మరి నా సంగతేంటి!
ఒలింపిక్స్ ప్రోత్సాహకమే అందలేదు
సైనా నెహ్వాల్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: సానియామీర్జాను తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన వివాదం కొనసాగుతుండగానే ... మరో అగ్రశ్రేణి క్రీడాకారిణి మరో రకంగా తన అసంతృప్తిని బయట పెట్టింది. ఆ ప్లేయర్ బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ కావటం విశేషం. 2012లో లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత నిబంధనల ప్రకారం తనకు ప్రభుత్వం నుంచి అందాల్సిన మొత్తం ఇప్పటికీ అందలేదని ఆమె వ్యాఖ్యానించింది.
సానియా ‘అంబాసిడర్’ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఈ మాట అనడం గమనార్హం. ‘తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జా ఎంపిక కావడం సంతోషకరం. తెలంగాణ పట్ల నేను కూడా గర్వపడుతున్నాను. కానీ రెండేళ్ల క్రితం ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించాను. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన నగదు ప్రోత్సాహకమే రాష్ట్ర ప్రభుత్వంనుంచి దక్కకపోవడం నన్ను కలిచి వేసింది’ అని సైనా ట్వీట్ చేసింది.
ఇంకెన్నాళ్లు..: ప్రభుత్వం తరఫునుంచి ఇన్నాళ్లుగా ఎలాంటి స్పందన లేకపోవడం వల్లే తాను ఇప్పుడు బహిరంగంగా తన బాధ వెల్లడించాల్సి వచ్చిందని సైనా ‘సాక్షి’తో చెప్పింది. సమైక్య రాష్ట్రంలో పతకం గెలిచానని, ఇప్పుడు తనకు ఎవరు క్యాష్ అవార్డు ఇస్తారో కూడా తెలియని సందిగ్ధత ఉందని, దీనికి ఎవరూ సమాధానం ఇవ్వడం లేదని ఆమె ఆవేదనగా చెప్పింది.
‘నా అంతట నేనుగా చెప్పకూడదని ఇప్పటి వరకు అనుకున్నాను. ఇంకెన్నాళ్లు ఆగమంటారు. రెండేళ్లు గడిచిపోయాయి. సానియాకో మరొకరికో ఏదైనా ఇవ్వడం పట్ల నాకు బాధ లేదు. కానీ మాకు న్యాయంగా, నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిందైనా అందించాలిగా’ అని సైనా వ్యాఖ్యానించింది. ఒలింపిక్స్‌లో పతకం గెలిచాక అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సైనాకు రూ. 50 లక్షలు బహుమతి ప్రకటించారు.