గతంలో తనకెంతో కలిసొచ్చిన జకార్తా నగరంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మరోసారి జూలు విదిల్చింది. ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఊరిస్తున్న ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాన్ని దక్కించుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సైనా నెహ్వాల్ 21-15, 19-21, 21-19తో ఆరో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)పై గెలిచి సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు వరుసగా మూడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాన్ని నెగ్గాలని ఆశించిన పీవీ సింధు... రెండోసారి ఈ ఘనత సాధించాలనుకున్న గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జంటకు నిరాశ ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో సింధు 17-21, 21-19, 16-21తో ఎనిమిదో సీడ్ సుంగ్ జీ హున్ చేతిలో పరాజయం పాలవ్వగా... జ్వాల-అశ్విని జంట 23-25, 14-21తో ఫుకుమాన్-కురుమి యోనావో (జపాన్) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది.