును కొనసాగించి చైనాలో జరిగిన ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. తద్వారా మహిళల సింగిల్స్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది. కేంద్ర క్రీడాపురస్కారం ‘అర్జున అవార్డు’ పొందిన ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి డిసెంబరులో మకావు గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలోనూ విజేతగా నిలిచింది. దిగ్గజం ప్రకాశ్ పదుకొనే నుంచి బ్యాడ్మింటన్ భవిష్యత్ తారగా ప్రశంసలందుకుంది.
గత ఐదేళ్లుగా భారత బ్యాడ్మింటన్‌కు పర్యాయపదంగా నిలిచిన సైనా నెహ్వాల్‌కు ఈ ఏడాది ఏదీ కలసిరాలేదు. ఆడిన 14 టోర్నమెంట్లలో ఆమె ఒక్కదాంట్లోనూ ఫైనల్‌కు చేరుకోలేదు. పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు కిడాంబి శ్రీకాంత్ ఆశాకిరణంలా ఎదిగాడు. జూన్‌లో థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గిన ఈ గుంటూరు జిల్లా క్రీడాకారుడు ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. 2001లో పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ టైటిల్ సాధించిన తర్వాత శ్రీకాంత్ రూపంలో మరో భారత ప్లేయర్ సీనియర్ స్థాయిలో అంతర్జాతీయ టైటిల్ నెగ్గాడు.
తెలుగు కుర్రాడు సిరిల్ వర్మ ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో అండర్-15 చాంపియన్‌గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా నిలిచాడు. ఐపీఎల్ తరహాలో బ్యాడ్మింటన్‌లో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) ఈ ఏడాది కొత్తగా ప్రారంభమైంది. సైనా నెహ్వాల్ సభ్యురాలిగా ఉన్న ‘పీవీపీ హైదరాబాద్ హాట్‌షాట్స్’ తొలి ఏడాది చాంపియన్‌గా అవతరించింది.
బుల్లెట్ దిగింది (షూటింగ్)
అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భారత మహిళా షూటర్ హీనా సిద్ధూ ప్రపంచకప్ ఫైనల్స్‌లో సంచలనం సృష్టించింది. నవంబరులో జర్మనీలో జరిగిన సీజన్ ముగింపు టోర్నీలో ఈ పంజాబ్ అమ్మాయి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో పసిడి పతకాన్ని నెగ్గింది. పిస్టల్ ఈవెంట్లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ షూటర్‌గా చరిత్ర సృష్టించింది. పతకం నెగ్గే క్రమంలో హీనా ‘డబుల్ ఒలింపిక్ చాంపియన్’ గువో వెన్జున్ (చైనా), ప్రపంచ చాంపియన్ అరునోవిచ్ జొరానా (సెర్బియా), రెండుసార్లు ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన కొస్టెవిచ్ (ఉక్రెయిన్)లను ఓడించింది.
‘లిఫ్ట్’ చేస్తే పతకాలే... (వెయిట్‌లిఫ్టింగ్)
భారత వెయిట్లిఫ్టింగ్కు ఈ ఏడాది కలిసొచ్చింది. ఆంధ్రప్రదేశ్ యువ లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ భవిష్యత్‌పై ఆశలు పెంచాడు. ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో, ఆసియా యూత్ క్రీడల్లో, కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లలో అతను స్వర్ణ పతకాల పంట పండించాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన శిరీషా రెడ్డి, దీక్షిత కూడా కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకాలు అందించారు.