సైనాకు పరీక్ష
లక్నో: గతేడాది ఒక్క టోర్నీలోనూ ఫైనల్‌కు చేరుకోలేకపోయిన భారత స్టార్ సైనా నెహ్వాల్ ఈ ఏడాది స్వదేశంలో సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉంది. బుధవారం మొదలయ్యే ఇండియా గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ మెయిన్ ‘డ్రా’ పోటీల్లో సైనాకు టాప్ సీడింగ్ లభించింది. తొలి రౌండ్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి మటిల్డా పీటర్సన్ (స్వీడన్)తో ఆడుతుంది. మరో పార్శ్వంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన పి.వి.సింధుకు రెండో సీడింగ్ దక్కింది. తొలి రౌండ్‌లో ఆమె లీ లియాన్ యాంగ్ (మలేసియా)తో తలపడుతుంది. అన్ని అడ్డంకులను అధిగమిస్తే సైనా, సింధు ఫైనల్లో ఎదురుపడతారు.
పురుషుల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన పారుపల్లి కశ్యప్ టాప్ సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. తొలి రౌండ్‌లో అనూప్ శ్రీధర్ (భారత్)తో కశ్యప్ ఆడతాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మహ్మద్ ఆదిబ్ (మలేసియా)తో చేతన్ ఆనంద్; సౌరవ్ అగర్వాల్ (భారత్) ఎన్‌వీఎస్ విజేత; వాసుదేవన్ (భారత్)తో గురుసాయిదత్; అభినవ్ ప్రకాశ్ (భారత్)తో సాయిప్రణీత్; మయాంక్ బెహల్ (భారత్)తో కిడాంబి శ్రీకాంత్; సూన్ హువాట్ (మలేసియా)తో రోహిత్ యాదవ్ ఆడతారు.
మెయిన్ ‘డ్రా’కు సంతోషి
ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సంతోషి హాసిని మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల్లో సంతోషి ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది.