సెమీఫైనల్లో సింధు పరాజయం | PV Sindhu loses in World Badminton Championships semi-final | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్లో సింధు పరాజయం

Published Sun, Aug 11 2013 12:06 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM

సెమీఫైనల్లో సింధు పరాజయం

సెమీఫైనల్లో సింధు పరాజయం

 ఊహకందని ప్రదర్శనతో ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో అద్భుత ఫలితాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ యువతార పూసర్ల వెంకట సింధు జైత్రయాత్రకు అడ్డుకట్ట పడింది. ఒక్క విజయం సాధించి ఉంటే ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ ప్లేయర్‌గా సింధు కొత్త చరిత్ర సృష్టించేది.
 
 అయితే ఒక్కసారిగా పెరిగిన అంచనాలు... అలసట... ఒత్తిడి... ప్రత్యర్థి పకడ్బందీ ఆటతీరు... వెరసి ఈ మెగా ఈవెంట్‌లో ఈ 18 ఏళ్ల తెలుగు తేజానికి సెమీఫైనల్లో ఓటమి ఎదురైంది. అయితేనేం ఈ పోటీల చరిత్రలో మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా సింధు గుర్తింపు పొందింది.
 
 గ్వాంగ్‌జూ (చైనా):  ఆశ ఆవిరైంది. అద్భుతం మహాద్భుతంగా మారలేకపోయింది. అందరి అంచనాలను తారుమారు చేసి ప్రపంచ చాంపియన్‌షిప్ సెమీఫైనల్‌కు చేరిన  తెలుగు అమ్మాయి పి.వి. సింధు సంచలనాలకు తెరపడింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ యిహాన్ వాంగ్ (చైనా)ను... 2010 ఆసియా క్రీడల విజేత షిజియాన్ వాంగ్ (చైనా)ను వారి గడ్డపైనే బోల్తా కొట్టించిన సింధు సెమీఫైనల్లో సహజశైలిలో ఆడలేకపోయింది.
 
  ప్రపంచ మూడో ర్యాంకర్, హ్యాట్రిక్ జూనియర్ వరల్డ్ మాజీ చాంపియన్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్)తో 36 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సింధు 10-21, 13-21తో ఓటమి పాలై కాంస్య పతకంతో సంతృప్తి పడింది. మరో సెమీఫైనల్లో టాప్ సీడ్ లీ జురుయ్ (చైనా) 21-5, 21-11తో యోన్ జూ బే (దక్షిణ కొరియా)ను ఓడించి ఆదివారం జరిగే ఫైనల్లో రత్చనోక్‌తో అమీతుమీకి సిద్ధమైంది. సింధును ఓడించడంద్వారా ఈ పోటీల చరిత్రలో థాయ్‌లాండ్ తరఫున ఫైనల్‌కు చేరిన తొలి ప్లేయర్‌గా 18 ఏళ్ల రత్చనోక్ చరిత్ర సృష్టించింది.
 
 ఇద్దరు చైనా స్టార్స్‌ను ఓడించి సెమీఫైనల్‌కు చేరిన సింధును రత్చనోక్ ఏమాత్రం తక్కువ అంచనా వేయలేదు. సింధు దూకుడుగా ఆడితే తనకూ భంగపాటు తప్పదని భావించిన రత్చనోక్ ఏదశలోనూ ఆ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడింది. ఆద్యంతం తన షాట్‌లలో వైవిధ్యం ఉండేలా పక్కా వ్యూహంతో ఆడి సింధును పూర్తిగా కట్టడి చేయడంలో సఫలమైంది. క్రాస్‌కోర్టు హాఫ్ స్మాష్‌లను ప్రయోగిస్తూ పలు పాయింట్లు నెగ్గిన ఈ థాయ్‌లాండ్ స్టార్ నెట్‌వద్ద కూడా పైచేయి సాధించింది. తొలి గేమ్‌లో 11-4తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె ఆ తర్వాత అదే జోరును కనబరిచింది. మ్యాచ్ మొత్తంలో రత్చనోక్ ఆటతీరును అంచనా వేయలేకపోయిన సింధు చాలాసార్లు అనవసర తప్పిదాలు చేసింది. షటిల్స్ గమనాన్ని అంచనా వేయడంలోనూ తడబడింది. ఆమె కొట్టిన కొన్ని షాట్‌లు గతితప్పి అవుట్‌గా వెళ్లాయి. కొన్నేమో నెట్‌కు తగిలాయి. ఫలితంగా రెండో గేమ్ ఆరంభంలో రత్చనోక్ 8-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. వ్యూహం మార్చి తన ప్రత్యర్థి జోరును అడ్డుకట్ట వేయాలని సింధు అనుకున్నా రత్చనోక్ ఆ అవకాశమే ఇవ్వలేదు. దాంతో సింధుకు ఓటమి తప్పలేదు.
 
 ప్రైజ్‌మనీ లేదు... పాయింట్లే వస్తాయి
 సెమీఫైనల్లో ఓడిన సింధుకు కాంస్య పతకంతోపాటు 8400 ర్యాంకింగ్ పాయింట్లు వస్తాయి. సింధుకే కాకుండా ఈ పోటీల్లో ఎవరికీ ప్రైజ్‌మనీ రావడంలేదు. కారణం 1977లో ప్రపంచ చాంపియన్‌షిప్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఈవెంట్‌కు ఎలాంటి ప్రైజ్‌మనీని కేటాయించడంలేదు. విజేతకు స్వర్ణ పతకం... రన్నరప్‌కు రజత పతకం...  సెమీఫైనల్లో ఓడిన ఇద్దరికి కాంస్య పతకాలు మాత్రం ఇస్తారు. ఈ ప్రదర్శనతో ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్న సింధు వచ్చే గురువారం విడుదల చేసే తాజా ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్-10లోకి వచ్చే అవకాశముంది.
 
 ‘ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆడిన తొలిసారే కాంస్యం సాధించడం గొప్ప ఘనతగా భావిస్తున్నాను. నిజానికి నా డ్రా చాలా కఠినంగా ఉంది. ఇద్దరు చైనా క్రీడాకారిణులు ఉన్నా.. గెలుస్తాననే నమ్మకంతోనే టోర్నీని ప్రారంభించాను. గాయం నుంచి కోలుకుని టోర్నీ బరిలోకి దిగాను. వచ్చే ఏడాది మరింత బాగా ఆడేందుకు ప్రయత్నిస్తా. సెమీస్‌లో చాలా తప్పులు చేశాను. ప్రాక్టీస్‌లో నా బలహీనతలపై దృష్టిపెడతా.  గోపీ సర్ ఎలా చేయమంటే అలా చేస్తా.  నాపై ఉన్న అంచనాలను అధిగమించేందుకు ప్రయత్నించా. అయితే ఇది ఒత్తిడి మాత్రం కాదు’ - సింధు
 
 
 ‘సంతోషంగా ఉన్నాం’
 ఈ రోజు సింధు ప్రదర్శన సరిగా లేదు. తన సహజశైలిలో ఆడలేకపోయింది. తర్వాతి టోర్నమెంట్‌లో బాగా ఆడుతుందని ఆశిస్తున్నాను. రత్చనోక్ స్ట్రోక్స్‌ను సింధు తీయలేకపోయింది. కొన్ని తప్పులు చేసింది. ఈ స్థాయిలో అవి చేయాల్సినవి కావు. ఇప్పుడు కోచ్ గోపీచంద్ వీటిపై దృష్టి పెడతారనుకుంటా. ఏమైనా ఈ పతకంతో సంతోషంగా ఉన్నాం. డ్రా చాలా కఠినంగా ఉన్నా సెమీస్‌కు చేరి కాంస్యం సాధించడం గర్వంగా ఉంది.
 - పి.వి. రమణ, విజయ (సింధు తల్లిదండ్రులు)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement