‘ఖేల్ రత్న’కు ఆరు నామినేషన్లు
జాబితాలో పి.వి.సింధు
అర్జున అవార్డుకు మళ్లీ మహేశ్వరి పేరు
న్యూఢిల్లీ: హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ‘ఖేల్ రత్న’ అవార్డుకు నామినేట్ అయింది. ఈ ఏడాదికిగాను ఖేల్త్న్రకు ఆరుగురు క్రీడాకారుల పేర్లు నామినేట్ కాగా, వారిలో సింధుతోపాటు టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, గోల్ఫ్ ఆటగాడు జీవ్ మిల్కాసింగ్, అథ్లెటిక్స్ నుంచి కృష్ణ పూనియా, వికాస్ గౌడ, పారా అథ్లెట్ దేవేంద్ర ఝఝారియాలు ఉన్నారు. సింధు గత ఏడాదే అర్జున అవార్డు అందుకోగా, కృష్ణ పూనియా చివరి నిమిషం దాకా ఖేల్త్న్ర రేసులో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక అర్జున అవార్డుల కోసం పిస్టల్ షూటర్లు హీనా సిద్ధు, గురుప్రీత్ సింగ్, బ్యాడ్మింటన్ ఆటగాడు అరవింద్ భట్, క్రికెటర్ ఆర్.అశ్విన్ నామినేట్ అయ్యారు.
మహేశ్వరిని మళ్లీ నామినేట్ చేసిన ఏఎఫ్‌ఐ
ట్రిపుల్ జంపర్ రంజిత్ మహేశ్వరి పేరును అర్జున అవార్డు కోసం భారత అథ్లెటిక్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) మళ్లీ ప్రతిపాదించింది. గత ఏడాది మహేశ్వరిని అర్జున అవార్డుకు ఎంపిక చేసినా గతంలో డోప్ టెస్టులో పట్టుబడిన చరిత్ర వల్ల ప్రభుత్వం అతనికి అవార్డును నిరాకరించింది. అయితే 2008లో మహేశ్వరికి శాంపిల్స్‌ను పరీక్షించిన లేబొరేటరీకి అప్పట్లో గుర్తింపు లేదని, 2009లో మాత్రమే గుర్తింపు పొందిందని ఏఎఫ్‌ఐ అధికారి ఒకరు చెప్పారు.