'ఖేల్‌రత్న' పై హాకీ స్టార్ హర్మన్‌ప్రీత్ సింగ్
ప్రపంచకప్ పతకమే తదుపరి లక్ష్యం
సహచరులు తోడ్పాటు అద్భుతం
అమృత్‌సర్ శివారు గ్రామంలోని రైతు బిడ్డ హర్మన్‌ప్రీత్ సింగ్. హాకీలో మేటి ఆటగాడిగా ఎదిగాడు. దశాబ్దాల తర్వాత ఒలింపిక్స్ చరిత్రలో వరుస పతకాలు సాధించిన జట్టును నడిపించిన అతన్ని ప్రతిష్టాత్మక ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ అవార్డుకు ఎంపిక చేశారు.
ఈసారి హర్మన్‌తో పాటు ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్, ఒలింపిక్స్ ‘డబుల్ ధమాకా’ మనూ భాకర్ (షూటింగ్), పారాలింపిక్ చాంప్ ప్రవీణ్‌లను ఆ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా తన హాకీ ప్రయాణం, ప్రతిష్టాత్మక అవార్డు సాఫల్యంపై హర్మన్ హర్షం వ్యక్తం చేశాడు.
న్యూఢిల్లీ: అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’కు ఎంపికైన భారత హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ తన కెరీర్‌లో ఇదో గొప్ప సాఫల్యమన్నాడు. అయితే ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుతోనే మురిసిపోనని, కెరీర్‌లో మరెన్నో మైలురాళ్లు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నట్లు చెప్పాడు.
టోక్యో–2020, పారిస్–2024 ఒలింపిక్స్‌లలో భారత హాకీ జట్టు వరుసగా కాంస్య పతకాలు సాధించింది. ఇందులో స్టార్ డ్రాగ్ ఫ్లికర్ హర్మన్ కీలక భూమిక పోషించాడు. భారత అత్యున్నత క్రీడా పురస్కారానికి ఎంపికైన హర్మన్ మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే...
ఈ పయనం ఎంతో నేర్పింది
హాకీలో నా ప్రయాణం నాకెంతో నేరి్పంది. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కొన్నింటా గెలిచాం. మరికొన్ని మ్యాచ్‌ల్లో ఓడాం. కానీ ఫలితాలేవైనా నాకన్నీ అవి అనుభవ పాఠాలే. కెరీర్ మొదలైన రోజే నేనెలా ఎలా మెరుగవ్వాలి. ఏం చేయాలని నా మనసుకు స్వీయ లక్ష్యాన్ని పెట్టుకున్నాను. ఇప్పుడు జట్టుగా... సహచరులతో కలిసికట్టుగా విజయవంతమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఒలింపిక్స్ పతకాల్లో, నా ‘ఖేల్‌రత్న’లో సహచరుల అండదండలున్నాయి.
ప్రపంచకప్ పతకమే లక్ష్యం
హాకీలో అడుగు పెట్టిన 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతీ మ్యాచ్‌ను అస్వాదించాను. విజయానుభూతిని అనుభవించాను. ఓటమిని జీర్ణించుకున్నాను. ఇలా నేనెంచుకున్న క్రీడలో ప్రతీక్షణం సంతృప్తికరంగానే గడిచింది. అయితే ఇప్పుడు నా ప్రధాన లక్ష్యం ప్రపంచకప్ పతకమే!
బెల్జియంలో వచ్చే ఏడాది జరిగే ఈవెంట్‌లో భారత్‌ను సన్నద్ధం చేయడానికి తగిన సమయం లభించింది. ఒలింపిక్స్‌లో స్వర్ణం, మేజర్ టోర్నీల్లో విజయాలే మా జట్టు లక్ష్యాలు. దీనికోసం ఒక్కోఅడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది.
ఇప్పుడప్పుడే రిటైర్మెంటా?
ఇప్పుడైతే దృష్టంతా ఆటపైనే ఉంది. రిటైర్మెంట్‌కు చాలా సమయం ఉంది. ప్రపంచకప్, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు మిగిలే ఉన్నాయి. జట్టును పరిస్థితులకు తగ్గట్లుగా తయారు చేసి మేజర్ ఈవెంట్లలో గట్టి ప్రత్యర్థిగా బరిలోకి దించే కసరత్తు నిరంతరం చేస్తూనే ఉంటాం.
ముఖ్యంగా మ్యాచ్‌ల్లో టీమ్ కాంబినేషనే అత్యంత కీలకమవుతుంది. గెలిచినపుడు పొంగిపోయినట్లే ఓడినపుడు కుంగిపోకుండా ఎక్కడ లోపం జరిగిందో దృష్టిపెట్టి అధిగమించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment