జకార్తాలో జైహింద్ | Saina Nehwal medal in the World Championship | Sakshi
Sakshi News home page

జకార్తాలో జైహింద్

Published Sat, Aug 15 2015 5:36 AM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM

జకార్తాలో జైహింద్

జకార్తాలో జైహింద్

భారత స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందే జకార్తాలో మువ్వన్నెలు రెపరెపలాడాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ వేదికపై సైనా నెహ్వాల్ మరోసారి చైనా గోడను బద్దలు కొట్టింది. కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించినా ఇన్నాళ్లూ అందని ద్రాక్షలా ఊరిస్తున్న ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాన్ని సైనా ఖరారు చేసుకుంది. ఏకంగా ఐదుసార్లు ఈ మెగా టోర్నీ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయిన ఈ హైదరాబాదీ... ఆరో ప్రయత్నంలో అద్భుతం చేసింది. యిహాన్ వాంగ్‌పై విజయంతో తొలిసారి ఈ మెగాటోర్నీలో సెమీస్‌కు చేరింది. ఇక ఓడినా కాంస్యం ఖాయం. గెలిస్తే మెరుగైన పతకం... ఏదైనా సైనా కెరీర్ పరిపూర్ణమైనట్లే.
- ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సైనాకు పతకం
- క్వార్టర్స్‌లో యిహాన్‌పై అద్భుత విజయం
- సింధు, జ్వాల-అశ్వినిలకు నిరాశ
జకార్తా:
గతంలో తనకెంతో కలిసొచ్చిన జకార్తా నగరంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మరోసారి జూలు విదిల్చింది. ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఊరిస్తున్న ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాన్ని దక్కించుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సైనా నెహ్వాల్ 21-15, 19-21, 21-19తో ఆరో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)పై గెలిచి సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.  మరోవైపు వరుసగా మూడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాన్ని నెగ్గాలని ఆశించిన పీవీ సింధు... రెండోసారి ఈ ఘనత సాధించాలనుకున్న గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జంటకు నిరాశ ఎదురైంది.  క్వార్టర్ ఫైనల్లో  సింధు 17-21, 21-19, 16-21తో ఎనిమిదో సీడ్ సుంగ్ జీ హున్ చేతిలో పరాజయం పాలవ్వగా... జ్వాల-అశ్విని జంట 23-25, 14-21తో ఫుకుమాన్-కురుమి యోనావో (జపాన్) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది.
 
ఆద్యంతం హోరాహోరీ
గతంలో తొమ్మిదిసార్లు యిహాన్ వాంగ్ చేతిలో ఓడి, కేవలం రెండుసార్లు నెగ్గిన సైనాకు ఈసారీ తీవ్ర ప్రతిఘటనే ఎదురైంది. అయితే కీలకదశలో సైనా దూకుడుగా ఆడి నిర్ణాయక పాయింట్లను సంపాదించింది. సుదీర్ఘ ర్యాలీల్లో కొన్నిసార్లు సైనా, మరికొన్నిసార్లు యిహాన్ పైచేయి సాధించింది. నిర్ణాయక మూడో గేమ్ చివరి దశలో సైనా కళ్లు చెదిరే స్మాష్‌ల ధాటికి యిహాన్ అనవసర తప్పిదాలు చేసింది. స్కోరు 20-19 వద్ద సైనా కొట్టిన స్మాష్‌కు రిటర్న్ ఇవ్వలేకపోయిన యిహాన్ షటిల్‌ను కోర్టు పక్కకు కొట్టింది. దాంతో సైనా విజయం ఖాయమైంది. తొలిసారి ఈ మెగా ఈవెంట్‌లో సెమీఫైనల్‌కు చేరిన ఆనందంలో సైనా తన రాకెట్‌ను గాల్లోకి విసిరేసి సంబరం చేసుకుంది.
 
- గతంలో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన సైనా నాలుగుసార్లు చైనా క్రీడాకారిణుల (2009లో లిన్ వాంగ్; 2010లో షిజియాన్ వాంగ్; 2011లో జిన్ వాంగ్; 2014లో లీ జురుయ్) చేతిలో, మరోసారి కొరియా ప్లేయర్ (2013లో బే యోన్ జు) చేతిలో ఓడిపోయింది.
 
- జకార్తాలోనే జరిగే ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో సైనా మూడుసార్లు (2009, 2010, 2012) టైటిల్ సాధించి, మరోసారి రన్నరప్‌గా (2011లో) నిలిచింది.
 
శనివారం జరిగే సెమీఫైనల్లో అన్‌సీడెడ్, ప్రపంచ 29వ ర్యాంకర్ లిందావెని ఫనెత్రి (ఇండోనేసియా)తో సైనా తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సైనా 2-1తో ఫనెత్రిపై ఆధిక్యంలో ఉంది. మరో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో  సుంగ్ జీ హున్  (దక్షిణ కొరియా) ఆడుతుంది.
 
మధ్యాహ్నం గం. 1.30 నుంచి
స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement