కాంస్యాలతో సరి | PV Sindhu loses, settles for bronze | Sakshi
Sakshi News home page

కాంస్యాలతో సరి

Published Sun, Apr 27 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 6:33 AM

కాంస్యాలతో సరి

కాంస్యాలతో సరి

సెమీస్‌లో ఓడిన సింధు   
 జ్వాల-అశ్విని జోడీకి నిరాశ
 ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
 
 గిమ్‌చియోన్ (కొరియా): భారత రైజింగ్ స్టార్ పి.వి.సింధు, జ్వాల-అశ్విని జోడి... ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 21-15, 20-22, 12-21తో టాప్‌సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓటమిపాలైంది. గంటా 18 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ ఆరంభంలో హైదరాబాద్ అమ్మాయి అద్భుతంగా ఆడింది. అటాకింగ్‌తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ అదే జోరు కనబరిచింది. 20-18తో రెండు మ్యాచ్ పాయింట్లను సంపాదించింది. అయితే కీలకదశలో ఒత్తిడికిలోనైన సింధు వరుసగా రెండు పాయింట్లను కోల్పోవడంతో స్కోరు 20-20 వద్ద సమమైంది. ఆ తర్వాత షిజియాన్ మరో రెండు పాయింట్లు నెగ్గి రెండో గేమ్‌ను 22-20తో నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది.
 
 ఓటమి అంచుల్లోంచి బయటపడిన షిజియాన్ మూడో గేమ్‌లో విజృంభించడంతో సింధు చేతులెత్తేసింది. మహిళల డబుల్స్ సెమీస్‌లో జ్వాల-అశ్విని 12-21, 7-21తో లూ యింగ్-లూ యూ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు. తొలి గేమ్ ఆరంభంలో నెట్ వద్ద జ్వాలా జోడి కొన్ని పాయింట్లు చేజార్చుకోవడం దెబ్బతీసింది. బ్యాక్ కోర్టులో అశ్విని అద్భుతంగా ఆడటంతో 3-3తో స్కోరు సమమైంది. కానీ చిన్న చిన్న తప్పిదాలతో 6-11, 6-15, 11-20తో వెనుకబడి గేమ్‌ను కోల్పోయారు.  షాట్లలో భిన్నత్వాన్ని రాబట్టేందుకు ప్రయత్నించిన జ్వాల ద్వయం రెండో గేమ్‌లో సుదీర్ఘ ర్యాలీలు ఆడింది.
 
  కానీ చైనా జోడి మెరుగైన డిఫెన్స్‌తో 11-2 ఆధిక్యంలో నిలిచింది. అయితే సర్వీస్ తప్పిదాలతో భారత్‌కు కొన్ని పాయింట్లు సమర్పించుకున్నా విజయానికి సరిపోలేదు. 20-6 స్కోరుతో వద్ద జ్వాల-అశ్విని మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకున్నా.. తర్వాత సర్వీస్ కోల్పోయారు. ఆసియా బ్యాడ్మింటన్‌లో సెమీస్‌కు చేరితే కాంస్యం వస్తుంది. కాబట్టి అటు సింధు, ఇటు జ్వాల జోడిలకు కాంస్యాలు దక్కుతాయి.
 
 ‘ఓవరాల్‌గా సింధు బాగా ఆడింది. రెండో గేమ్‌లో 20-18తో ముందంజలో ఉన్న దశలో సింధు రెండు పాయింట్లను కోల్పోయింది. ఈ తరహా మ్యాచ్‌ల్లో కాస్త అదృష్టం కూడా కలసిరావాలి. ఒకరోజు మనం గెలుస్తాం. మరోరోజు ఓడిపోతాం. మొత్తానికి సింధు ఆటతీరుతో సంతృప్తిగా ఉన్నాను.’   
 - పుల్లెల గోపీచంద్, చీఫ్ కోచ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement