ఇద్దరు బ్యాడ్మింటన్ రాణుల తొలి సమరం | Sakshi Sports 16th Aug 2013 | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 16 2013 7:45 AM | Last Updated on Thu, Mar 21 2024 8:40 PM

ఏడాది కాలంగా చెప్పుకోదగ్గ విజయాలు లేని సైనా నెహ్వాల్ ఒక వైపు...ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గి కొత్త ఉత్సాహంతో ఉన్న పీవీ సింధు మరో వైపు...భారత బ్యాడ్మింటన్‌కు చిరునామాగా మారిన వీరిద్దరి మధ్య పోరు ఐబీఎల్‌లో మొదటినుంచి ఆసక్తి రేపింది. చివరకు స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఆ ఘడియ వచ్చింది. అయితే ఒలింపిక్ పతక విజేత అంతర్జాతీయ అనుభవం ముందు.... సింధు ‘బిందు’వుగా మారింది. తొలి గేమ్‌లో గట్టి పోటీ ఇచ్చిన సింధు, రెండో గేమ్‌లో పూర్తిగా తలవంచింది. ఫలితంగా హాట్ షాట్ సైనా 21-19, 21-8తో అవధ్ అమ్మాయి సింధుపై ఘన విజయం సాధించింది. హోరాహోరీ... తొలి గేమ్‌లో రెండు పాయింట్లు గెలిచిన సైనా ముందుగా 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే క్రాస్ కోర్ట్ స్మాష్‌లతో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గిన సింధు 4-2తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఒక్కో పాయింట్ కోసం ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. చక్కటి ప్లేసింగ్‌తో సింధు పాయింట్లు రాబట్టి ముందుకు దూసుకెళితే, స్మాష్‌లతో సైనా స్కోరును సమం చేస్తూ వచ్చింది. సింధు 15-12తో ముందంజలో ఉన్న దశలో గేమ్ మలుపు తిరిగింది. ఒక్కసారిగా విజృంభించిన సైనా వరుసగా ఐదు పాయింట్లు తన ఖాతాలో వేసుకొని 17-15తో ఆధిక్యం అందుకుంది. ఆ తర్వాత సింధు 2 పాయింట్లు...సైనాకు 2...ఇలా ఇద్దరూ పోటీ పడ్డారు. గేమ్ పాయింట్ వద్ద సింధు ఒక పాయింట్ కాచుకున్నా, స్మాష్‌తో సైనా గేమ్ ముగించింది. ఏకపక్షం... రెండో గేమ్‌లో మాత్రం సైనా జోరును ఏ దశలోనూ సింధు అడ్డుకోలేకపోయింది. ఆరంభంనుంచి దూకుడు ప్రదర్శించిన సైనా వరుసగా 4 పాయింట్లు గెల్చుకొని 6-3 ఆధిక్యంలోకి వెళ్లింది. నెహ్వాల్ ఒక వైపు వరుస పాయింట్లతో దూసుకుపోతుంటే సింధు కోలుకోలేకపోయింది. 9-5, 13-6, 17-7...ఇలా సైనా చెలరేగింది. 17-8 వద్ద మళ్లీ నాలుగు పాయింట్లు సాధించి సైనా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ‘అకాడమీలో నేను, సింధు కలిసి ఆడుతూనే ఉంటాం. అయితే ఈ మ్యాచ్‌కు మీడియా అతిగా ప్రచారం కల్పించడం, తీవ్రంగా చర్చ జరగడంతో నాపై ఒత్తిడి పెరిగింది. దాంతో ఆరంభంలో ఇబ్బంది పడ్డాను. సింధు బాగా ఆడింది. అయితే ప్రత్యర్థి ఎవరైనా... ఆటను బట్టి వ్యూహాలు మార్చుకోవడమే తప్ప ప్రత్యేక ప్రణాళిక ఏమీ లేదు. నా సహజసిద్ధమైన శైలిలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాను. ఈ రోజు ఇద్దరం మెరుగ్గా ఆడినా మ్యాచ్ గెలవడం నా అదృష్టం’ - సైనా నెహ్వాల్ ప్రేక్షకుల్లో ప్రముఖులు... సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఇద్దరు భారత అగ్రశ్రేణి క్రీడాకారుల మధ్య పోరును తిలకించేందుకు స్వాతంత్య్ర దినోత్సవ వేళ ప్రముఖులతో స్టేడియం నిండిపోయింది. తన అలవాటుకు భిన్నంగా టీ షర్ట్, ట్రౌజర్‌లో వచ్చిన కేంద్ర ఆర్ధిక మంత్రి పి.చిదంబరం సతీ సమేతంగా మొత్తం మ్యాచ్‌ను వీక్షించారు. ఒలింపిక్స్ రజత విజేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌తో పాటు హీరో నాగార్జున తదితరులు మ్యాచ్ తిలకించారు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన సింధును మ్యాచ్‌కు ముందు చిదంబరం సన్మానించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement