సైనా సాధించేనా!
ఒడెన్స్ (డెన్మార్క్): ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మరో టైటిల్ లక్ష్యంగా డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో బరిలోకి దిగుతోంది. మంగళవారం మొదలయ్యే ఈ మెగా టోర్నీలో సైనాకు టాప్ సీడింగ్ లభించింది. తొలి రోజు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. తొలి రౌండ్‌లో సైనా థాయ్‌లాండ్‌కు చెందిన ప్రపంచ 17వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్‌బుమ్‌రంగ్‌ఫన్‌తో ఆడుతుంది. 2012లో డెన్మార్క్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన సైనా ఈ సీజన్‌లో ఇండియా ఓపెన్, సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీల్లో టైటిల్స్ నెగ్గడంతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో తొలిసారి రజత పతకాలు సాధించి జోరు మీదుంది.
సైనాతోపాటు భారత్‌కే చెందిన మరో స్టార్ ప్లేయర్ పీవీ సింధు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. బుధవారం జరిగే తొలి రౌండ్‌లో మరియా ఫెబె కుసుమస్తుతి (ఇండోనేసియా)తో సింధు ఆడుతుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, ప్రణయ్, అజయ్ జయరామ్ పోటీపడనున్నారు. శ్రీకాంత్, జయరామ్ ప్రత్యర్థులెవరూ ఇంకా ఖరారు కాలేదు. కశ్యప్ మాత్రం తొలి రౌండ్‌లో మలేసియా స్టార్ లీ చోంగ్ వీతో, సు జెన్ హావో (చైనీస్ తైపీ)తో ప్రణయ్ ఆడనున్నారు.