Badminton star
-
ప్రపంచ చాంపియన్‌షిప్‌పై కసరత్తు
న్యూఢిల్లీ: జపాన్‌లాంటి కోర్టుల్లో ఆడాలంటే చాలా ఓపిక కావాలని భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ అన్నాడు. త్వరలో అక్కడ జరగనున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం కసరత్తు చేస్తున్నానని చెప్పాడు. ‘నేను రెండు వారాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎప్పట్లా రొటిన్‌గానే సన్నద్ధమవుతున్నా. నా ప్రాక్టీస్‌లో తేడా ఏమీ లేదు. కానీ టోక్యోలోని బ్యాడ్మింటన్ కోర్టులు మందకొడిగా ఉంటాయి. అక్కడ ఆడాలంటే నేర్పుంటే చాలదు. చాలా ఓర్పు కావాలి. అందుకే నేను ఆటతీరులో సహనం, సంయమనంపై దృష్టిపెట్టాను’ అని అన్నాడు. ఈ నెల 22 నుంచి టోక్యోలో ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలు జరుగనున్నాయి. స్పెయిన్‌లో జరిగిన గత మెగా ఈవెంట్లో ప్రణయ్ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. ఈ సీజన్లో నిలకడగా ఆడుతున్న అతను ర్యాంకు మెరుగుపర్చుకునే పనిలో పడ్డాడు. ‘ర్యాంకుల్లో ఎగబాకడం ఇప్పుడు అంత సులభం కాదు. ఒక్క రేటింగ్ పాయింట్ కూడా కీలకమే. నేను మళ్లీ టాప్–20 ర్యాంకుల్లోకి రావాలంటే ఒక్కో టోర్నీలో నిలకడగా క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్ చేరుతుండాలి. అప్పుడు అనుకున్న ర్యాంకుకు చేరుకోగలం’ అని అన్నాడు. ఒకానొక దశలో చక్కని ఆటతీరుతో ప్రపంచ ఎనిమిదో ర్యాంకుకు ఎగబాకిన ప్రణయ్‌ని 2020 నవంబర్‌లో కోవిడ్ దెబ్బతీసింది. మహమ్మారి అతని ప్రదర్శనపై పెను ప్రభావమే చూపింది. ఆ తర్వాత ‘గో స్పోర్ట్స్ ఫౌండేషన్’ సహకారంతో ఆరోగ్యాన్ని, తర్వాత ఫిట్నెస్ను మెల్లిగా ఆటతీరును మెరుగుపర్చుకున్నాడు. ఈ సీజన్లో ఇండోనేసియా, మలేసియా ఓపెన్లలో సెమీస్ చేరిన ప్రణయ్ స్విస్ ఓపెన్‌లో రన్నరప్‌తో తృప్తి చెందాడు. థామస్ కప్ విజయంతో ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు. అయితే పెద్ద పెద్ద ఎండార్స్మెంట్లు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులుంటున్నాయని, మేజర్ టోర్నీల్లో గెలిస్తేనే బ్రాండింగ్ దక్కుతుందని చెప్పాడు. -
జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభం
మొయినాబాద్ (చేవెళ్ల): తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 110 స్టేడియాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని నాగిరెడ్డిగూడ రెవెన్యూలో ఉన్న సుజాత స్కూల్ ఆవరణలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఏర్పాటు చేసిన గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఆయన సోమవారం సాయంత్రం క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు, దేశానికి ఆదర్శంగా ఉండే నూతన స్పోర్ట్స్ పాలసీని ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. స్టార్ షట్లర్ జ్వాల అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో జ్వాల అకాడమీతో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ కలిసి పనిచేస్తుందన్నారు.లీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అనితా రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మొయినాబాద్ ఎంపీపీ నక్షత్రం జయవంత్, జెడ్పీటీసీ కాలె శ్రీకాంత్ పాల్గొన్నారు. సిద్ధమైన కోర్టులు -
‘చాంపియన్’ విషాదం
