భారత బ్యాడ్మింటన్ స్టార్ సయ్యద్ మోదీ ఎప్పటిలాగే ఆ రోజు సాయంత్రం కూడా ప్రాక్టీస్ ముగించుకొని లక్నోలోని కేడీ సింగ్ బాబు స్టేడియం నుంచి బయటకు వచ్చాడు. 26 ఏళ్ల వయసులో తన కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్న అతను మరిన్ని విజయాలు సాధించాలని పట్టుదలగా సాధన చేస్తున్నాడు. అయితే అతనికి తెలీదు... మరికొన్ని క్షణాల్లో తన ఆటే కాదు జీవితం కూడా ముగిసిపోతుందని! అనూహ్యంగా కారులోంచి దిగి దూసుకొచ్చిన నలుగురు వ్యక్తులు తుపాకులతో సయ్యద్ మోదీపై విరుచుకుపడటంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు. ఒక అద్భుత క్రీడాకారుడి జీవితం ఇలా విషాదాంతం కాగా... తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఈ హత్య వెనుక ఉన్నట్లు ఆరోపణలు రావడం మరో వైచిత్రి.
28 జూలై, 1988... సయ్యద్ మోదీ హత్య జరిగిన రోజు. తిరుగులేని ఆటతో అతను అప్పటికే వరుసగా ఎనిమిదిసార్లు (1980–1987) జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌గా నిలిచాడు. 1982 బ్రిస్బేన్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, అదే ఏడాది ఢిల్లీ ఆసియా క్రీడల్లో కాంస్యం అతని ఖాతాలో ఉన్నాయి. ఆ సమయంలో ఎంతో గుర్తింపు ఉన్న ఆస్ట్రియన్ ఇంటర్నేషనల్, యూఎస్‌ఎస్‌ఆర్ ఇంటర్నేషనల్ టైటిల్స్ కూడా మోదీ గెలుచుకున్నాడు. 1981లో ‘అర్జున అవార్డు’ కూడా దక్కింది. 14 ఏళ్ల వయసులో జాతీయ జూనియర్ చాంపియన్‌గా మారినప్పటి నుంచి చనిపోయే వరకు మోదీ షటిల్ ప్రస్థానం అద్భుతంగా సాగింది. ప్రకాశ్ పదుకొనే తర్వాత భారత్ నుంచి వచ్చిన మరో స్టార్‌గా అతను పేరు ప్రఖ్యాతులు పొందాడు. 1962లో డిసెంబర్ 31న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో సయ్యద్ మోదీ జన్మించాడు. పేదరిక నేపథ్యం (తండ్రి చక్కెర మిల్లులో పని చేసేవాడు) నుంచి వచ్చి కేవలం తన ప్రతిభతో దూసుకుపోయి కుటుంబంలో సంతోషం పంచాడు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు.
ఆమె రాకతో...
జూనియర్ స్థాయిలో ఆడేటప్పుడే సహచర షట్లర్ అమితా కులకర్ణితో మోదీకి పరిచయం ఏర్పడింది. కొన్నేళ్ల తర్వాత అది ప్రేమగా మారింది. మహారాష్ట్ర హిందూ అయిన అమితా పెద్ద చదువులు చదివిన ఉన్నతస్థాయి కుటుంబం నుంచి వచ్చింది. ఇద్దరి నేపథ్యాలు పూర్తి భిన్నంగా ఉండటంతో సహజంగానే ఇరు కుటుంబాలు పెళ్లికి నిరాకరించాయి. దాంతో వీరిద్దరు పెద్దలను ఎదిరించి ముందడుగు వేసి 1984లో పెళ్లి చేసుకున్నారు. అయితే చాలా మంది భయపడినట్లుగానే పలు కారణాలతో వివాహం తర్వాత భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఒకే ప్రొఫెషన్‌కు చెందిన వారు కావడంతో అహం కూడా తోడైంది. ఆ ప్రభావం తనపై పడి మానసికంగా ఇబ్బంది పడ్డ మోదీ 1988లో జాతీయ చాంపియన్‌షిప్‌ను కోల్పోయాడు. చివరకు పాప ‘ఆకాంక్ష’ పుట్టిన కొద్ది రోజులకే చిన్న వయసులోనే అతని జీవితం ముగిసిపోయింది.
