షాంఘై: మరో అంతర్జాతీయ టోర్నీ... మరో వైఫల్యం... భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు ఈ ఏడాది ఏ టోర్నీ కలిసి రావడంలేదు. ఈ సంవత్సరంలో తాను పాల్గొన్న ఏ టోర్నీలోనూ ఫైనల్‌కు చేరుకోలేకపోయిన సైనా... అదే ఆనవాయితీని చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నీలోనూ కొనసాగించి ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆరో సీడ్ సైనా 21-16, 15-21, 17-21తో సున్ యూ (చైనా) చేతిలో ఓడిపోయింది.
సైనాతోపాటు అరుంధతి పంతవానె, పారుపల్లి కశ్యప్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయారు. దాంతో ఈ మెగా టోర్నీలో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. అరుంధతి 13-21, 10-21తో మూడో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూడగా... పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో కశ్యప్ 11-21, 12-21తో కెంటో మొమొటా (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు.
ప్రపంచ 32వ ర్యాంకర్ సున్ యూతో కెరీర్‌లో తొలిసారి ఆడిన సైనా తొలి గేమ్‌ను నెగ్గినా ఆ తర్వాత తడబడింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా నెట్‌వద్ద 40 పాయింట్లు సంపాదించింది. అయితే కీలకదశల్లో అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. రెండో గేమ్‌లోనైతే స్కోరు 5-5 వద్ద సమంగా ఉన్నపుడు ఈ హైదరాబాద్ అమ్మాయి వరుసగా 11 పాయింట్లు ప్రత్యర్థికి సమర్పించుకొని 5-16తో వెనుకబడిపోయింది. ఆ తర్వాత సైనా కోలుకొని వరుసగా ఆరు పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది.
కీలకమైన మూడో గేమ్‌లో సైనా 8-15తో వెనుకబడిన దశలో పుంజుకొని వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి స్కోరును 15-15తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ రెండేసి పాయింట్లు స్కోరు చేశారు. ఈ దశలో సున్ యూ వరుసగా నాలుగు పాయింట్లు సాధించి గేమ్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మొమొటాతో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ అరగంటలో చేతులెత్తేశాడు. మొమొటా స్మాష్‌లతో హడలెత్తించి ఏకంగా 38 పాయింట్లు స్కోరు చేశాడు. సైనా, కశ్యప్ తదితరులు ఈనెల 19 నుంచి 24 వరకు జరిగే హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో బరిలోకి దిగుతారు.
ఖేల్ ఖతం...
Published Thu, Nov 14 2013 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
Advertisement