భారత బ్యాడ్మింటన్ స్టార్ సయ్యద్ మోదీ ఎప్పటిలాగే ఆ రోజు సాయంత్రం కూడా ప్రాక్టీస్ ముగించుకొని లక్నోలోని కేడీ సింగ్ బాబు స్టేడియం నుంచి బయటకు వచ్చాడు. 26 ఏళ్ల వయసులో తన కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్న అతను మరిన్ని విజయాలు సాధించాలని పట్టుదలగా సాధన చేస్తున్నాడు. అయితే అతనికి తెలీదు... మరికొన్ని క్షణాల్లో తన ఆటే కాదు జీవితం కూడా ముగిసిపోతుందని! అనూహ్యంగా కారులోంచి దిగి దూసుకొచ్చిన నలుగురు వ్యక్తులు తుపాకులతో సయ్యద్ మోదీపై విరుచుకుపడటంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు. ఒక అద్భుత క్రీడాకారుడి జీవితం ఇలా విషాదాంతం కాగా... తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఈ హత్య వెనుక ఉన్నట్లు ఆరోపణలు రావడం మరో వైచిత్రి. 28 జూలై, 1988... సయ్యద్ మోదీ హత్య జరిగిన రోజు. తిరుగులేని ఆటతో అతను అప్పటికే వరుసగా ఎనిమిదిసార్లు (1980–1987) జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌గా నిలిచాడు. 1982 బ్రిస్బేన్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, అదే ఏడాది ఢిల్లీ ఆసియా క్రీడల్లో కాంస్యం అతని ఖాతాలో ఉన్నాయి. ఆ సమయంలో ఎంతో గుర్తింపు ఉన్న ఆస్ట్రియన్ ఇంటర్నేషనల్, యూఎస్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ టైటిల్స్ కూడా మోదీ గెలుచుకున్నాడు. 1981లో ‘అర్జున అవార్డు’ కూడా దక్కింది. 14 ఏళ్ల వయసులో జాతీయ జూనియర్ చాంపియన్‌గా మారినప్పటి నుంచి చనిపోయే వరకు మోదీ షటిల్ ప్రస్థానం అద్భుతంగా సాగింది. ప్రకాశ్ పదుకొనే తర్వాత భారత్ నుంచి వచ్చిన మరో స్టార్‌గా అతను పేరు ప్రఖ్యాతులు పొందాడు. 1962లో డిసెంబర్ 31న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో సయ్యద్ మోదీ జన్మించాడు. పేదరిక నేపథ్యం (తండ్రి చక్కెర మిల్లులో పని చేసేవాడు) నుంచి వచ్చి కేవలం తన ప్రతిభతో దూసుకుపోయి కుటుంబంలో సంతోషం పంచాడు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఆమె రాకతో... జూనియర్ స్థాయిలో ఆడేటప్పుడే సహచర షట్లర్ అమితా కులకర్ణితో మోదీకి పరిచయం ఏర్పడింది. కొన్నేళ్ల తర్వాత అది ప్రేమగా మారింది. మహారాష్ట్ర హిందూ అయిన అమితా పెద్ద చదువులు చదివిన ఉన్నతస్థాయి కుటుంబం నుంచి వచ్చింది. ఇద్దరి నేపథ్యాలు పూర్తి భిన్నంగా ఉండటంతో సహజంగానే ఇరు కుటుంబాలు పెళ్లికి నిరాకరించాయి. దాంతో వీరిద్దరు పెద్దలను ఎదిరించి ముందడుగు వేసి 1984లో పెళ్లి చేసుకున్నారు. అయితే చాలా మంది భయపడినట్లుగానే పలు కారణాలతో వివాహం తర్వాత భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఒకే ప్రొఫెషన్‌కు చెందిన వారు కావడంతో అహం కూడా తోడైంది. ఆ ప్రభావం తనపై పడి మానసికంగా ఇబ్బంది పడ్డ మోదీ 1988లో జాతీయ చాంపియన్‌షిప్‌ను కోల్పోయాడు. చివరకు పాప ‘ఆకాంక్ష’ పుట్టిన కొద్ది రోజులకే చిన్న వయసులోనే అతని జీవితం ముగిసిపోయింది. మోదీ పేరు వెనక... సయ్యద్ మోదీ అసలు పేరు సయ్యద్ మెహదీ హసన్ జైదీ. స్కూల్ రికార్డుల్లో పేరు నమోదు చేస్తున్న సమయంలో మెహదీ పేరును ‘మోదీ’ అని తప్పుగా రాయడంతో అదే కొనసాగింది. అతను కూడా దానిని మార్చుకునే ప్రయత్నం చేయలేదు. మోదీ ఘనతలను గుర్తించే విధంగా భారత బ్యాడ్మింటన్ సంఘం సయ్యద్ మోదీ పేరుతో లక్నోలో ప్రతి ఏటా టోర్నీని నిర్వహిస్తోంది. మోదీ హత్యోదంతం నేపథ్యంతో 1991లో ప్రముఖ హిందీ నటుడు దేవానంద్ నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించి ‘సౌ కరోడ్’ పేరుతో సినిమాను నిర్మించారు. అతడే కారణమా? సయ్యద్ మోదీ మొత్తం వ్యవహారంలో ‘మూడో వ్యక్తి’ ప్రమేయంపైనే అందరి దృష్టీ పడింది. అతి సంపన్నుడైన రాజకీయ నేత, అప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ క్రీడల మంత్రి సంజయ్ సింగ్‌తో అమితా స్నేహమే మోదీ ముగింపునకు కారణమైందని అంతటా వినిపించింది. భర్త వారిస్తున్నా సంజయ్‌తో ఆమె తన బంధాన్ని కొనసాగించింది. తన మాట వినకుండా బిడ్డకు హిందూ పేరు పెట్టడంతో మోదీ అనుమానం మరింత పెరిగింది. హత్య అనంతరం జరిగిన సీబీఐ విచారణలో వీటికి సంబంధించి పలు అంశాలు బయట పడ్డాయి. సంజయ్, అమితాలతో పాటు మరో ఐదుగురి పేర్లతో చార్జ్ షీట్ తయారైంది. అయితే వీరిద్దరు కలిసి హత్యకు కుట్ర పన్నారని మాత్రం ఎలాంటి సాక్ష్యాల ద్వారా కూడా నిరూపితం కాలేదు. నాటి ప్రధానులు రాజీవ్‌గాంధీకి, వీపీ సింగ్‌లకు ఆత్మీయ స్నేహితుడు, అమేథీకి చెందిన సంజయ్ సింగ్‌కు ఆ సాన్నిహిత్యం కూడా ఇలాంటి సమయంలో కలిసొచ్చిందని చెబుతారు. కేసు నుంచి తమ పేర్లు తప్పించిన కొద్ది రోజులకే 1995లో సంజయ్ తన మొదటి భార్య, మాజీ ప్రధాని వీపీ సింగ్ మేనకోడలు గరీమా సింగ్‌ను వదిలేసి అమితాను పెళ్లి చేసుకున్నాడు. చివరకు కాల్పులు జరిపిన వారిలో ఒకరికి మాత్రం జైలు శిక్ష విధించిన కోర్టు ‘హత్య వెనుక కారణం ఏమిటో తేల్చలేకపోయారు’ అంటూ ఈ కేసును 2009లో మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సయ్యద్ మోదీ జీవిత క్రమాన్ని చూస్తూ వచ్చిన సన్నిహితులు, అభిమానుల దృష్టిలో అతని చావుకు అమితా, సంజయ్‌లే కారణమని నమ్మినా... అధికారికంగా అది రుజువు కాలేదు. తర్వాతి కాలంలో సంజయ్ సింగ్ వివిధ పార్టీలు మారుతూ లోక్‌సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. మరోవైపు అమితా అమేథీ నియోజకవర్గం నుంచి 2002లో బీజేపీ తరఫున... 2007లో కాంగ్రెస్ తరఫున శాసనసభ్యురాలిగా ఎన్నికైంది. కానీ ఒక గొప్ప ఆటగాడు, మంచి వ్యక్తి జీవితం మాత్రం ఇంత విషాదంగా ముగిసిపోవడం అందరినీ కలచి వేసింది. -
చైనా ఓపెన్ చాంప్స్ కరోలినా మారిన్, మొమోటా
షాంఘై: స్పెయిన్ బ్యాడ్మింటన్ స్టార్ కరోలినా మారిన్ పునరాగమనంలో బరిలోకి దిగిన రెండో టోర్నమెంట్‌లోనే టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోరీ్నలో మారిన్ విజేతగా నిలిచింది. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన మారిన్ 65 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో 14–21, 21–17, 21–18తో రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. ‘నమ్మశక్యంగా లేదు. గాయం నుంచి కోలుకుంటున్న క్రమంలో బరిలోకి దిగే రెండో టోరీ్నలోనే విజేతగా నిలుస్తానని ఊహించలేదు. ఈ ప్రదర్శనతో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను’ అని రియో ఒలింపిక్స్ చాంపియన్ అయిన మారిన్ వ్యాఖ్యానించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, విశ్వవిజేత కెంటో మొమోటా టైటిల్ దక్కించుకున్నాడు. 90 నిమిషాలపాటు జరిగిన మారథాన్ ఫైనల్లో మొమోటా 19–21, 21–17, 21–19తో ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా)పై అద్భుత విజయం సాధించాడు. విజేతగా నిలిచిన మారిన్, మొమోటాలకు 70 వేల డాలర్ల (రూ. 49 లక్షల 75 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. -
సింధు సంపాదన రూ.39 కోట్లు
న్యూయార్క్: తెలుగుతేజం, బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు ప్రపంచ సంపన్న మహిళా క్రీడాకారిణుల జాబితాలో 13వ స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో భారత్ నుంచి ఆమె ఒక్కరికే చోటు దక్కడం విశేషం. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం ఆమె గతేడాది సంపాదన రూ. 39 కోట్లు (5.5 మిలియన్ డాలర్లు)గా తేల్చింది. ‘సింధు విలువైన మార్కెట్ కలిగిన భారత మహిళా అథ్లెట్‌గా కొనసాగుతోంది. ఆమె గతేడాది సీజన్ ముగింపు టోర్నీ అయిన ‘బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్’లో విజేతగా నిలువడంతో ఆమె బ్రాండింగ్‌కు ఢోకా లేకపోయింది’ అని ఫోర్బ్స్ తెలిపింది. ఈ ఆదాయంలో ప్రైజ్‌మనీ, కాంట్రాక్టు ఫీజులు, బోనస్, ఎండార్స్మెంట్లు, అప్పియరెన్స్ ఫీజులు అన్ని కలిసి ఉన్నాయని ఆ సంస్థ వెల్లడించింది. అత్యధికంగా ఆర్జించే మహిళా అథ్లెట్ల టాప్–15 జాబితాలో భారత్ నుంచి మరే క్రీడాకారిణి కూడా ఆమె సమీప దూరంలో లేదు. ఈ లిస్ట్‌లో అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ 29.2 మిలియన్ డాలర్ల (రూ. 207 కోట్లు)తో అగ్రస్థానంలో ఉంది. -
బ్యాడ్మింటన్ స్టార్స్
బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ సందడి చేసింది. కొండాపూర్లోనిఓ మాల్లో ఆమె భర్త కశ్యప్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొంది.సెల్ఫీలు దిగుతూ అభిమానులను అలరించింది. గచ్చిబౌలి: కొండాపూర్‌లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ఏర్పాటు చేసిన కైరా స్టోర్‌ను బ్యాడ్మింటన్ స్టార్స్, దంపతులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడల్స్‌తో కలిసి న్యూ కలెక్షన్స్‌ను ప్రదర్శించారు. త్వరలో మలేసియాలో జరగనున్న నేషనల్ టోర్నమెంట్ సిద్ధమవుతున్నానని సైనా చెప్పారు. దేశవ్యాప్తంగా 111 స్టోర్లు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కైరా డైరెక్టర్లు దినేశ్ మంగ్లాని, కరిష్మా మంగ్లానిపాల్గొన్నారు. -
సింధు కోచ్‌గా సోనూ
‘‘బ్యాడ్మింటన్‌లో సిల్వర్ మెడల్ సాధించి భారతీయులకు గర్వకారణంగా నిలిచారు పీవీ సింధు. ఆమె జీవితం ఆధారంగా బయోపిక్ రూపొందిస్తున్నాను. దానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా మొదలయ్యాయి’’ అని ఆ మధ్య పేర్కొన్నారు నటుడు సోనూ సూద్. తాజాగా ఈ బయోపిక్‌లో తాను కోచ్‌గా కనిపిస్తానని ప్రకటించారాయన. మరి ఈ చిత్రంలో సింధు పాత్రను ఎవరు చేస్తారనేది చెప్పలేదు. బహుశా ఆ పాత్రకు తగ్గ నటిని అన్వేషించే పనిలో ఉన్నట్లున్నారు. ఓ చిన్నారి తాను కన్న కలని ఏ విధంగా కష్టపడి సాధించుకుంది అని సింధు బ్యాలం నుంచి కథను చెప్పబోతున్నారట. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. -
మూడో ర్యాంకులో శ్రీకాంత్
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ మూడో ర్యాంకుకు ఎగబాకాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) గురువారం విడుదల చేసిన సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 3వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇటీవల టాప్ ర్యాంకులో నిలిచిన ఈ ఆంధ్రప్రదేశ్ ఆటగాడు వారం వ్యవధిలోనే ఐదో ర్యాంకుకు పడిపోయాడు. మరో భారత ఆటగాడు హెచ్.ఎస్.ప్రణయ్ కూడా రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో ర్యాంకులో నిలిచాడు. ఈ జాబితాలో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్), సన్ వాన్ హో (కొరియా) తొలి రెండు ర్యాంకుల్లో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు నిలకడగా మూడో ర్యాంకులోనే కొనసాగుతోంది. కామన్వెల్త్ ఫైనల్లో సింధును ఓడించి స్వర్ణం గెలిచిన హైదరాబాదీ స్టార్ సైనా నెహ్వాల్ రెండు స్థానాల్ని మెరుగుపర్చుకొని పదో ర్యాంకుకు చేరుకుంది. ఈ ర్యాంకింగ్స్‌లో తై జు యింగ్ (చైనీస్ తైపీ), యామగుచి (జపాన్) టాప్–2 ర్యాంకుల్లో ఉన్నారు. -
సెమీస్‌లో కశ్యప్
జెజు (కొరియా): గాయం నుంచి కోలుకున్నాక ఆడుతోన్న ఏడో టోర్నమెంట్లో ఎట్టకేలకు భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించాడు. కొరియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో ఈ హైదరాబాద్ ఆటగాడు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కశ్యప్ 18-21, 21-8, 21-16తో ఆరో సీడ్ జెయోన్ హైక్ జిన్ (కొరియా)పై విజయం సాధించాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్, టాప్ సీడ్ సన్ వాన్ హో (కొరియా)తో కశ్యప్ తలపడతాడు. -
సైనా సాధించేనా!
ఒడెన్స్ (డెన్మార్క్): ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మరో టైటిల్ లక్ష్యంగా డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో బరిలోకి దిగుతోంది. మంగళవారం మొదలయ్యే ఈ మెగా టోర్నీలో సైనాకు టాప్ సీడింగ్ లభించింది. తొలి రోజు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. తొలి రౌండ్లో సైనా థాయ్‌లాండ్‌కు చెందిన ప్రపంచ 17వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్బుమ్రంగ్ఫన్తో ఆడుతుంది. 2012లో డెన్మార్క్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన సైనా ఈ సీజన్లో ఇండియా ఓపెన్, సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీల్లో టైటిల్స్ నెగ్గడంతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో తొలిసారి రజత పతకాలు సాధించి జోరు మీదుంది. సైనాతోపాటు భారత్‌కే చెందిన మరో స్టార్ ప్లేయర్ పీవీ సింధు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. బుధవారం జరిగే తొలి రౌండ్లో మరియా ఫెబె కుసుమస్తుతి (ఇండోనేసియా)తో సింధు ఆడుతుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, ప్రణయ్, అజయ్ జయరామ్ పోటీపడనున్నారు. శ్రీకాంత్, జయరామ్ ప్రత్యర్థులెవరూ ఇంకా ఖరారు కాలేదు. కశ్యప్ మాత్రం తొలి రౌండ్లో మలేసియా స్టార్ లీ చోంగ్ వీతో, సు జెన్ హావో (చైనీస్ తైపీ)తో ప్రణయ్ ఆడనున్నారు. -
జకార్తాలో జైహింద్
-
జకార్తాలో జైహింద్
భారత స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందే జకార్తాలో మువ్వన్నెలు రెపరెపలాడాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ వేదికపై సైనా నెహ్వాల్ మరోసారి చైనా గోడను బద్దలు కొట్టింది. కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించినా ఇన్నాళ్లూ అందని ద్రాక్షలా ఊరిస్తున్న ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాన్ని సైనా ఖరారు చేసుకుంది. ఏకంగా ఐదుసార్లు ఈ మెగా టోర్నీ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయిన ఈ హైదరాబాదీ... ఆరో ప్రయత్నంలో అద్భుతం చేసింది. యిహాన్ వాంగ్‌పై విజయంతో తొలిసారి ఈ మెగాటోర్నీలో సెమీస్‌కు చేరింది. ఇక ఓడినా కాంస్యం ఖాయం. గెలిస్తే మెరుగైన పతకం... ఏదైనా సైనా కెరీర్ పరిపూర్ణమైనట్లే. - ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సైనాకు పతకం - క్వార్టర్స్‌లో యిహాన్పై అద్భుత విజయం - సింధు, జ్వాల-అశ్వినిలకు నిరాశ జకార్తా: గతంలో తనకెంతో కలిసొచ్చిన జకార్తా నగరంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మరోసారి జూలు విదిల్చింది. ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఊరిస్తున్న ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాన్ని దక్కించుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సైనా నెహ్వాల్ 21-15, 19-21, 21-19తో ఆరో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)పై గెలిచి సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు వరుసగా మూడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాన్ని నెగ్గాలని ఆశించిన పీవీ సింధు... రెండోసారి ఈ ఘనత సాధించాలనుకున్న గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జంటకు నిరాశ ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో సింధు 17-21, 21-19, 16-21తో ఎనిమిదో సీడ్ సుంగ్ జీ హున్ చేతిలో పరాజయం పాలవ్వగా... జ్వాల-అశ్విని జంట 23-25, 14-21తో ఫుకుమాన్-కురుమి యోనావో (జపాన్) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. ఆద్యంతం హోరాహోరీ గతంలో తొమ్మిదిసార్లు యిహాన్ వాంగ్ చేతిలో ఓడి, కేవలం రెండుసార్లు నెగ్గిన సైనాకు ఈసారీ తీవ్ర ప్రతిఘటనే ఎదురైంది. అయితే కీలకదశలో సైనా దూకుడుగా ఆడి నిర్ణాయక పాయింట్లను సంపాదించింది. సుదీర్ఘ ర్యాలీల్లో కొన్నిసార్లు సైనా, మరికొన్నిసార్లు యిహాన్ పైచేయి సాధించింది. నిర్ణాయక మూడో గేమ్ చివరి దశలో సైనా కళ్లు చెదిరే స్మాష్‌ల ధాటికి యిహాన్ అనవసర తప్పిదాలు చేసింది. స్కోరు 20-19 వద్ద సైనా కొట్టిన స్మాష్‌కు రిటర్న్ ఇవ్వలేకపోయిన యిహాన్ షటిల్‌ను కోర్టు పక్కకు కొట్టింది. దాంతో సైనా విజయం ఖాయమైంది. తొలిసారి ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్‌కు చేరిన ఆనందంలో సైనా తన రాకెట్‌ను గాల్లోకి విసిరేసి సంబరం చేసుకుంది. - గతంలో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన సైనా నాలుగుసార్లు చైనా క్రీడాకారిణుల (2009లో లిన్ వాంగ్; 2010లో షిజియాన్ వాంగ్; 2011లో జిన్ వాంగ్; 2014లో లీ జురుయ్) చేతిలో, మరోసారి కొరియా ప్లేయర్ (2013లో బే యోన్ జు) చేతిలో ఓడిపోయింది. - జకార్తాలోనే జరిగే ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో సైనా మూడుసార్లు (2009, 2010, 2012) టైటిల్ సాధించి, మరోసారి రన్నరప్‌గా (2011లో) నిలిచింది. శనివారం జరిగే సెమీఫైనల్లో అన్‌సీడెడ్, ప్రపంచ 29వ ర్యాంకర్ లిందావెని ఫనెత్రి (ఇండోనేసియా)తో సైనా తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సైనా 2-1తో ఫనెత్రిపై ఆధిక్యంలో ఉంది. మరో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా) ఆడుతుంది. మధ్యాహ్నం గం. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
ఫైనల్ మ్యాచ్ చూస్తున్నంత సేపూ ఒకటే టెన్షన్
ములపర్రు (ఆచంట) : ‘నవంబరు 16ను ఎప్పటికీ మరిచిపోలేం.. మా చిన్నోడు (కిడాంబి శ్రీకాంత్) ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన రోజు అది.. ఆ రోజు రాత్రి ఫైనల్ మ్యాచ్ చూస్తున్నంత సేపు ఒకటే టెన్షన్.. ప్రత్యర్థి సామాన్యుడు కాదు మరి.. చైనా దిగ్గజం లీన్డాన్.. అప్పటికే రెండు సార్లు మా చిన్నోడు అతని చేతిలో ఓడిపోయాడు.. మూడోసారి తలపడుతున్నాడు.. పోరు హోరాహోరీగా సాగుతోంది.. మా చిన్నోడి ఆట చూసి గెలుస్తాడనుకున్నాం.. దేవుడిపైనే భారం వేశాం.. చివరకు ఎవరూ ఊహించని విధంగా శ్రీకాంత్ చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు’ అని కిడాంబి శ్రీకాంత్ తాతయ్య, అమ్మమ్మలు కొంమాండూరి స్వామినాథ న్, శేషవల్లి ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకాంత్ తల్లి రాధా ముకుంద నాగమణి స్వగ్రామం పెనుగొండ మండలం ములపర్రు గ్రామం. బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన శ్రీకాంత్ గురించి తెలుసుకునేందుకు ఆనందడోలికల్లో మునిగితేలుతున్న తాతయ్య, అమ్మమ్మలతో ఇంటర్వ్యూ. మీ మనవడు శ్రీకాంత్ విజయంపై మీ స్పందన చాలా సంతోషంగా ఉంది. ఆటల ద్వారా మా మనవడు పేరు ప్రపంచ దేశాల్లో మారుమోగుతుండటం చాలా హ్యాపీ. కష్టానికి తగిన ఫలితమిది. మీరెప్పుడైనా మీ మనవడు ఈ స్థాయికి వెళతాడని ఊహించారా వాడు చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్‌లో ప్రతిభ చూపేవాడు. ఎప్పటికైనా మంచిపేరు తెచ్చుకుంటాడనే నమ్మకం మాకుంది. మీ పెద్దమనవడు కూడా ఇదే రంగంలో ఉన్నారంట కదా అవును పెద్ద మనుమడు నందగోపాల్, చిన్న మనుమడు శ్రీకాంత్. ఇద్దరు బ్యాడ్మింటన్ ప్లేయర్లే. శ్రీకాంత్ బ్యాడ్మింటన్‌లో రాణించడానికి ప్రోత్సాహకులు ఎవరు మా అల్లుడు (శ్రీకాంత్ తండ్రి)కి కూడా ఆటలంటే ఇష్టం. దేవుని దయవ ల్ల వారి ఆర్థిక పరిస్థితి బాగుండటంతో పిల్లలను ప్రోత్సహించారు. శ్రీకాంత్ ఈ స్థాయికి వెళ్లాడంటే ఆయనే కారణం. శ్రీకాంత్ ఎక్కడ శిక్షణ తీసుకున్నాడు విశాఖ, ఖమ్మంలో కొద్దికాలం శిక్షణ పొందాడు. తర్వాత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ అకాడమీలో ప్రత్యేక ట్రైనింగ్ తీసుకున్నాడు. భవిష్యత్‌లో శ్రీకాంత్ ఏం సాధించాలని మీరు కోరుకుంటున్నారు పుల్లెల గోపీచంద్ అంత ఎత్తుకు ఎదగాలని, ఒలింపిక్స్‌లో ఆడాలని కోరుకుంటున్నాం. అకాడమీ ఏర్పాటుచేసి తనలాంటి క్రీడాకారుల్ని తయారు చేయాలని ఆశిస్తున్నాం. శ్రీకాంత్‌కు మీరిచ్చే సలహా ఏమైనా ఉందా విజయాన్ని ఎప్పుడూ తలకెక్కించుకోకూడదు. భవిష్యత్‌లో మరింత కష్టపడి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. మీ చిన్నోడికి మీరిచ్చే కానుక ఏమైనా ఉందా చిన్నోడికే కాదు పెద్దోడికి కూడా ఇచ్చేందుకు రెండు ఇంక్ పెన్నులు కొని సిద్ధంగా ఉంచాం. -
స్వచ్ఛ భారత్‌లో గుత్తా జ్వాల
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల మంగళవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలుపంచుకుంది. ఎల్బీ స్టేడియంలోని బాక్సింగ్ హాల్ నుంచి ఇండోర్ స్టేడియం వరకు రోడ్డుపై ఉన్న చెత్తను తొలగించింది. అలాగే స్టేడియం ఆవరణలో ఉన్న వాణిజ్య దుకాణదారులు తమ చెత్తను రోడ్డుపై వేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరింది. అపరిశుభ్ర వాతావరణంతో క్రీడాకారుల ఆరోగ్యానికి హాని కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ప్రతీరోజు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న మున్సిపల్ సిబ్బంది, స్వీపర్ల ప్రయోజనాలను ప్రభుత్వం నెరవేర్చాలని జ్వాల విజ్ఞప్తి చేసింది. ఈసందర్భంగా స్వచ్ఛ భారత్‌లో పాల్గొనాలని ఎంపీ కల్వకుంట్ల కవిత, అశ్విని, దీపికా పదుకొనె, ఆమిర్ ఖాన్, ఓజా, నితిన్ పేర్లను ఆమె నామినేట్ చేసింది. -
పవన్ కళ్యాణ్... మీరూ పాల్గొనండి
‘స్వచ్ఛ భారత్’లో సింధు సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు ‘స్వచ్ఛభారత్' కార్యక్రమంలో పాల్గొంది. నగరంలోని లింగంపల్లి రైల్వేస్టేషన్ దగ్గర స్కూల్ పిల్లలతో కలిసి రోడ్లను శుభ్రం చేసింది. స్వచ్ఛభారత్‌లో పాల్గొనే సెలబ్రిటీలు సాధారణంగా మరో 9 మందిని ఈ కార్యక్రమంలో పాల్గొనమని ఆహ్వానిస్తారు. దీనిని గౌరవించిన వారు వచ్చి పాల్గొంటారు. టెన్నిస్ స్టార్ సానియామీర్జా ఇటీవల స్వచ్ఛభారత్‌లో పాల్గొని ప్రతిపాదించిన 9 మంది పేర్లలో సింధు కూడా ఉంది. తాజాగా సింధు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి 9 మందిని కాకుండా ముగ్గురినే ప్రతిపాదించింది. ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్‌తో పాటు టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలలను స్వచ్ఛభారత్‌లో పాల్గొనాల్సిందిగా కోరింది. -
మరి నా సంగతేంటి!
ఒలింపిక్స్ ప్రోత్సాహకమే అందలేదు సైనా నెహ్వాల్ ఆవేదన సాక్షి, హైదరాబాద్: సానియామీర్జాను తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన వివాదం కొనసాగుతుండగానే ... మరో అగ్రశ్రేణి క్రీడాకారిణి మరో రకంగా తన అసంతృప్తిని బయట పెట్టింది. ఆ ప్లేయర్ బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ కావటం విశేషం. 2012లో లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత నిబంధనల ప్రకారం తనకు ప్రభుత్వం నుంచి అందాల్సిన మొత్తం ఇప్పటికీ అందలేదని ఆమె వ్యాఖ్యానించింది. సానియా ‘అంబాసిడర్’ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఈ మాట అనడం గమనార్హం. ‘తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జా ఎంపిక కావడం సంతోషకరం. తెలంగాణ పట్ల నేను కూడా గర్వపడుతున్నాను. కానీ రెండేళ్ల క్రితం ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించాను. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన నగదు ప్రోత్సాహకమే రాష్ట్ర ప్రభుత్వంనుంచి దక్కకపోవడం నన్ను కలిచి వేసింది’ అని సైనా ట్వీట్ చేసింది. ఇంకెన్నాళ్లు..: ప్రభుత్వం తరఫునుంచి ఇన్నాళ్లుగా ఎలాంటి స్పందన లేకపోవడం వల్లే తాను ఇప్పుడు బహిరంగంగా తన బాధ వెల్లడించాల్సి వచ్చిందని సైనా ‘సాక్షి’తో చెప్పింది. సమైక్య రాష్ట్రంలో పతకం గెలిచానని, ఇప్పుడు తనకు ఎవరు క్యాష్ అవార్డు ఇస్తారో కూడా తెలియని సందిగ్ధత ఉందని, దీనికి ఎవరూ సమాధానం ఇవ్వడం లేదని ఆమె ఆవేదనగా చెప్పింది. ‘నా అంతట నేనుగా చెప్పకూడదని ఇప్పటి వరకు అనుకున్నాను. ఇంకెన్నాళ్లు ఆగమంటారు. రెండేళ్లు గడిచిపోయాయి. సానియాకో మరొకరికో ఏదైనా ఇవ్వడం పట్ల నాకు బాధ లేదు. కానీ మాకు న్యాయంగా, నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిందైనా అందించాలిగా’ అని సైనా వ్యాఖ్యానించింది. ఒలింపిక్స్‌లో పతకం గెలిచాక అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సైనాకు రూ. 50 లక్షలు బహుమతి ప్రకటించారు. -
కావాల్సింది ప్రోత్సాహమే: సైనా
రాయదుర్గం, న్యూస్‌లైన్: క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభిస్తేనే సత్ఫలితాలు సాధ్యమని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ అభిప్రాయపడింది. పిల్లలు క్రీడలను కెరీర్‌గా ఎంచుకోకపోవడానికి కారణం ప్రోత్సాహం కొరవడటమేనని స్టార్ షూటర్ గగన్ నారంగ్ అన్నారు. వీరిద్దరితో పాటు భారత హాకీ మాజీ కెప్టెన్ వీరేన్ రస్కిన్హా బుధవారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఐఎస్ఎల్ గేమ్స్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సైనా మాట్లాడుతూ ఒలింపిక్ స్వర్ణమే తన లక్ష్యమని చెప్పింది. చైనాలో ఒకే పట్టణంలో 40 నుంచి 50 అకాడమీలుంటే ఇక్కడ చెప్పుకోదగినవి ఒకటో రెండో ఉంటాయని తెలిపింది. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ (ఓజీక్యూ) లాంటి సంస్థలు భారత్‌లో మరిన్ని ఉంటే చక్కని ఫలితాలు పొందవచ్చని చెప్పింది. ఐఎస్బీలో చదవడం కన్నా క్రీడల్లో రాణించడం చాలా కష్టమని షూటర్ నారంగ్ అన్నారు. ఆటగాళ్లకు ఆర్థిక, సాంకేతిక సహకారం లభిస్తేనే పతకాలు సాధ్యమవుతాయని చెప్పారు. రస్కిన్హా మాట్లాడుతూ క్రీడల్లో భారత్ వెలిగిపోవాలనే లక్ష్యంతోనే ఓజీక్యూను స్థాపించామన్నారు.