మోదీ పేరు వెనక...
సయ్యద్ మోదీ అసలు పేరు సయ్యద్ మెహదీ హసన్ జైదీ. స్కూల్ రికార్డుల్లో పేరు నమోదు చేస్తున్న సమయంలో మెహదీ పేరును ‘మోదీ’ అని తప్పుగా రాయడంతో అదే కొనసాగింది. అతను కూడా దానిని మార్చుకునే ప్రయత్నం చేయలేదు. మోదీ ఘనతలను గుర్తించే విధంగా భారత బ్యాడ్మింటన్ సంఘం సయ్యద్ మోదీ పేరుతో లక్నోలో ప్రతి ఏటా టోర్నీని నిర్వహిస్తోంది. మోదీ హత్యోదంతం నేపథ్యంతో 1991లో ప్రముఖ హిందీ నటుడు దేవానంద్ నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించి ‘సౌ కరోడ్’ పేరుతో సినిమాను నిర్మించారు.
అతడే కారణమా?
సయ్యద్ మోదీ మొత్తం వ్యవహారంలో ‘మూడో వ్యక్తి’ ప్రమేయంపైనే అందరి దృష్టీ పడింది. అతి సంపన్నుడైన రాజకీయ నేత, అప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ క్రీడల మంత్రి సంజయ్ సింగ్‌తో అమితా స్నేహమే మోదీ ముగింపునకు కారణమైందని అంతటా వినిపించింది. భర్త వారిస్తున్నా సంజయ్‌తో ఆమె తన బంధాన్ని కొనసాగించింది. తన మాట వినకుండా బిడ్డకు హిందూ పేరు పెట్టడంతో మోదీ అనుమానం మరింత పెరిగింది. హత్య అనంతరం జరిగిన సీబీఐ విచారణలో వీటికి సంబంధించి పలు అంశాలు బయట పడ్డాయి. సంజయ్, అమితాలతో పాటు మరో ఐదుగురి పేర్లతో చార్జ్ షీట్ తయారైంది. అయితే వీరిద్దరు కలిసి హత్యకు కుట్ర పన్నారని మాత్రం ఎలాంటి సాక్ష్యాల ద్వారా కూడా నిరూపితం కాలేదు. నాటి ప్రధానులు రాజీవ్‌గాంధీకి, వీపీ సింగ్‌లకు ఆత్మీయ స్నేహితుడు, అమేథీకి చెందిన సంజయ్ సింగ్‌కు ఆ సాన్నిహిత్యం కూడా ఇలాంటి సమయంలో కలిసొచ్చిందని చెబుతారు.
కేసు నుంచి తమ పేర్లు తప్పించిన కొద్ది రోజులకే 1995లో సంజయ్ తన మొదటి భార్య, మాజీ ప్రధాని వీపీ సింగ్ మేనకోడలు గరీమా సింగ్‌ను వదిలేసి అమితాను పెళ్లి చేసుకున్నాడు. చివరకు కాల్పులు జరిపిన వారిలో ఒకరికి మాత్రం జైలు శిక్ష విధించిన కోర్టు ‘హత్య వెనుక కారణం ఏమిటో తేల్చలేకపోయారు’ అంటూ ఈ కేసును 2009లో మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సయ్యద్ మోదీ జీవిత క్రమాన్ని చూస్తూ వచ్చిన సన్నిహితులు, అభిమానుల దృష్టిలో అతని చావుకు అమితా, సంజయ్‌లే కారణమని నమ్మినా... అధికారికంగా అది రుజువు కాలేదు. తర్వాతి కాలంలో సంజయ్ సింగ్ వివిధ పార్టీలు మారుతూ లోక్‌సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. మరోవైపు అమితా అమేథీ నియోజకవర్గం నుంచి 2002లో బీజేపీ తరఫున... 2007లో కాంగ్రెస్ తరఫున శాసనసభ్యురాలిగా ఎన్నికైంది. కానీ ఒక గొప్ప ఆటగాడు, మంచి వ్యక్తి జీవితం మాత్రం ఇంత విషాదంగా ముగిసిపోవడం అందరినీ కలచి వేసింది.
Comments
Please login to add a commentAdd a comment