కావాల్సింది ప్రోత్సాహమే: సైనా
రాయదుర్గం, న్యూస్‌లైన్: క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభిస్తేనే సత్ఫలితాలు సాధ్యమని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ అభిప్రాయపడింది. పిల్లలు క్రీడలను కెరీర్‌గా ఎంచుకోకపోవడానికి కారణం ప్రోత్సాహం కొరవడటమేనని స్టార్ షూటర్ గగన్ నారంగ్ అన్నారు.
వీరిద్దరితో పాటు భారత హాకీ మాజీ కెప్టెన్ వీరేన్ రస్కిన్హా బుధవారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఐఎస్‌ఎల్ గేమ్స్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సైనా మాట్లాడుతూ ఒలింపిక్ స్వర్ణమే తన లక్ష్యమని చెప్పింది. చైనాలో ఒకే పట్టణంలో 40 నుంచి 50 అకాడమీలుంటే ఇక్కడ చెప్పుకోదగినవి ఒకటో రెండో ఉంటాయని తెలిపింది. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ (ఓజీక్యూ) లాంటి సంస్థలు భారత్‌లో మరిన్ని ఉంటే చక్కని ఫలితాలు పొందవచ్చని చెప్పింది. ఐఎస్‌బీలో చదవడం కన్నా క్రీడల్లో రాణించడం చాలా కష్టమని షూటర్ నారంగ్ అన్నారు. ఆటగాళ్లకు ఆర్థిక, సాంకేతిక సహకారం లభిస్తేనే పతకాలు సాధ్యమవుతాయని చెప్పారు. రస్కిన్హా మాట్లాడుతూ క్రీడల్లో భారత్ వెలిగిపోవాలనే లక్ష్యంతోనే ఓజీక్యూను స్థాపించామన్నారు.