షాంఘై: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం పరితపిస్తున్న భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆరో సీడ్ సైనా 21-14, 21-19తో నజోమి ఒకుహారా (జపాన్)పై గెలిచింది.
39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా స్మాష్‌ల ద్వారా 11 పాయింట్లు... నెట్‌వద్ద 19 పాయింట్లు సంపాదించింది. తొలి గేమ్‌లో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచిన ఈ హైదరాబాద్ అమ్మాయికి రెండో గేమ్‌లో గట్టి ప్రతిఘటన ఎదురైంది. రెండుసార్లు వెనుకబడ్డప్పటికీ వెంటనే తేరుకున్న సైనా గేమ్‌ను దక్కించుకొని రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. మరోవైపు భారత్‌కే చెందిన అరుంధతి పంతవానె కెరీర్‌లో గొప్ప విజయాన్ని నమోదు చేసింది. తొలి రౌండ్‌లో అరుంధతి 21-14, 21-18తో ప్రపంచ 14వ ర్యాంకర్ ఎరికో హిరోస్ (జపాన్)ను బోల్తా కొట్టించింది.
పురుషుల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన పారుపల్లి కశ్యప్ సంచలనం సృష్టించాడు. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ బూన్‌సక్ పొన్సానా (థాయ్‌లాండ్)తో జరిగిన తొలి రౌండ్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ కశ్యప్ 22-20, 21-15తో నెగ్గాడు. కెరీర్‌లో పొన్సానాపై కశ్యప్‌కిది నాలుగో విజయం కావడం విశేషం. 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్ తొలి గేమ్ చివర్లో 18-20తో వెనుకబడ్డాడు. అయితే అనూహ్యంగా పుంజుకొని వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో మాత్రం ఈ హైదరాబాద్ ప్లేయర్ సంపూర్ణ ఆధిపత్యం కనబరిచాడు.
ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఆనంద్ పవార్ (భారత్) 21-18, 10-21, 11-21తో టకూమా ఉయెదా (జపాన్) చేతిలో; అజయ్ జయరామ్ (భారత్) 18-21, 19-21తో వాన్ హో సన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయారు. డబుల్స్ తొలి రౌండ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) ద్వయం 14-21, 6-21తో వ్లాదిమిర్ ఇవనోవ్-ఇవాన్ సొజోనోవ్ (రష్యా) జంట చేతిలో ఓటమి చవిచూసింది. గురువారం జరిగే రెండో రౌండ్‌లో సున్ యు (చైనా)తో సైనా; యిహాన్ వాంగ్ (చైనా)తో అరుంధతి; కెంటో మొమొటా (జపాన్)తో కశ్యప్ పోటీపడతారు.
సైనా శుభారంభం
Published Thu, Nov 14 2013 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM